Big Stories

BJP: బీజేపీలో ఉక్కపోత!.. ఎక్కడి కమలం అక్కడేనా?

telangana-bjp

BJP: తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం సైలెన్స్ కనిపిస్తోంది. కొందరు నేతలైతే పార్టీ కార్యక్రమాలంటే పట్టనట్లుగా కనిపిస్తున్నారు. ఇంకోవైపు బండి సంజయ్, ఈటల రాజేందర్ వంటి నేతల మధ్య సరైన వాతావరణం లేకపోవడం పార్టీ శ్రేణులకు ఇబ్బందికరంగా మారింది. కమలం పార్టీలో గ్రూపులు పెరగడం కూడా సమస్యలు పెరగడానికి కారణమైంది. వీటికి తోడు కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడం కూడా తెలంగాణలో ఎఫెక్ట్ పడుతోందంటున్నారు. చేరే వారు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారంటున్నారు.

- Advertisement -

టీ బీజేపీలో ప్రస్తుతం ఈటల రాజేందర్ తుఫాన్ నడుస్తోంది. పొంగులేటి, జూపల్లి విషయంలో చేసినట్లుగా చెబుతున్న కామెంట్లపై పార్టీలో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోందంటున్నారు. మరోవైపు పార్టీలో ఆధిపత్య పోరు, ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహారాలు, పార్టీ నేతల మధ్య పెరిగిన గ్యాప్ ఇవన్నిటితో క్యాడర్ గందరగోళంలో పడిపోయింది. పార్టీ వీడుతారంటూ రోజుకో బీజేపీ నేత పేరు తెరపైకి వస్తోంది. వీటిని ఎప్పటికప్పుడు వారు ఖండిస్తూనే ఉన్నారు. కొందరు సైలెంట్ అవుతున్నారు. ఇంకొందరు దేనికైనా రెడీ అంటూ మాట్లాడుతున్నారు.

- Advertisement -

అన్నిటికంటే ముఖ్యంగా బీజేపీలో ఇప్పుడు ఈటల వ్యాఖ్యల చుట్టూ వ్యవహారం నడుస్తోంది. సీఎం కేసీఆర్‌కు సంబంధించిన వ్యక్తులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారని, వారు కోవర్టులుగా పని చేస్తూ లీకులిస్తున్నారని ఐదు నెలల క్రితం కామెంట్ చేశారు. ప్రపంచంలో ఏ పార్టీకి జాయినింగ్‌ కమిటీ లేదని, బీజేపీలో చేరికల కమిటీ పెట్టడం వల్ల పార్టీలో చేరే వారి పేర్లు లీక్‌ అవుతున్నాయని కామెంట్ చేయడం పెద్ద దుమారమే రేపింది. అందుకే బీజేపీలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, తెలంగాణ ఇంటలిజెన్స్ వ్యవస్థ మెుత్తం ప్రత్యర్థి పార్టీలపైనే ఉంటుందంటూ అప్పట్లో ఈటల సమర్థించుకున్నారు. అయితే రోజులు గడుస్తున్నా బీజేపీలో చేరడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో అటు హైకమాండ్ నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోందంటున్నారు.

తెలంగాణ బీజేపీ నుంచి పార్టీ మారుతారని రోజుకో నేత పేరు తెరపైకి వస్తోంది. గతంలో ఇలాంటి కామెంట్లు రాగా.. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు వాటిని ఖండించారు. తన కుమారుడి పెళ్లికి పిలవడానికి వెళ్తే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రచారం చేస్తున్నారన్నారు. అంతే కాదు.. గతంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డితో విబేధాలున్నా ఇప్పుడు తమ మధ్య ఎలాంటి సమస్య లేదంటూ క్లారిటీ ఇచ్చుకున్నారు. మొన్నామధ్య ఈటల రాజేందర్ పైనా పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది. వాటిని ఖండించిన ఈటల.. తాను బీజేపీతోనే ఉంటానన్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పరిస్థితి కూడా ఇంతే. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా వ్యూహాత్మకంగా వ్యవహరించి పార్టీ ఇటీవలి గెలుపుల్లో కీలక పాత్ర పోషించిన జితేందర్ రెడ్డిపైనా ఇలాంటి ప్రచారమే జరుగుతోంది. తాము పార్టీ మారట్లేదు మహా ప్రభో అంటూ వారంతా ఖండిస్తున్నా కొందరిలో అనుమానాలు మాత్రం అలాగే ఉంటున్నాయి.

