జగన్ పల్నాడు పర్యటన ఈరోజు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. భారీగా జనాన్ని తరలించవద్దని పోలీసులు ఎంత వారిస్తున్నా జగన్ టీమ్ అన్నంత పని చేసింది. ఫలితంగా రోడ్డు ప్రమాదం ఇద్దర్ని బలితీసుకుంది. అయితే జగన్ పర్యటనకు ఇసకేస్తే రాలనంత జనం వచ్చారని, సత్తనెపల్లి మండలం రెంటపాళ్లలో జన జాతర కనిపించిందని వైసీపీ అనుకూల మీడియా హైలైట్ చేసుకుంటోంది. మరి ఈ జనజాతర అంతా దేనికోసం..? వారంతా జగన్ ని చూడటానికి వచ్చారా..? లేక బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చారా..? లేక ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తెలియజెప్పేందుకు జగన్ కోసం వచ్చారా..? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఈ ప్రశ్నకు సోషల్ మీడియాలో చిత్ర విచిత్రమైన సమాధానాలు దొరుకుతున్నాయి. అసలు జగన్ పర్యటనకు వస్తున్నవారిలో సగం మంది రీల్స్ చేసుకోడానికే వస్తున్నారని సెటైర్లు పేలుస్తున్నాయి వైరి వర్గాలు. దీనికి సాక్ష్యాలుగా కొన్ని వీడియోలను కూడా వారు చూపెడుతున్నారు.
తాజాగా జగన్ పర్యటనకోసం వచ్చిన యువతులు కొందరు ఒక వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. వారిని పోలీసులు మధ్యలో ఆపారని, అయితే తాము రెంటపాళ్ల వెళ్తున్నట్టు చెప్పామని, అక్కడికి వెళ్లొద్దని వారించినా, తాము వెళ్లాల్సిందేని చెప్పి వచ్చేశామని అన్నారు. ఇదంతా ఒక రీల్ లా చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇలాంటి ప్రయాణాలన్నీ రీల్స్ కోసమేనని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.
మాస్ రా మామా… 🔥🔥🔥🔥 pic.twitter.com/AEKN61syjU
— Nani (@Ravanaroy) June 18, 2025
ఇటీవల జగన్ పొదిలి పర్యటనలో కూడా ఒక వీడియో వైరల్ గా మారింది. పొదిలిలో జగన్ ని చూసేందుకు ముగ్గురు అమ్మాయిలు బైక్ పై వస్తున్నారు. వాళ్లు వస్తుండగా మరొకరు వీడియో తీసి అప్ లోడ్ చేశారు. తగ్గేదే లేదన్నట్టుగా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ని ఇమిటేట్ చేస్తూ వారు కెమెరాకు ఫోజులిచ్చారు. ఇలాంటి వీడియోలన్నీ రీల్స్ రూపంలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ వీడియోల్లో కనపడుతున్నవారంతా యువతే కావడం విశేషం. జగన్ కోసం తాము ఏమైనా చేస్తామంటూ కొందరు యువకులు బ్యానర్లు పట్టుకుని కనపడుతున్నారు. ఆ బ్యానర్ల వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక యువతులు కొందరు బైక్ లపై రైడ్ చేస్తూ వారే సెల్ఫీ వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా వెళ్లడమే కాకుండా, బైక్ రైడ్ చేస్తూ వీడియోలు తీయడం సమంజసమేనా అని ప్రశ్నిస్తున్నారు.
ఇక జగన్ ని కలసిన వారు, కలిసేందుకు ప్రయత్నించిన వారు, ఆయన ప్రెస్ మీట్ వీడియోలను కూడా వైరల్ చేస్తున్నారు అభిమానులు. ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగన్ ని కలిసేందుకు పోలీసులు అడ్డు చెబితే, కొందరు పొలాల్లో బైక్ లు నడిపి చివరకు సత్తెనపల్లి చేరుకున్నారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా జగన్ పర్యటన అంటే చాలు వైరల్ వీడియోలు వరుసగా అప్ లోడ్ అవుతున్నాయి. జగన్ పర్యటనను ఇలా కొంతమంది రీల్స్ కోసం వాడుకుంటున్నారని నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.