ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన విమానాలు తరచుగా ప్రమాదాలకు గురవుతున్నాయి. పలు కారణాలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్నాయి. తాజాగా మరోసారి ఆ సంస్థకు చెందిన విమానం అత్యవసరంగా కిందికి దింపాల్సి వచ్చింది. కోల్‌కతా నుంచి శ్రీనగర్ కు వెళ్తున్న ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం వారణాసి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో ఉన్న 166 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతోంది.
ఇండిగో విమానయాన సంస్థకు చెందిన 6E-551 విమానం 166 మంది ప్రయాణికులతో కోల్‌కతా నుంచి బయల్దేరింది. విమానం మార్గం మధ్యలో ఉండగా, ఇంధన లీక్ అవుతున్నట్లు సిబ్బంది గమనించారు. అప్పటికే విమానం వారణాసి సమీపంలోకి వచ్చింది. వెంటనే పైలెట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి సమాచారం అందించారు. ATC నుంచి క్లియరెన్స్ పొందిన తర్వాత, వారణాసిలోని లాల్ బహద్దూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో పైలట్ అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయినప్పటికీ, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
ఎమర్జెన్సీ తర్వాత LBSI విమానాశ్రయ డైరెక్టర్ పునీత్ గుప్తా పలు విషయాలు వెల్లడించారు. “కోల్‌కతా నుంచి శ్రీనగర్ కు వెళ్తున్న ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం నంబర్ 6961 పైలట్ ఇంధన లీకేజీని గమనించాడు. ఆ తర్వాత వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వారణాసిని సంప్రదించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం రిక్వెస్ట్ చేశారు. విమానం క్లియరెన్స్ పొందిన తర్వాత, రన్ వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది. సంబంధిత విమానయాన సంస్థలు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి” అని వెల్లడించారు. అటు ఈ విమానం ల్యాండ్ అయిన తర్వాత టెక్నికల్ టీమ్ అవసరమైన మరమ్మతుల కోసం విమానాన్ని తనిఖీ చేసింది. అటు మరమ్మతులు పూర్తయ్యి , విమానం బయలుదేరే వరకు ప్రయాణీకులు విమానాశ్రయంలోని లాంజ్ లో వెయిట్ చేయాల్సి వచ్చింది.
Read Also: అబ్బాయి, అమ్మాయికి కలిపి RAC సీటు.. చివరికి ఏం జరిగిందంటే?
అటు ఈ ఘటనపై ఇండిగో కీలక విషయాలు వెల్లడించింది.“ కోల్ కతా నుంచి శ్రీనగర్ కు వెళ్తున్న ఇండిగో విమానం 6E 6961, టెక్నికల్ సమస్యల కారణంగా వారణాసి విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. భద్రతా చర్యల్లో భాగంగా, అవసరమైన తనిఖీల కోసం విమానం నిలిపివేయబడింది. ప్రయాణాన్ని కొనసాగించడానికి ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేశాం. ప్రయాణీకులు, సిబ్బంది, విమానాల భద్రత మా ప్రధాన ప్రాధాన్యతగా భావిస్తున్నాం. ఈ ఘటన పట్ల ఇబ్బంది ఏర్పడినా, ఓపికగా ఉన్న ప్రయాణీకులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం” అని ఇండిగో తెలిపింది.
Read Also: మెదక్ లో అకస్మాత్తుగా ఆగిపోయిన అజంతా ఎక్స్ ప్రెస్, గంటల తరబడి ప్రయాణీకుల అవస్థలు!