నిజానికి తెలంగాణ బీజేపీలో ఇప్పుడు అంతర్గత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎందుకంటే లెక్కలు చాలా వరకు మారిపోయాయంటున్నారు. వేర్వేరు పార్టీల నుంచి బీజేపీలో చేరిన వాళ్లు కూడా ఉక్కపోతకు గురవుతున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. మరోవైపు పార్టీలో అసంతృప్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుందంటున్నారు. పార్టీని బలోపేతం చేయకుండా ఈ పంతాలు, పట్టింపులు ఏంటని ఇటీవలే చేవెళ్ల బహిరంగ సభకు వచ్చిన హోంమంత్రి అమిత్ షా కూడా పార్టీ నేతలకు క్లాస్ తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చించేందుకు ఈటల అకస్మాత్తుగా వెళ్లడం, అది రాష్ట్ర నాయకత్వానికి తెలియకపోవడంతో పెద్ద చర్చే జరిగింది. ఈటల వెళ్లారన్న సమాచారం తనకు తెలియదని బండి సంజయ్ అప్పట్లో చెప్పుకొచ్చారు. విషయం ఈటల చెప్పకపోవడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. అయితే ఆ తర్వాత రోజుల్లో పార్టీ నేతల మధ్య విబేధాలు తారస్థాయికి చేరుకున్నారు. పార్టీ ముఖ్య నేతలను విడివిడిగా ఢిల్లీకి పిలిచిన హైకమాండ్ గొడవలు లేకుండా పని చేసుకోవాలని సూచనలు చేసింది. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు మాట్లాడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. టీ బీజేపీ ప్రస్తుతం బండి, ఈటల వర్గాలుగా విడిపోయాయన్న ప్రచారం జరుగుతోంది.

ఆ మధ్య కవితపై బండి సంజయ్ చేసిన కామెంట్లను బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తప్పు బట్టారు. ఆ వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదని, బండి సంజయ్ కామెంట్లను వెనక్కు తీసుకుంటే మంచిదంటూ చెప్పడం రాష్ట్ర బీజేపీలో కలకలం రేపాయి. నేతల మధ్య సైలెంట్ కోల్డ్ వార్ కు ఇదే నిదర్శనం అంటూ పెద్ద ఎద్దున రచ్చ నడిచింది.

బీజేపీలో చాలా వరకు పరిణామాలకు ఈటల రాజేందర్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అవుతున్నారు. ఆయన ఏది మాట్లాడినా, ఏం చేసినా పెద్ద చర్చకే దారి తీస్తోంది. నిజానికి ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందని, తెలంగాణ ఉద్యమకారుడిగా కేసీఆర్ ను ఢీకొట్టేందుకు ఈటల నాయకత్వంలోనే వెళ్తుందన్న చర్చ పార్టీలో జరిగింది. అయితే విజయశాంతి వంటి వారు మాత్రం.. ఈ ఎన్నికలను బండి సంజయ్ సారథ్యంలోనే ఎదుర్కొంటామని కామెంట్ చేయడం ద్వారా ఆ ప్రచారానికి చెక్ పెట్టారు.

ఇంకోవైపు తెలంగాణ రాజకీయాల్లో కీలక చర్చ కూడా నడుస్తోంది. కేసీఆర్ వ్యతిరేకులంతా ఒక్కతాటిపైకి రావాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి తాను నాయకుడ్ని కాదని, సోనియా, ఖర్గేలే నాయకులన్నారు. తన వల్ల ఇబ్బంది అవుతుంది అనుకుంటే… ఒక మెట్టు కాదు పది మెట్లు దిగడానికి సిద్ధమంటూ కొత్త చర్చకు తెరలేపారు. వివేక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల లాంటి వారు కాంగ్రెస్ లోకి రావాలన్నారు. మరోవైపు ఎన్నికలకు ముందు తెలంగాణ ఉద్యమ నేతలను కలుపుకొని పోయేందుకు రెడీ అవుతున్న బీఆర్ఎస్ కూడా ఈటలపై సాఫ్ట్ కార్నర్ కామెంట్స్ చేయడం కీలకంగా మారుతోంది. మొత్తంగా ఈటల చేరాలంటూ అటు రేవంత్, ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్పడంతో ఆయన్ను నమ్మి బీజేపీలో చేరాలనుకునే వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి ఉందంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే అంతర్గత విబేధాలు, అటు కర్ణాటకలో ఓటమి ఎఫెక్ట్ తో పార్టీలో చేరేందుకు పెద్ద నేతలు ముందుకు రావడం లేదన్న టాక్ అయితే వినిపిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News