Hypersomnia: హైపర్సోమ్నియా అనేది ఒక నిద్ర సంబంధిత సమస్య. దీని కారణంగా పగటి పూట కూడా విపరీతమైన నిద్ర మత్తుతో బాధపడుతుంటారు. అంతే కాకుండా ఎంత నిద్రపోయినా విశ్రాంతి లేని అనుభూతిని పొందుతారు. ఇది కేవలం అలసట మాత్రమే కాదు. శరీరంలోని అనేక సమస్యలపై, రోజు వారీ జీవితంపై కూడా ఎక్కువగా ప్రభావం చూపుతుంది.
శారీరక, నాడీ వ్యవస్థపై ప్రభావం:
హైపర్సోమ్నియాతో బాధపడే వారు రాత్రిపూట 10 నుంచి 11 గంటలు లేదా అంతకంటే ఎక్కువగా నిద్రపోయినప్పటికీ , పగటి పూట నిద్రను ఆపుకోలేకపోతారు. ఫలితంగా నిద్ర కూడా ఎక్కువగా వస్తుంది. ఈ అధిక నిద్ర మత్తు కూడా కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరును అస్తవ్యస్తం చేస్తుంది.
నిద్రమైకం:
హైపర్సోమ్నియా ఉన్న వారు ఉదయం నిద్రలేవడానికి చాలా కష్టపడుతుంటారు. మేల్కొన్న తర్వాత కూడా గందరగోళంగా, మందకొడిగా, కదలికలలో సమన్వయం లేక కూడా ఇబ్బంది పడతారు. ఈ నిద్ర మైకం కొన్ని గంటల పాటు కొనసాగే ప్రమాదం కూడా ఉంటుంది.
జ్ఞాపకశక్తి,ఏకాగ్రత సమస్యలు:
తరచుగా నిద్ర మత్తు అనేది మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది. ఫలితంగా ఏకాగ్రత లోపించడం, విషయాలను సరిగ్గా గుర్తుంచు కోకపోవడం, నిర్ణయాలు తీసుకోకపోవడంలో కష్టం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. దీనిని సాధారణంగా బ్రెయిన్ ఫాగ్ అని కూడా పిలుస్తారు.
ప్రమాదాల ప్రమాదం: పగటిపూట వచ్చే అధిక నిద్రమత్తు వల్ల.. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం పెరుగుతుంది.
మానసిక, భావోద్వేగ ప్రభావాలు:
హైపర్సోమ్నియా శారీరక ఆరోగ్యంపైనే కాక, మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఒత్తిడి, చిరాకు: సరిగా విశ్రాంతి లేకపోవడం, రోజువారీ పనులు చేయలేకపోవడం వల్ల ఆందోళన, చిరాకు పెరుగుతాయి.
మానసిక కుంగుబాటు : నిరంతర నిద్రమత్తు, సామాజిక జీవితంపై, ఉద్యోగంపై ప్రభావం చూపడం వల్ల చాలామంది నిరాశ, కుంగు బాటుకు గురవుతారు.
ఇతర శారీరక ఆరోగ్య సమస్యలు:
దీర్ఘకాలికంగా అధికంగా నిద్రపోవడం లేదా నిద్రలో అవాంతరాలు రావడం అనేది ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. పరిశోధనల ప్రకారం..
ఊబకాయం : ఎక్కువ నిద్రపోయే వ్యక్తులు శారీరక శ్రమ తక్కువగా చేయడం వల్ల ఊబకాయం బారిన పడే అవకాశం పెరుగుతుంది.
గుండె జబ్బులు: అధిక నిద్ర, నిద్ర లేమి రెండూ కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
తలనొప్పులు: నిద్ర నమూనాలలో మార్పులు మెదడులోని కొన్ని న్యూరో ట్రాన్స్‌మిటర్లను ప్రభావితం చేయడం వల్ల తలనొప్పులు వచ్చే అవకాశం ఉంది.
Also Read: కాల్షియం లోపమా ? ఈ ఫ్రూట్స్‌తో ప్రాబ్లమ్ సాల్వ్ !
రోజువారీ జీవితంపై ప్రభావం:
హైపర్సోమ్నియా ఉన్న వ్యక్తి యొక్క వృత్తి పరమైన, సామాజిక జీవితం గణనీయంగా దెబ్బతింటుంది. తరచుగా పనులు ఆలస్యం చేయడం లేదా పూర్తి చేయలేకపోవడం, పనిలో లేదా చదువులో వెనుకబడిపోవడం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంబంధాలు సరిగా కొనసాగించలేక పోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు.
హైపర్సోమ్నియా అనేది కేవలం సోమరితనం కాదు. దీని లక్షణాలు కనిపిస్తే వెంటనే నిపుణుడైన డాక్టర్‌ని సంప్రదించి, సరైన చికిత్స తీసుకోవడం అవసరం. చికిత్స ద్వారా లక్షణాలను నియంత్రించి, జీవిత నాణ్యతను మెరుగు పరచుకోవచ్చు.