Bhimavaram DSP Issue: భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారం కొత్త ములుపు తిరిగింది. డీఎస్పీపై వచ్చిన అభియోగాలపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. తనకున్న సమాచారం మేరకు డీఎస్పీకి మంచి ట్రాక్ రికార్డు ఉందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో జూద శిబిరాలపై పోలీసులు గట్టి నిఘా పెట్టారన్నారు. అందుకే డీఎస్పీపై ఉద్దేశపూర్వక అభియోగాలు వస్తున్నట్లు భావిస్తున్నానన్నారు. ఉండి నియోజకవర్గంలో ఎలాంటి జూద శిబిరాలు లేవని డిప్యూటీ స్పీకర్ రఘురామ చెప్పారు. జూద శిబిరాలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు.
‘భీమవరం డీఎస్పీ జయసూర్య వెరీగుడ్ ఆఫీసర్. డీఎస్పీ గురించి పవన్ కల్యాణ్ కు ఎవరేం చెప్పారో నాకు తెలియదు. గోదావరి జిల్లాల్లో పేకాట ఆడటం అనేది సహజం. గోదావరి జిల్లాల్లో పేకాట అంటే ఊపిరి తీసుకున్నట్లే ఉంటుంది. భీమవరంలో ఎక్కడ పేకాట శిబిరాలు నడవడం లేదు’- డిప్యూటీ స్పీకర్ రఘురామ
భీమవరం డీఎస్పీ జయసూర్య పరిధిలో జూద శిబిరాలు పెరిగాయని ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అలాగే ఆయన సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. డీఎస్పీ వ్యవహారశైలిపై డీజీపీ, హోంమంత్రిని నివేదిక కోరారు. పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీతో పవన్ కల్యాణ్ మాట్లాడారు.
‘ఆంధ్రప్రదేశ్ లో జూదం ఆడటం, జూద కేంద్రాలు నిర్వహించడం, ప్రోత్సహించడం నేరం. ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ లో వీటిని నిర్వహించినా, ఆడినా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ – 1974 ప్రకారం శిక్షార్హులు అవుతారని చట్టం చెబుతోంది. రాష్ట్రంలో చట్ట విరుద్ధంగా జూద కేంద్రాలు సాగుతున్నాయని డిప్యూటీ సీఎం కార్యాలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. పేకాట క్లబ్బుల నిర్వహణపై ఆ ఫిర్యాదుల్లో తెలిపారు. కొందరు పెద్దలు పేకాట కేంద్రాలను నిర్వహిస్తూ, నెలవారీ మామూళ్లను అధికారులకు అందజేస్తున్నారనే ఆరోపణలు అధికంగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో దీనిపై నిజానిజాలు తెలుసుకునేందుకు, పోలీసు అధికారులకు దీనిపై ఉన్న సమాచారం తెలుసుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరా తీశారు. ఒకవేళ పోలీసు అధికారుల దృష్టికి వచ్చిన వివరాలు, దానిపై తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో తెలియజేయాలని డిప్యూటీ సీఎం డీజీపీకి స్పష్టం చేశారు’ అని డిప్యూటీ సీఎం కార్యాలయం ఎక్స్ లో పోస్టు పెట్టింది.
భీమవరం డీఎస్పీ జయసూర్యపై డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. పేకాట, కోడి పందాలకు అనధికార అనుమతులపై ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. సివిల్ వివాదాల్లోనూ డీఎస్పీ జోక్యం చేసుకోవడం పవన్ ఆగ్రహానికి కారణమని సమాచారం. కూటమి నేతల్లో కొందరికి అనుకూలంగా, మరికొందరికి వ్యతిరేకంగా డీఎస్పీ వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. డీఎస్పీ తీరును కూటమి నేతలు డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి తీసుకెళ్లారు భీమవరం డీఎస్పీపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో విచారణ చేపట్టామన్నారు. విచారణ పారదర్శకంగా జరుగుతోందన్నారు.
Also Read: Pawan Kalyan: పవన్ కల్యాణ్ కి కోపం తెప్పించిన డీఎస్పీ.. డీజీపీ వద్ద పంచాయితీ