ISRO Chairman Narayanan: తిరుమల శ్రీవారిని ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) చైర్మన్ వీ. నారాయణన్ దర్శించుకున్నారు. రాబోయే కీలక అంతరిక్ష ప్రయోగాల ముందు శ్రీవారి ఆశీస్సులు తీసుకునేందుకు ఆయన తిరుమల విచ్చేశారు. ఈ సందర్భంగా భారత ‘బాహుబలి’గా పేరుగాంచిన LVM3 రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన ఇస్రో చైర్మన్ నారాయణన్.. డిసెంబర్ 24 ఉదయం భారతదేశం నుంచి అత్యంత కీలకమైన LVM3 రాకెట్ ప్రయోగం జరగనున్నట్టు వెల్లడించారు. LVM3-M6 వాహకనౌక ద్వారా రెండు భారీ ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. ఇది భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు.
ఈ ప్రయోగం ప్రత్యేకత ఏమిటంటే.. భారత గడ్డపై నుంచి ప్రయోగించబడుతున్న అతి బరువైన ఉపగ్రహంగా ఇది రికార్డు సృష్టించనుందని ఇస్రో చైర్మన్ వెల్లడించారు. ముఖ్యంగా అమెరికాకు చెందిన అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. అంతర్జాతీయ వాణిజ్య అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరోసారి తన సామర్థ్యాన్ని చాటనుందని ఆయన చెప్పారు.
ఈ ఉపగ్రహం ద్వారా 4G, 5G సేవలు మరింత బలోపేతం అవుతాయని నారాయణన్ వివరించారు. మొబైల్ ఫోన్లకు నేరుగా కమ్యూనికేషన్ సౌకర్యం కల్పించే సాంకేతికత ఈ ఉపగ్రహంలో ఉండటం విశేషమన్నారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోనూ వేగవంతమైన కమ్యూనికేషన్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
LVM3 రాకెట్‌కు ఇది మూడవ ఎక్స్‌క్లూసివ్ వాణిజ్య మిషన్ అని ఇస్రో చైర్మన్ గుర్తు చేశారు. ఇప్పటివరకు LVM3 సిరీస్‌లో ఇది మొత్తం తొమ్మిదవ ప్రయోగమని తెలిపారు. ప్రతి ప్రయోగం విజయవంతంగా సాగడం ఇస్రో శాస్త్రవేత్తల కృషికి నిదర్శనమని ప్రశంసించారు.
ఇక గగన్‌యాన్ ప్రాజెక్ట్‌పై కూడా నారాయణన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2027ను లక్ష్యంగా చేసుకుని గగన్‌యాన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోందన్నారు. గగన్‌యాన్ మానవ సహిత ప్రయోగానికి ముందు మూడు మానవరహిత ప్రయోగాలు చేపట్టనున్నామని తెలిపారు. ప్రస్తుతం గగన్‌యాన్ అభివృద్ధి పనులు అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉన్నాయని చెప్పారు.
అంతరిక్షయాత్రికుల భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రతి దశను అత్యంత జాగ్రత్తగా అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, క్రూ మాడ్యూల్, రికవరీ సిస్టమ్స్ వంటి కీలక అంశాల్లో గణనీయమైన పురోగతి సాధించామని వెల్లడించారు.
దేశం కోసం చేపట్టే ప్రతి కీలక ప్రయోగానికి ముందు ఆధ్యాత్మిక బలం అవసరమని అన్నారు. శ్రీవారి ఆశీస్సులతో రాబోయే LVM3 ప్రయోగం కూడా విజయవంతం అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.