YSRCP latest news today(Political news in ap): విజయసాయిరెడ్డి. జగన్‌కు అత్యంత సన్నిహితుడు. వైసీపీలో నెంబర్ 2. ఉత్తరాంధ్రకు సామంతరాజు. ఇదంతా ఒకప్పటి మాట. కొంతకాలంగా వైసీపీలో విజయసాయి ఊసే లేదు. ఆయన తాడేపల్లికి రాక చాలా నెలలే అవుతోంది. సీఎం జగన్‌ను కలిసి ఎన్నిరోజులైందో. అటు, విశాఖలోనూ విజయసాయికి చెక్ పడింది. ఆయన వర్గీయులపై వేటు పడింది. ఇప్పుడు ఉత్తరాంధ్రను వైవీ సుబ్బారెడ్డి డీల్ చేస్తున్నారు. జగన్ వ్యవహారాలను సజ్జల చూస్తున్నారు. విజయసాయికి దాదాపు పనేమీ లేకుండా పోయింది. ఆయన స్థానాన్ని సజ్జల, వైవీ ఆక్రమించేశారా? ఇంతకీ, విజయసాయి ఎక్కడ? ఏం చేస్తున్నారు? జగన్ దగ్గర ఆయన ప్రయారిటీ తగ్గిందా? పెరిగిందా?
కట్ చేస్తే, ఇటీవల విజయసాయిరెడ్డికి అనూహ్యంగా కీలక పార్టీ పదవి కట్టబెట్టారు జగన్. వైసీపీ అనుబంధ విభాగాల ఇంఛార్జిని చేశారు. పేరులో అంతగా వెయిట్ లేకున్నా.. ఆ పోస్టు మాత్రం రాజకీయంగా కీలకమనే చెప్పాలి. విజయసాయిరెడ్డిని ఎన్నికల కోసమే ఇన్నాళ్లూ పక్కనపెట్టారని.. సరైన సమయంలో ఆయన సేవలను జగన్ సమర్థవంతంగా ఉపయోగించుకోబోతున్నారని తెలుస్తోంది.
మీడియా కవరేజ్‌కు చిక్కకుండా.. ఇటీవల విజయసాయిరెడ్డి తాడేపల్లి పార్టీ ఆఫీసులోనే మకాం వేశారని అంటున్నారు. పార్టీ బలాలు, బలహీనతలపై ఫోకస్ పెట్టారని చెబుతున్నారు. జూన్ 6న వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల భేటీ కూడా ఏర్పాటు చేశారు. భవిష్యత్ కార్యచరణపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
కొన్నాళ్లుగా సజ్జలను, వైవీ సుబ్బారెడ్డినే నమ్ముకుంటూ రాజకీయం చేస్తున్నారు జగన్మోహన్‌రెడ్డి. అయితే, అనేక విధాలుగా పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూ వస్తున్నాయి. కోటంరెడ్డి, ఆనం, మేకపాటి, ఉండవల్లి శ్రీదేవి లాంటి వాళ్లు రెబెల్ జెండా ఎగరేశారు. పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు జగన్‌పై తీవ్రస్థాయిలో కక్ష కట్టారు. అటు, వైవీ సుబ్బారెడ్డి వల్ల బాలినేని దూరమయ్యారు. సజ్జల వల్ల విజయసాయి కనుమరుగయ్యారు. ఇలా వరుస వ్యతిరేక పరిణామాలతో పార్టీ అధినేత జగన్ ఉలిక్కిపడ్డారా?. ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతోందని అలర్ట్ అయ్యారా?
ఇక, ఇలాగైతే వర్కవుట్ కాదనుకున్నారో ఏమో.. ఇన్నాళ్లూ దూరం పెట్టిన విజయసాయిని, బాలినేని శ్రీనివాస్ రెడ్డిని మళ్లీ దగ్గరకు పిలుస్తున్నారు. పాత కాపులే తన బలం, బలగమని గుర్తించినట్టున్నారు. వారి విషయంలో జగన్ ట్రీట్‌మెంట్ మారింది. ఇప్పటికే రెండు సార్లు బాలినేనిని ఇంటికి పిలిపించుకుని బుజ్జగించారు. అయినా, ఈ అవమానాలు తనవల్ల కాదంటూ ఆయన తాడేపల్లికి దూరంగానే ఉంటున్నారు. ఈసారి మళ్లీ ప్యాలెస్ నుంచి పిలుపొచ్చింది. బాలినేనిని మరోసారి బుజ్జగించారు. ఆయన్ను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకూడదని జగన్ గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు. ఓటమి భయమే జగన్ దిగొచ్చేలా చేస్తోందా?
ఇక, చాన్నాళ్లుగా పక్కనపెట్టేసి, తాడేపల్లికి కూడా రానీయకుండా చేసిన విజయసాయిరెడ్డిని మళ్లీ అక్కున చేర్చుకుంటున్నారు. ఇటీవల చంద్రబాబు, టీడీపీ విషయంలో సాయిరెడ్డి ధోరణి కంప్లీట్‌గా మారింది. గతంలో తరుచూ ట్విట్టర్‌లో వాతలు పెట్టే ఆయన.. ఇప్పుడు మౌనవ్రతంలో ఉన్నారు. ఇటీవల తారకరత్న చనిపోతే.. మనం మనం బంధువులమంటూ చంద్రబాబుతో మాటలు కూడా కలిపారు. ఆ తర్వాత బర్త్ డే విషెష్ కూడా చెప్పారు. ఈ పరిణామాలు జగన్‌ను ఉలిక్కిపడేలా చేశాయంటున్నారు. తాను ఈయన్ను వదిలేస్తే.. ఆయనకు దగ్గరవుతున్నారా? అనే అనుమానం పెరిగింది. జగన్ ఆయువుపట్లన్నీ తెలిసిన విజయసాయిని వదులుకునే సాహసం జగన్ చేస్తారా? అందుకే, మళ్లీ తాడేపల్లికి పిలిచి.. గౌరవపదమైన పార్టీ పదవి కట్టబెట్టి.. మచ్చిక చేసుకుంటున్నారని తెలుస్తోంది.
ఇలా విజయసాయి, బాలినేని విషయంలో జగనే దిగొచ్చారని విశ్లేషిస్తున్నారు. ఎన్నికల సీజన్ స్టార్ట్ కావడం.. వరుస ఎదురుదెబ్బల వల్లే.. ఎవరిమాటా వినకుండా, ఎవరినీ పట్టించుకోకుండా.. తానే మోనార్క్ అనుకునే జగన్.. ఇప్పుడు కాస్త తగ్గి.. రాజకీయంగా నెగ్గాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో విన్నింగ్ టీమ్‌ను మళ్లీ తన కోర్‌టీమ్‌లోకి తీసుకొస్తున్నారు.