Kakinada SEZ Lands: కాకినాడ సెజ్ పరిధిలోని భూములను తిరిగి రైతులకు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిలబెట్టుకున్నారు. సెజ్ పరిధిలోని 2,180 ఎకరాల భూములకు స్టాంప్, రిజిస్ట్రేషన్ డ్యూటీలను మినహాయించి తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేసేలా పవన్ చొరవ తీసుకున్నారు. ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించారు.
కాకినాడ తీరంలోని తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి మండలాల పరిధిలో సుమారు 1,551 మంది రైతులకు మేలు జరగనుంది. కాకినాడ సెజ్ రైతుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీసుకువెళ్లారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ కాకినాడ సెజ్ రైతులకు ఊరట కలిగించింది. కాకినాడ సెజ్ కు ఇచ్చిన భూముల్లో 2,180 ఎకరాలను తిరిగి రైతులకు ఇచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
ఈ మేరకు కాకినాడ సెజ్ లో అవార్డు భూములను తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలిచ్చారు. ఈ రిజిస్ట్రేషన్ లకు రిజిస్ట్రేషన్ రుసుములు, స్టాంప్ డ్యూటీలు వసూలు చేయకూడదని ఆదేశాలలో పేర్కొన్నారు. ఉప్పాడ కొత్తపల్లి, తొండంగి మండలాల పరిధిలో ఈ భూములు ఉన్నాయి. కాకినాడ సెజ్ పరిధిలో రైతులకు వెనక్కి ఇచ్చిన భూమి, తిరిగి వారి పేరు మీద రిజిస్ట్రేషన్ కాక సతమతం అవుతున్న విషయంపై దృష్టి సారించిన పవన్ కల్యాణ్ రైతులకు న్యాయం చేశారు.
గత ప్రభుత్వంలో కాకినాడ సెజ్ భూములపై జీవో నెం.12 విడుదల అయినా క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు మేలు జరగలేదన్న విమర్శలు ఉన్నాయి. రైతుల పేరున రిజిస్ట్రేషన్లు జరగలేదు. దీంతో పిల్లలకు పెళ్లిళ్లు, చదువుల నిమిత్తం భూములు ఉపయోగపడటం లేదని రైతులు పవన్ కు నివేదించారు. దీనిపై పూర్తి వివరాలు పరిశీలించి, రైతులకు మేలు జరిగేలా చూస్తానని పవన్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఈ సమస్యను ఇటీవల శాసన మండలిలో సమావేశాల్లో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.
రైతుల పడుతున్న ఇబ్బందులను సభలో ప్రస్తావించారు హరిప్రసాద్. భూములు రైతుల పేరిట రిజిస్ట్రేషన్ కాకపోవడంతో పీఎం కిసాన్, అన్నదాత వంటి పథకాల లబ్ధి అందడం లేదని, బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి వీలు లేకుండా పోయిందని రైతుల బాధను సభ ముందుంచారు. దీంతో ఈ సమస్య మరోసారి చర్చనీయాంశం అయ్యింది.
Also Read: Jagan – Ysrcp: అంటీముట్టనట్టుగా వంశీ, నాని, అనిల్.. జగన్ 2.Oపై సొంత పార్టీ నేతలకే నమ్మకం లేదా..?
మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వం కాకినాడ సెజ్ రైతులకు స్టాంప్, రిజిస్ట్రేషన్ డ్యూటీలను మినహాయించి తిరిగి రైతుల భూములు రైతులకు తిరిగి రిజిస్ట్రేషన్ చేసేలా ఆదేశాలు విడుదలయ్యాయి. కాకినాడ సెజ్ రైతులకు ఊరట కలిగించేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.