ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన రైల్వే వ్యవస్థలు ఉన్నాయి. ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాటిలో కొన్ని వింతైన అంశాలూ ఉన్నాయి. వాటిలో ఒకదాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే రైలు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. మార్గం మధ్యలో ఏకంగా 13 దేశాలను కలుపుతూ వెళ్తుంది. పోర్చుగల్ రాజధాని లిస్బన్ లో మొదలయ్యే ఈ రైలు ప్రయాణం.. ఏకంగా సింగపూర్ వరకు కొనసాగుతుంది. ఈ రైలు సుమారు 18,755 కిలో మీటర్ల మేర ఏక బిగిన ప్రయాణిస్తుంది. అంతేకాదు, ఈ ప్రయాణం 21 రోజుల పాటు కొనసాగుతుంది. భిన్న దేశాలు, విభిన్న సంస్కృతులు, రకరకాల వేష భాషలు కలిగిన ప్రయాణీకులు ఈ రైల్లో జర్నీ చేస్తారు.
ఈ ప్రత్యేకమైన రైలు ప్రయాణం పోర్చుగల్ లోని లిస్బన్ నగరం నుంచి ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి మొదటగా స్పెయిన్ లోకి అడుగు పెడుతుంది. ఆ తర్వాత ఫ్రాన్స్, రష్యా, చైనా, వియత్నాం, థాయ్‌లాండ్ మీదుగా సింగపూర్ కు చేరుకుంటుంది. తన ప్రయాణ మార్గంలో ఈ రైలు పారిస్, మాస్కో, బీజింగ్, బ్యాంకాక్ లాంటి అత్యంత ముఖ్యమైన నగరాలను కలుపుతూ ముందుకు సాగుతుంది. ఈ రైలుకు ప్రయాణంలో మొత్తం 11 రూట్ స్టాప్ లు ఉన్నాయి. ఈ జర్నీ ఒక్కసారి మొదలైతే ఏకంగా మూడు వారాల పాటు కొనసాగుతుంది.
ఈ రైలులో టికెట్ ధర ఇంచుమించు 1,350 డాలర్లు ఉంటుంది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 1,13,988. విమాన ఛార్జీలతో పోల్చితే ఈ ధర చాలా అంటే చాలా తక్కువగా చెప్పుకోవచ్చు. అయితే, ఈ రైల్లో ప్రయాణించాలంటే అంత సులభం కాదు. చాలా నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఈ ప్రయాణానికి సంబంధించి డాక్యుమెంటేషన్ ప్రొసిజర్ చాలా ఎక్కువగా ఉంటుంది. బెర్త్ లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. పోటీ ఉంటుంది. ముందుగానే ప్లాన్ చేసుకుంటే నచ్చిన బెర్త్ ను పొందే అవకాశం ఉంటుంది.
ప్రపంచంలోనే అత్యంత దూరం ప్రయాణించే ఈ రైలు ఏ ఒక్క దేశానికో సంబంధించినది కాదు. పలు దేశాలు కలిపి దీనిని నడిపిస్తాయి. లావోస్, చైనా మధ్య ప్రారంభించబడిన రైల్వే లైను యూరప్, ఆసియాకు లింక్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఈ మార్గం లావోస్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు పోర్చుగల్ నుంచి సింగపూర్ ఎలాంటి ఇబ్బందులు లేని ప్రయాణాన్ని అందించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంతకు ముందు పోర్చుగల్ నుంచి సింగపూర్ వరకు రైలు ప్రయాణం చేయాలంటే చాలా సమస్యలు ఎదురయ్యేవి. ఒకే లైన్ ఉండేది కాదు. చైనాలోని కున్మింగ్, లావోస్ రాజధాని వియంటియాన్ కు కొద్ది సంవత్సరాల క్రితం కొత్త రైల్వే మార్గాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మార్గానికి కు పోర్చుగల్-సింగపూర్ రూట్ ను లింక్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే లైన్ గా రికార్డుకెక్కింది.