విశాఖకు ప్రతిష్టాత్మక గూగుల్ ఏఐ సెంటర్ రావడం కూటమి ప్రభుత్వ విజయం. అదే సందర్భంలో తాను చేయలేని పని కూటమి చేసే సరికి వైసీపీలో గుబులు పుట్టింది. కనీసం గూగుల్ సెంటర్ రాక గురించి ఎలాంటి ట్వీట్ కానీ, సందేశం కానీ సోషల్ మీడియాలో ఉంచలేదు జగన్. పాజిటివ్ గా కానీ, నెగెటివ్ గా కానీ ఒక్క వార్త కూడా రాయలేదు సాక్షి. మిగతా విషయాల్లో విమర్శలు చేస్తున్నారు కానీ, అభివృద్ధి విషయంలో విమర్శలు చేయడానికి వైసీపీకి ఛాన్స్ లేకుండా చేశారు సీఎం చంద్రబాబు. గూగూల్ తో మొదలైన ఉపాధి ఉద్యమం, మరింత ముందుకెళ్తే 2029 ఎన్నికల్లో వైసీపీకి కనీసం ప్రచార అస్త్రాలు కూడా దొరకవేమో.
వైసీపీ సైలెన్స్..
2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు అభివృద్ధి అంటూ పరుగులు తీశారు. కానీ ఈసారి కాస్త నిదానంగా ఆ పని మొదలు పెట్టారు. ముందు పథకాల అమలుపై ఫోకస్ పెట్టారు. సూపర్ సిక్స్ లో 5 పథకాలు పక్కాగా పట్టాలెక్కగా, మరో పథకం అమలుకి కసరత్తులు జరుగుతున్నాయి. ఆటో డ్రైవర్ల సేవలో అనేది సూపర్ సిక్స్ లో లేదు, కానీ దాన్ని కూడా అమలు చేసి మంచి మార్కులు కొట్టేశారు సీఎం చంద్రబాబు. ప్రజలు ఏం కోరుకుంటారనేది ముందుగా చేసేసి, ఆ తర్వాత అభివృద్ధిపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఇటీవలే అమరావతిలో సీఆర్డీఏ నూతన భవనం ప్రారంభమైంది. ఈ భవనం ఖర్చుల లెక్కలు తీసి, అంతెందుకు, ఇంతెందుకు అంటూ వైసీపీ రాద్ధాంతం చేస్తోంది. ప్రతిపక్షం కాబట్టి, ఆమాత్రం హడావిడి సహజమే. అయితే ఇప్పుడు ఆ విమర్శలకు కూడా చోటు లేకుండా చేశారు సీఎం చంద్రబాబు. గూగుల్ ఏఐ సెంటర్ విశాఖకు తీసుకు రావడం పట్ల వైసీపీ నుంచి కనీస స్పందన లేదు. ఇలాంటి మెగా ప్రాజెక్ట్ రావడంపై మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో జగన్ ఓ ట్వీట్ అయినా వేసి ఉండాలి. కానీ జగన్ కి అంత విశాల హృదయం లేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. రాజకీయ నాయకులే కాదు, సామాన్య ప్రజలు కూడా విశాఖకు వస్తున్న గూగుల్ సంస్థను జగన్ సోషల్ మీడియాలో అయినా ఆహ్వానించి ఉండాల్సిందని అంటున్నారు. ప్రతిపక్ష నేత హోదా కోరుకుంటున్న జగన్ కి, కనీసం ఆ హోదాకు తగ్గట్టుగా గూగుల్ సంస్థకి వెల్కమ్ చెబుతూ ఓ ట్వీట్ వేయొచ్చు కదా అనే ప్రశ్న వినపడుతోంది.
Also Read: 5 ఏళ్లలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు..
అమరావతితోపాటే విశాఖ కూడా..
మూడు రాజధానులు అంటూ విశాఖపై ఎనలేని ప్రేమ చూపించిన జగన్ అప్పట్లో సాగరతీరానికి ఏం చేశారు? సూటిగా ప్రశ్నిస్తే వైసీపీ నుంచి సమాధానం కరువవుతుంది. పోనీ రుషికొండకు గుండుకొట్టి కట్టించిన ప్యాలెస్ ని అభివృద్ధి అందామా అంటే, అది ఎవరి కోసం కట్టారో ఏంటో తెలియని పరిస్థితి. కానీ కూటమి అలా కాదు. అమరావతే ఏకైక రాజధాని అని తేల్చేసింది. అమరావతిలో సీఆర్డీఏ భవనం ప్రారంభించిన మరుసటి రోజే, వైజాగ్ కి గూగుల్ ఏఐ సెంటర్ ని తీసుకొచ్చింది. అంటే ఇక్కడ అన్ని ప్రాంతాలను తాను సమానంగా చూస్తున్నాననే మెసేజ్ ని క్లియర్ గా జనాల్లోకి పంపించగలిగారు చంద్రబాబు. అమరావతిపై ఫోకస్ పెట్టి ఇతర ప్రాంతాలను పట్టించుకోకపోవడం అంటూ ఏమీ లేదని, వైజాగ్ ని ఏఐ హబ్ గా మారుస్తానని ఆయన ఇదివరకే ప్రకటంచారు. అలానే పనిచేస్తూ వెళ్తున్నారు. విశాఖకు రాబోయే రోజుల్లో మరిన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లు వస్తాయి. అప్పుడు వైసీపీ మరింత ఇబ్బందుల్లో పడుతుందని అంటున్నారు. ఎంతసేపు రెడ్ బుక్ పాలన అని, వైసీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదులు చేస్తే జనం నమ్ముతారా? కళ్లముందు గూగుల్ ఏఐ సెంటర్ లాంటివి కనపడుతుంటే, అమరావతిలో అభివృద్ధి సాక్షాత్కరిస్తుంటే ఇంకా కావాల్సిందేముంది. 2029 నాటికి ఇదే ఎన్నికల్లో కీలక పాయింట్ గా మారబోతోంది. అటు సూపర్ సిక్స్, ఇటు సూపర్ అభివృద్ధి ఇదే కూటమి నినాదంగా మారే అవకాశం ఉంది.
Also Read: వామ్మో, ఒక్కసారే అన్ని ఉద్యోగాలా?