వైజాగ్ కి వస్తున్న గూగుల్ డేటా సెంటర్ తో లక్షల ఉద్యోగాలు వస్తాయని టీడీపీ నేతలు అంటున్నారు.
అబ్బే అంత లేదు, అదేమీ కాల్ సెంటర్ కాదు అని బీజేపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతారు.
భీమవరం డీఎస్పీ సంగతి చూడాలని సాక్షాత్తూ డిప్యూటీ సీఎం డీజీపీకి ఫిర్యాదు చేశారు.
ఆయన గుడ్ ఆఫీసర్ అంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు సర్టిఫికెట్ ఇచ్చారు.
ఇదంతా చూస్తుంటే కూటమిలో ఏదో జరిగిపోతోందనే అనుమానాలు ఎక్కువవుతున్నాయి. వైసీపీకి, ఆ పార్టీ అనుకూల మీడియ, సోషల్ మీడియా కూడా ఈ విషయాలనే హైలైట్ చేస్తున్నాయి. అయితే ఇటీవల ఇలాంటి ప్రశ్నలకు హోం మంత్రి వంగలపూడి అనిత చక్కటి సమాధానం చెప్పారని అంటున్నారు నెటిజన్లు. మాకు లేని ఇగోలు, మీకెందుకబ్బా అని ఆమె జర్నలిస్ట్ లను ప్రశ్నించారు. ఒకరకంగా ఈ ప్రశ్నలాంటి సమాధానం వైసీపీ నేతలకే అని అనుకోవాలి. అవును, కూటమి నాయకుల మధ్య లేని ఇగోలు వైసీపీ నేతలకెందుకు? అయితే ఈ మాట హోం మంత్రి సహా ఇతర నేతలంతా అనగలిగినప్పుడే కూటమి బలంగా ఉండగలదు.
ఇగోలు సహజం..
మూడు పార్టీల కూటమి. అందులోనూ వైసీపీని ఘోరంగా ఓడించి అధికారంలోకి వచ్చింది. జెండాలు జత కట్టినా మాకు ఏమీ కాదంటూ బీరాలు పలికిన వైసీపీ, ఆ కూటమి వల్లే ఓడిపోయామని తీరిగ్గా గ్రహించింది. దీంతో కూటమిలో లుకలుకలు మొదలవ్వాలని కోరుకుంది. కోరుకోవడమే కాదు, దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టింది. కూటమి నేతల మధ్య సఖ్యత లేదని, ఒకరంటే ఒకరికి పడటం లేదని, వైసీపీ అనుకూల మీడియా ప్రచారం మొదలు పెట్టింది. ఇక కూటమిలో పవన్ కి ప్రయారిటీ లేదంటూ వైసీపీ నేతలు కూడా సింపతీ చూపించడం మొదలు పెట్టారు. లోకేష్ కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని కూడా వైసీపీ నేతలు జనసైనికుల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్ననట్టు తెలుస్తోంది. ఇవన్నీ వాస్తవాలా, కాదా అనే విషయం పక్కనపెడితే 2024లో కూటమి బలంగా ఉండటం వల్లే అధికారంలోకి వచ్చారనేది వాస్తవం. ఇప్పుడది బలహీన పడితే వైసీపీకి కచ్చితంగా లాభమే. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం పడిపోదు కానీ, 2029 నాటికి ఎవరి దారివారు అయితే, మధ్యలో వైసీపీ లాభపడుతుంది. ఆ అవకాశం వైసీపీకి ఇవ్వకూడదని చంద్రబాబు, పవన్ కల్యాణ్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. అందుకే పదే పదే పవన్ తమది 15 ఏళ్ల బంధం అంటూ నేతలకు హింటిస్తూ వస్తున్నారు. కానీ కిందిస్థాయిలో ఆ సఖ్యత లేదనేది వాస్తవం.
Also Read: జగన్ అసెంబ్లీ మొదలు
ఆమధ్య మంత్రి నారాయణ కూడా కింది స్థాయి నేతల్లో సఖ్యత లేదని స్టేట్ మెంట్ ఇచ్చారు. ఒకరి మంత్రిత్వ శాఖల్లో మరొకరు జోక్యం చేసుకోవడం వల్ల కూడా గొడవలు మొదలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. రేషన్ బియ్యం విషయంలో నెల్లూరు సిటీ టీడీపీ నేత చేసిన వ్యాఖ్యలకు మంత్రి నాదెండ్ల మనోహర్ నొచ్చుకున్నారో లేదో తెలియదు కానీ, ఆయన హర్ట్ అయ్యారని వైసీపీ మీడియా ప్రచారం మొదలు పెట్టింది. దీంతో వెంటనే నారాయణ రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో ఆయన టెలికాన్ఫరెన్స్ పెట్టగా, అందులో ఓ పాయింట్ లీక్ కావడంతో మరింత రచ్చ జరిగింది. సో.. గొడవల్ని సద్దుమణిగేలా చేయడం కంటే, వాటిని అసలు మొదలు కాకుండా ఆపడమే ఉత్తమం. ఈ దశలో కూటమిలోని ఒక పార్టీ మంత్రిత్వ శాఖల్లో మరొక పార్టీ జోక్యం చేసుకోకపోవడమే మంచిదని అంటున్నారు. సమస్యలుంటే, నేరుగా మంత్రి దృష్టికి తీసుకెళ్లడం ఉత్తమం అంటున్నారు. మంత్రులకు ఇగోలు లేకపోయినా, వారిని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసేవారు, ఆ వ్యాఖ్యల్ని పదే పదే సోషల్ మీడియాలో పెట్టి మరింత ఇబ్బంది పెట్టేవారు ఉండనే ఉంటారు. అలాంటి విఘ్నాలను తప్పించుకుంటేనే 2029లో కూడా కూటమి ఒక్కటిగా పోటీ చేస్తుంది. ఈ గొడవలు ముదిరితే మాత్రం కూటమికి తిప్పలు తప్పవు. అయితే ఆ చొరవ అందరు నేతలు తీసుకోవాలి. అది ఎంతవరకు సాధ్యమనేది వేచి చూడాలి.
Also Read: మాగంటి గోపీనాథ్ కు సునీత భార్య కాదా?
Also Read: మోదీని మెప్పించిన నారా లోకేష్.. ఆ రెండు రాష్ట్రాలకు మంట