Srikakulam News: వైసీపీలోని మాజీ మంత్రులకు కష్టాలు మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వంలో ఏడాదిపాటు ప్రశాంతంగా గడిపారు ఆ పార్టీ నేతలు. సెకండ్ ఏడాది నుంచి విచారణల పర్వం మొదలైంది. ఈ క్రమంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును దాదాపు ఏడు గంటలపాటు విచారించారు పోలీసులు. చివరకు అదుర్స్ సినిమాను ఆ నేత ఫాలో అయిపోయినట్టు తెలుస్తోంది.
సీదిరి అప్పలరాజుకు చెమటలు పట్టాయా?
సమయం, సందర్భం బట్టి రాజకీయాల్లో ట్రెండ్ మారుతుంది. అందుకు అనుగుణంగా వెళ్లకుంటే ఎలాంటివారైనా బుక్కవుతారు. ఇబ్బందులు పడడం ఖాయం. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విషయంలో అదే జరిగింది. ఓ కేసు విషయంలో శనివారం ఆయనను కాశీబుగ్గ పోలీసులు దాదాపు ఏడు గంటలపాటు విచారణ చేపట్టారు.
ముఖ్యంగా ఆయన నుంచి మూడు రకాల సమాధానాలు వచ్చాయిట. తెలీదు.. గుర్తు లేదు.. మరిచిపోయారు. ఇదేదో సినిమా డైలాగులా ఉంది కదూ. అదేనండి జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ మూవీలోని డైలాగ్. ఒక్కో డైలాగ్‌కు లక్షలకు లక్షలు విలన్ నుంచి గుంజుతాడు జూనియర్. అన్నట్లు ఆ సినిమా నిర్మాత మాజీ ఎమ్మెల్యే వంశీ. అందుకే కాబోలు ఆ డైలాగ్‌ని ఫాలో అయిపోతున్నారు వైసీపీ నేతలు.
అదుర్స్ డైలాగ్స్.. మరోసారి హాజరు
ఏడు గంటల విచారణ తర్వాత ఆయన్ని పంపించేశారు అధికారులు. మరోసారి పిలుస్తామని వీలైతే స్టేషన్‌కు రావాల్సి ఉంటుందని అన్నారు. తప్పకుండా వస్తానని సదరు మాజీ మంత్రి పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఇంతకీ సీదిరి ఏ కేేసులో పోలీసులు విచారణ చేపట్టారు? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
ఓ మైనర్ బాలికపై దాడి కేసు విషయంలో పోయిన ఏడాది అక్టోబర్ నాలుగో వారంలో కూటమి ప్రభుత్వంపై అనుచితంగా వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు. స్టేషన్‌కి పసుపు రంగు వేసి ప్రజలెవరూ రావొద్దని టీడీపీ కార్యకర్తలకు మాత్రమే ప్రవేశం అని బోర్డులు పెడతామని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోకుంటే ప్రత్యేకంగా ప్రైవేటు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని వ్యాఖ్యానించారు.
ALSO READ: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్
వాటిని జిల్లా ఎస్పీతో ప్రారంభోత్సవం చేయిస్తామని వ్యాఖ్యానించారు సదరు నేత. ఆయన వ్యాఖ్యలపై అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీదిరి కాశీబుగ్గ పోలీసుల ముందు హాజరయ్యారు. రాత్రి తొమ్మిదిన్నర వరకు పలు రకాల ప్రశ్నలు పోలీసులు వేశారు. పోలీస్‌స్టేషన్‌కి పసుపు రంగు వేయాలని ఎందుకు అన్నారు? దీని వెనుక అసలు ఉద్దేశం ఏంటి?
ఆ విధంగా మాట్లాడాలని ఎవరైనా చెప్పారా? అని ప్రశ్నించారట పోలీసులు. తాను ఆ విధంగా అనలేదని రిప్లై ఇచ్చారట. స్టేషన్‌కి రావొద్దని ప్రజలకు ఎందుకు తప్పుడు సమాచారం ఇచ్చారు? ఆ విషయం తెలీదు,గుర్తు లేదని సమాధానం దాట వేసే ప్రయత్నం చేశారట. రాత్రి ఎనిమిది గడిచిన అప్పలరాజు స్టేషన్ నుంచి బయటకు రాకపోవడంతో వైసీపీ కార్యకర్తల్లో అలజడి మొదలైంది. తమ నేతను అరెస్టు చేస్తారేమోనని భావించారు.
చివరకు ఆ పార్టీ కార్యకర్తలు 9 గంటల సమయంలో స్టేషన్ కు వచ్చారు. తొమ్మిదిన్నర గంటల సమయంలో అప్పలరాజు స్టేషన్ నుంచి బయటకు రావడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. అప్పలరాజు నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సోమవారం విచారణకు రావాలి చెప్పినట్టు తెలుస్తోంది.