అసెంబ్లీలో ప్రతిపక్షం హాజరు కాకపోయినా ఏపీలో ప్రతిపక్షం ఉంది అని చెప్పుకోడానికి అప్పుడప్పుడు నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తోంది వైసీపీ. కానీ ఆ నిరసన కార్యక్రమాలన్నీ పెద్ద జోక్ గా మారడం ఇక్కడ విశేషం. ఇప్పటికే ఫీజుపోరు, యువతపోరు, రైతు పోరు అంటూ కొన్ని కార్యక్రమాలు జరిగాయి కానీ పెద్దగా స్పందన లేదు. తాజాగా ‘అన్నదాత పోరు’ పేరుతో మరోసారి వైసీపీ హడావిడి చేసింది. అయితే ఈ హడావిలో యధావిధిగా జగన్ పాల్గొనలేదు. అన్నదాత పోరులో నాయకులంతా పాల్గొనాలి, కార్యకర్తలంతా రోడ్డెక్కాలి అని పిలుపునిచ్చిన జగన్, తాను మాత్రం ఇల్లు దాటి బయటకు రాలేదు. కనీసం ఆయన హౌస్ అరెస్ట్ వార్త కూడా రాలేదు కాబట్టి కచ్చితంగా ఆయన బెంగళూరులోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మాత్రం దానికి అన్నదాతపోరు, రైతు పోరు అంటూ పిలుపులివ్వడం దేనికి అని సొంత పార్టీ నేతలే జగన్ పై విసుక్కుంటున్నారని గుసగుసలు వినపడుతున్నాయి.
జగన్ ఎక్కడ?
సూపర్ సిక్స్ – సూపర్ హిట్ అంటూ కూటమి ప్రభుత్వం అనంతపురంలో ఒక విజయోత్సవ సభ నిర్వహించబోతోంది. సరిగ్గా ఆ కార్యక్రమానికి ఒకరోజు ముందే హడావిడిగా అన్నదాత పోరు జరపాలని వైసీపీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలామంది మాజీ ఎమ్మెల్యేలు ఒకరోజు సెలవు పెట్టుకుని మరీ, బెంగళూరు, హైదరాబాద్ నుంచి సొంత నియోజకవర్గాలకు వచ్చారు. కొంతమందిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు, మరికొందరు మాత్రం ఎండలో రోడ్లెక్కి నినాదాలు చేశారు, వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆర్డీఓ ఆఫీస్ లలో వినతిపత్రాలు అందజేశారు. ఆ తర్వాత మీడియా ముందు ప్రభుత్వంపై చిందులేశారు. మాజీ మంత్రులు పేర్ని నాని, రోజా, ధర్మాన, విడదల రజిని.. ఇలా చాలామంది ఈ కార్యక్రమాల్లో పాల్గొని సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టుకున్నారు. చాలామందే వచ్చారు కానీ అసలు పార్టీ అధినేత ఇల్లు కదలకపోవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. అసలు జగన్ కి ఇలాంటి కార్యక్రమాలు పట్టవా, కేవలం పార్టీ నేతలు, కార్యకర్తలే రోడ్డెక్కాలా, అధినేత తనకు ఇష్టం వచ్చినప్పుడే జనంలోకి వస్తారా?
అసెంబ్లీకి ఎలాగూ రారు..
ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే తాను అసెంబ్లీకి రాను అని జగన్ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు, అన్నట్టుగానే ఆయన రావడంలేదు కూడా. తాజా సమావేశాలకు కూడా జగన్ మొహం చాటేయడానికే ఫిక్స్ అయ్యారు. అసెంబ్లీకి రావడంలేదు సరే, కనీసం సొంత పార్టీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాల్లో సైతం జగన్ పాల్గొనకపోతే ఎలా. తానే పిలుపునిస్తారు, తానే మొహం చాటేస్తారు అన్నట్టుగా ఉంది జగన్ పరిస్థితి. మరి మిగతా నాయకులు ఏ ఉత్సాహంతో జనంలోకి వెళ్తారు. ముఖ్యమంత్రిగానే కాదు, ప్రతిపక్ష నేతగా కూడా జగన్ దారుణంగా ఫెయిలయ్యారంటూ కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. కనీసం ఆ విమర్శలను తిప్పికొట్టడానికైనా జగన్ ఇలాంటి కార్యక్రమాల విషయంలో ముందుండాలి కదా..? శుభకార్యాలు, పరామర్శలకు మాత్రమే జగన్ బెంగళూరు నుంచి వస్తారనే టాక్ జనంలో కూడా బలపడిపోయింది. పార్టీ తరపున చేపట్టే కార్యక్రమాలపై జగన్ ఫోకస్ పెట్టాలని సొంత పార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారు. నిరసన కార్యక్రమం సూపర్ హిట్ అంటూ సాక్షి ఊదరగొడుతున్న వేళ, అసలు జగన్ ఎక్కడ అని కేడర్ అయోమయంలో పడిపోయింది.