జగన్ 2.O మామూలుగా ఉండదు.
జగన్ ఈసారి వచ్చాక రప్పా రప్పానే.
మేం తిరిగొచ్చాక ఒక్కొక్కరికీ వడ్డీతో సహా చెల్లిస్తాం.
వైసీపీ నేతలు కామన్ గా చెబుతున్న డైలాగులివి. అయితే ఈ డైలాగులు కొట్టేవారు ఎవరు? వారి స్థాయి ఏంటి? అనేది ఇప్పుడు తేలాల్సిన అసలు విషయం. ఈసారి అధికారంలోకి వచ్చా కార్యకర్తల్ని బాగా చూసుకుంటానని జగన్ కూడా చెబుతున్నారు. కొంతమంది కీలక నేతలు కూడా ఈసారి అధికారం మనదేనంటూ ధైర్యంగా చెబుతున్నారు. అయితే అందరూ ఆ లిస్ట్ లో లేరు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన వారిలో ఇప్పుడు నైరాశ్యం కనపడుతోంది.
నాయకులకే నమ్మకం లేదా?
వైసీపీ నిరసనలకు పిలుపునిస్తోంది. అన్ని జిల్లాల్లో నాయకులు బయటకు వస్తున్నారు. కానీ కొంతమందే, వారు కూడా కొత్తవారే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించినవారు, పార్టీ ఫేస్ గా బయటకొచ్చి హంగామా చేసినవాళ్లు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. అంటే 2029లో పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న ధైర్యం వారిలో లేదనే చెప్పాలి. మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లాంటి చాలామంది నేతలు ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దాదాపుగా అండర్ గ్రౌండ్ అన్నట్టుగానే ఉంది వీరి పరిస్థితి. ఏతా వాతా పేర్ని నాని, అంబటి లాంటివాళ్ల హడావిడి మాత్రమే కనపడుతోంది. మిగవాళ్లు ఏరీ, ఎక్కడ, వారిలో జగన్ నమ్మకం కలిగిస్తేనే, జనాలకు నమ్మకం కుదురుతుంది.
జగన్ ని ప్రజలు నమ్మాలంటే ఏం చేయాలి?
2029లో వైసీపీ అధికారంలోకి రావాలంటే ప్రజలకు తాజా ప్రభుత్వంపై విసుగు రావాలి, అదే సమయంలో జగన్ తమకు న్యాయం చేయగలరనే నమ్మకం కుదరాలి. మొదటిది మనం చెప్పలేం, ఇక రెండోది సాధ్యం కావాలంటే జగన్ ప్రయత్న దోషం ఉండకూడదు. కానీ ఆయన బెంగళూరుకే పరిమితం అవుతున్నారు. వారాంతాల్లో తాడేపల్లికి వచ్చి కార్యాచరణ మొదలు పెడుతున్నారు. నిరసన కార్యక్రమాలతో ఊపు వస్తుందనుకుంటున్న టైమ్ లో తిరిగి సైలెంట్ అవుతున్నారు. కనీసం అసెంబ్లీ సమావేశాలకు హాజరయినా ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది, కానీ జగన్ అక్కడికి కూడా రానంటున్నారు. దీంతో పార్టీలో కీలక నేతలు కూడా జగన్ పై నమ్మకం పెంచుకోలేకపోతున్నారు.
Also Read: జగనూ! ఇదంతా నువ్వు చేసిందే కదయ్యా!
మాజీ మంత్రి కొడాలి నాని అడ్రస్ లేరు. గుండె ఆపరేషన్ పేరుతో ఆయన కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్నారు, ఆ తర్వాత ఒకటీ రెండు సందర్భాల్లో హడావిడి చేసినా ఇప్పుడు మళ్లీ సైలెంట్ అయ్యారు. మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసలు నెల్లూరులోనే కనపడ్డం లేదు. కాకాణి లాంటి వారు జైలుకెళ్లి వచ్చినా జోరుగా జనాల్లో తిరుగుతున్నారు. అదే జిల్లా నుంచి మంత్రి పదవి అనుభవించిన అనిల్ మాత్రం అడ్రస్ లేరు. జైలుకెళ్లొచ్చిన మరో నేత, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంపై ఓ రేంజ్ లో విమర్శలు చేసిన వల్లభనేని వంశీ కూడా సైలెంట్ గానే ఉంటున్నారు. జైలుకెళ్లొచ్చిన తర్వాత వంశీ తిరిగి ఫైర్ అవుతారనుకుంటే ఆయన మాత్రం బయటకు రావడం మానేశారు. ఈ ముగ్గురితోపాటు చాలామంది కీలక నేతలు నిరసన కార్యక్రమాలంటేనే నీరసపడిపోతున్నారు. కనీసం కార్యకర్తలకు కూడా టచ్ లో ఉండటం లేదు. వారిలో భరోసా కల్పించాల్సిన వారే సైలెంట్ గా ఉండే సరికి వైసీపీ పరిస్థితి చాలా చోట్ల డల్ గా కనపడుతోంది. సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వంటి నేతలు కూడా హుషారుగా కదనరంగంలోకి దిగడం లేదు. మొత్తమ్మీద జగన్ తో పాటు అందరూ షో చేస్తున్నారని జనం అభిప్రాయ పడేలా పరిస్థితులు కనపడుతున్నాయి. ముందు జగన్ ని నాయకులు నమ్మాలి, ఆ తర్వాతే జనం నమ్ముతారని అంటున్నారు నెటిజన్లు.
Also Read: కర్నూలు సభలో మోదీ ఆ ఒక్క పని చేయగలరా?