Rain Alert: ఏపీకి మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణశాఖ. పలు ప్రాంతాల్లో శనివారం వాతావరణం మేఘావృతమై ఉంది. కొన్ని చోట్ల మోస్తరు నుంచి తేలిక వర్షాలు కురిశాయి. ఇదే వాతావరణ పరిస్థితులు ఇవాళ, రేపు కూడా కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం అమరావతి కేంద్రం ప్రకటించింది. రాగల రెండు రోజుల్లో పలుచోట్ల వర్షాలు పడతాయని అప్రమత్తం చేసింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాయల సీమలో ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.
రాష్ట్రంలోని ఉత్తరకోస్తా, యానాంలలో సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. దక్షిణ కోస్తాలో కూడా ఇదే వాతావరణం ఉంటుందని తెలిపింది. రాయలసీమలో ఒకటి రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం పరిసర ప్రాంతాల నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు శుక్రవారం ఆవరించి ఉన్న శనివారం బలహీనపడింది. మధ్య అస్సాం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో విస్తరించి కొనసాగుతుందని భారత వాతవరణ విభాగం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి సగటున 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని తెలిపింది. ఇక, పశ్చిమ రాజస్థాన్ నుంచి తూర్పు రాజస్థాన్, వాయవ్య మధ్యప్రదేశ్ మీదుగా కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడిందని వివరించింది. దిగువ ట్రోపో ఆవరణములో ఆంధ్రప్రదేశ్, యానాంలలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని వివరించింది.
తెలంగాణకు వానలు
తెలంగాణలో రానున్న రెండ్రోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. సగటున సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని పేర్కొన్నారు.
ఈ ప్రభావం కారణంగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తుఫానుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది.
ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శుక్రవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం శనివారం బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది.
ఇవాళ మంచిర్యాల, జయశంకర్ భూపాపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులలతో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇక సోమవారం రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులలతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.