నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వపక్షంలో ఉన్నా విపక్షంలో ఉన్నట్టే ప్రవర్తిస్తుంటారు. తన నియోజకవర్గానికి రావాల్సిన నిధులు, అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలపై ఆయన ఎక్కడా రాజీపడరు. వైసీపీ ప్రభుత్వంలో కూడా ఆయన ఇలాగే నిక్కచ్చిగా వ్యవహరించేవారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కూడా జిల్లా సమీక్ష సమావేశంలో అధికారులు, సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొంథా తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రైతులకు సాయం అందలేదని ఆయన ఆరోపించారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి తుఫాన్ సందర్భంగా ప్రభుత్వం నుంచి ఎంత పశువుల దాణా కేటాయించారో చెప్పాలని DRC సమావేశంలో ప్రశ్నించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు.#AdminPost pic.twitter.com/UKbeis7zO8
— Kotamreddy Sridhar Reddy (@kotamreddy_NLR) November 8, 2025
పశువుల దాణా విషయంలో ఆగ్రహం..
నెల్లూరు జిల్లాకు కేటాయించిన పశువుల దాణాలో కనీసం ఒక్క టన్ను కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి కేటాయించలేదని అధికారులపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ ని కార్పొరేషన్ లో భాగంగా చూడొద్దని చెప్పారాయన. కేవలం రూరల్ ని ఒక మండలంగా పరిగణిస్తూ తమకి అన్యాయం చేస్తున్నారని చెప్పారు. ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో కూడా తమపై చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి పదవి దక్కేనా?
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎప్పట్నుంచో మంత్రి పదవిపై ఆశ ఉంది. వైసీపీ హయాంలో అది నెరవేరలేదు సరికదా, జిల్లాలోనే కాకాణి గోవర్దన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ కి మంత్రి పదవులు దక్కడంతో ఆయన బాగా హర్ట్ అయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జగన్ నుంచి దూరం జరిగారు. చివరకు టీడీపీలో చేరి 2024లో గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డ్ సృష్టించారు. ఈసారి కూడా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. తనతోపాటు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డికి పదవి రావడంతో కొన్నాళ్లుగా కోటంరెడ్డిలో అసంతృప్తి ఉందని తెలుస్తోంది. అయితే దాన్ని బయటపడనీయడం లేదు.
రూరల్ లో గట్టి ఫౌండేషన్..
నెల్లూరు రూరల్ లో పార్టీ ఏదయినా అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మాత్రమే ప్రజలు గుర్తుంచుకునేలా ఆయన పక్కాగా ఫౌండేషన్ వేసుకున్నారు. పార్టీ మారినా తిరిగి అదే నియోజక వర్గం నుంచి గెలిచి చూపించారు. ప్రత్యర్థులు ఎంత బలవంతులైనా కోటంరెడ్డి మాత్రం ఓడిపోకపోవడానికి కారణం అదే. ఈసారి కూడా రూరల్ నియోజకవర్గంలో మరింత గట్టి ఫౌండేషన్ కోసం ప్రయత్నిస్తున్నారు కోటంరెడ్డి. తన తమ్ముడు గిరిధర్ రెడ్డిని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా గిరిధర్ రెడ్డి నేరుగా అక్కడకు వెళ్లి సమస్యలు పరిష్కరించి వస్తున్నారు. దీంతో నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి బ్రదర్స్ హవా కొనసాగుతోంది. పార్టీకంటే అక్కడ కోటంరెడ్డికే ఎక్కువ పలుకుబడి ఉంది. కోటంరెడ్డి ఏ పార్టీలో ఉన్నా ఆయన వెంట నడిచే బలమైన కేడర్ ఉంది. అందుకే వారి కోసం బలంగా నిలబడుతున్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. జిల్లా మీటింగుల్లో కూడా వారి కోసం బలమైన వాదన వినిపిస్తున్నారు. తాజాగా డీఆర్సీ మీటింగ్ లో రూరల్ ప్రజల కోసం ఫైట్ చేశారు కోటంరెడ్డి. పశువుల దాణా విషయంలో అధికారుల్ని నిలదీశారు.
Also Read: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్
Also Read: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్