Kakinada SEZ Controversy: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రెండు దశాబ్దాల పోరాటం. అవును.. ఎట్టకేలకు కాకినాడ సెజ్ బాధిత రైతులకు భారీ ఊరట లభించింది. సుమారు 20 ఏళ్ల తర్వాత అవార్డు భూములపై హక్కులు రైతులకు దక్కబోతున్నాయి. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ లాంటి ఛార్జీలు లేకుండా సెజ్ నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్న 2 వేల 180 ఎకరాల భూములను బదలాయించేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయం ఓ ప్రకటన చేసింది.
1551 మంది రైతులకు కలగనున్న లబ్ది..
ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేసారు. దీంతో..1551 మంది రైతులకు లబ్ది చేకూరనుంది. దీంతో.. రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండు దశాబ్దాల తమ కల నెరవేరిందని చెబుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిత్ర పటాలకు పాలభిషేకాలు చేస్తున్నారు.
కొత్తపల్లి మండలాల పరిధిలో 8180 ఎకరాల సేకరణ..
వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాకినాడ జిల్లా తొండంగి, కొత్త పల్లి మండలాల పరిధిలో 8 వేల 180 ఎకరాలను సెజ్ కోసం సేకరించారు. అప్పట్లో ఎకరాకు మూడు లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించారు. అయితే.. అప్పట్లో భూములు ఇవ్వడానికి కొందరు రైతులు అంగీకరించలేదు. అయినా సరే భయపెట్టి, బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారన్న ఆరోపణలున్నాయి.
2014లో మరో రూ. 2 లక్షలు అదనంగా ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం..
ఇందులో 2 వేల 180 ఎకరాలకు సంబంధించి రైతులు పరిహారం తీసుకోలేదు. తమ భూములు వెనక్కు ఇచ్చేయాలని ఉద్యమాలు చేశారు. జైళ్లకు వెళ్లారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక మరో రెండు లక్షలు అదనంగా ఇచ్చారు. సెజ్ భూముల్లో నాడు సీఎం చంద్రబాబు ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ హయాంలో భూములను వెనక్కు ఇవ్వాలని నిర్ణయించినా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు.
Also Read: భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇక కొనడం కష్టమే..!
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ.. హామీ ఇచ్చిన కూటమి నేతలు
చివరకు 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి నేతలు దీనిపై హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక సమస్య పరిష్కరించి న్యాయం చేస్తామన్నారు. పవర్‌లోకి రావడంతో ఇప్పుడు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసి ఇచ్చేలా సంబంధిత శాఖకు ఆదేశాలిచ్చారు సీఎం చంద్రబాబు.