Tirumala Pushpayagam 2025: తిరుమల తిరుపతి దేవాలయంలో ప్రతి ఏడాది నిర్వహించే పుష్పయాగ మహోత్సవం.. ఈసారి అక్టోబర్ 30న అంగరంగ వైభవంగా జరగనుంది. దీనికి సంబంధించి టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
పుష్పయాగం మహోత్సవానికి ముందు రోజు.. అనగా అక్టోబర్ 29న బుధవారం రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈ అంకురార్పణ కార్యక్రమం ద్వారా పుష్పయాగానికి ఆధ్యాత్మిక ప్రారంభంగా భావిస్తారు.
అక్టోబర్ 30 ఉదయం రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవమూర్తులను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం జరుగుతుంది. ఈ అభిషేకంలో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కర్పూరం, కుంకుమ తదితర సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి విశేషమైన స్నానం చేయిస్తారు.
ఇక మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు.. ప్రధాన పుష్పయాగం వేడుక వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా పలు రకాల పుష్పాలు, పత్రాలు ఉపయోగించి స్వామివారికి పుష్ప సమర్పణ చేస్తారు. శ్వేతచంపక, కనకాంబర, జాజి, జపా, గన్నేరు, తులసి, మల్లె వంటి సువాసన పుష్పాలతో ఆలయ ప్రాంగణం అందంగా అలంకరిస్తారు.
కాగా సాయంత్రం సమయంలో సహస్రదీపాలంకార సేవ అనంతరం.. శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. వెండి రథంపై స్వామివారిని భక్తులు కనులారా తిలకించే అవకాశముంటుంది.
రద్దయిన ఆర్జిత సేవలు
పుష్పయాగం సందర్భంగా టీటీడీ కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు వెల్లడించింది. అక్టోబర్ 29న జరిగే అంకురార్పణ కారణంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవ రద్దు కాగా, అక్టోబర్ 30 పుష్పయాగం రోజున తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.
అలాగే తోమాల సేవ, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. భక్తులు ఈ రెండు రోజుల్లో ఈ మార్పులకు అనుగుణంగా తమ దర్శన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని టీటీడీ సూచించింది.
Also Read: 5 ఏళ్లలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు.. విశాఖలో అడుగుపెడుతున్న గూగుల్.. కీలక ఒప్పందం!
టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. భక్తుల సౌకర్యార్థం అదనపు క్యూలైన్లు, నీటి సదుపాయాలు, వైద్య బృందాలు ఏర్పాటు చేశారు.