ప్రజా రవాణాతో పాటు సరుకు రవాణాకు సమ ప్రాధాన్యత ఇస్తున్న ఇండియన్ రైల్వే మరో అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. ముంబై- కోల్ కతా మధ్య డోర్ టు డోర్ సరుకు పార్శిల్ సర్వీస్ ను ప్రారంభించింది. రైళ్ల ద్వారా గో డౌన్స్ వరకు సరుకు రవాణా చేసి అక్కడి నుంచి వినియోగదారులకు హోమ్ డెలివవరీ ఇచ్చేలా ప్లాన్ చేసింది. అదే సమయంలో పలు రకాల వ్యాపారాలు, పరిశ్రమలకు సంబంధించిన సరుకులను రవాణా చేసేలా పూర్తి లాజిస్టిక్ సపోర్టు చేసేలా మరె రెండు కొత్త సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CONCOR) సహకారంతో ఈ నూతన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఈ సర్వీసులలో ఉత్తరప్రదేశ్ లోని ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ హబ్, ఢిల్లీ, కోల్ కతా మధ్య టైమ్ బౌండ్ కంటైనర్ రైలు సర్వీసులు, ముంబై- కోల్ కతా మధ్య డోర్ టు డోర్ పార్శిల్ సర్వీసులు ఉన్నాయి.
నిజానికి ఇప్పటి వరకు గూడ్స్ రైళ్ల ద్వారా బొగ్గు, ఇనుప ఖనిజం, ఉక్కు, సిమెంట్ లాంటి పెద్ద మొత్తంలో సరుకులను రవాణా చేసేవాళ్లు. డోర్ టు డోర్ సేవలను అందించడంలో ఎక్కువగా ప్రాధాన్యత ఉండేది కాదు. ఒకవేళ ఉన్నా చాలా తక్కువగా ఉండేది. డోర్ టు డోర్ పార్శిల్ సర్వీస్ ద్వారా చిన్న చిన్న వస్తువులను కూడా హోమ్ డెలివరీ ఇవ్వనున్నారు. ఈ కొత్త సర్వీసు ద్వారా అన్నా రకాల వస్తువులను వినియోగదారుల ఇంటి వరకు చేర్చుతారు. వీటిలో లూబ్ ఆయిల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, FMCG కూడా ఉంటాయి. ప్రస్తుతం ఈ సర్వీసు ముంబై- కోల్ కతా మధ్య అందుబాటులోకి వచ్చాయి.
డోర్ టు డోర్ పార్శిల్ సర్వీస్, రోడ్డు రవాణాతో పోల్చితే 7.5 శాతం ఖర్చు ఆదా కావడంతో పాటు 30 శాతం వేగంగా వినియోగదారులకు వస్తువులు చేరే అవకాశం ఉంటుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. “డోర్ టు డోర్ సర్వీస్ దేశానికి చాలా ముఖ్యమైనది. ఈ విధానం ద్వారా రవాణ ఖర్చు తగ్గడంతో పాటు వినియోగదారులకు వేగంగా వస్తువులు అందుతాయి. అన్ని రకాలా పరీక్షల తర్వాత ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చాం. ప్రజలకు ఈ సర్వీసులు ఎంతో ఉపయోగడపడటంతో పాటు రైల్వేకు గణనీయమైన ఆదాయాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది” అని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ- కోల్ కతా మధ్య ట్రాన్సిట్ కంటైనర్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పిన ఆయన, ఈ మార్గంలో అవసరమైన మరిన్ని రైళ్లను యాడ్ చేయనున్నట్లు ప్రకటించారు.
భివాండి(ముంబై), సంక్రైల్ (కోల్‌కతా) మధ్య డోర్ టు డోర్ పార్శిల్ సర్వీస్ లో CONCOR ద్వారా రైలు లోడింగ్ పాయింట్ నుంచి 205 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరిశ్రమల నుంచి వస్తువులను సేకరించి, కోల్ కతా చుట్టూ ఉన్న వినియోగదారులకు 48 నుంచి 60 గంటలలో డెలివరీ చేయనున్నట్లు ఇండియన్ రైల్వే ప్రకటించింది.