BigTV English
Advertisement

Janasena-TDP Alliance : జనసేన టీడీపీ పొత్తు.. కన్‌ఫ్యూజన్‌లో కమలనాథులు..

Janasena-TDP Alliance : జనసేన టీడీపీ పొత్తు.. కన్‌ఫ్యూజన్‌లో కమలనాథులు..
Janasena-TDP Alliance

Janasena-TDP Alliance(AP political news):

ఏపీ బీజేపీ నేతలు ప్రస్తుతం అయోమయంలో ఉన్నారు. మాములుగానే కన్‌ఫ్యూజన్‌లో ఉన్న కమలనాథులను మరింత పరేషాన్‌ చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎన్డీయేలో పార్టనర్ హోదాలో బీజేపీ మిత్రపక్షంగా ఉంటూనే టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు పవన్‌. అది నైతికమా.. అనైతికమా అన్న సంగతి పక్కన పెడితే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే పవన్ చెబుతున్న పాయింట్‌. టీడీపీతో పొత్తును అనౌన్స్ చేసిన తర్వాత తెలంగాణలో బీజేపీతో పొత్తులో పోటీ చేసి పరువు పోగొట్టుకున్నారు జనసేనాని. అసెంబ్లీ ఎన్నికలవగానే, లోక్‌సభ ఎన్నికలకు ఒంటరిగా పోటీ చేస్తామంటూ బీజేపీ ప్రకటించి పవన్‌లో లింక్ కట్ చేసేసుకుంది.


తెలంగాణ బీజేపీ నేతలు క్లారిటీగానే ఉన్న ఏపీలో మాత్రం బీజేపీ నేతలకు హైకమాండ్ నుంచి ఇంకా రోడ్‌మ్యాప్‌ రాలేదు. దీంతో జనసేనతో తమ పొత్తు కొనసాగుతోందనే ఇప్పటికీ చెబుతున్నారు. కానీ పవన్ మాత్రం ఈ మధ్య కాలంలో బీజేపీ నేతలను కలిసిన దాఖలాలే లేవు. అదే సమయంలో భవిష్యత్తుకు గ్యారంటీ అనే చంద్రబాబు హామీతో విడుదలైన పాంప్లెట్ మీద చంద్రబాబు సంతకంతో పాటు పవన్ సంతకం కూడా ఉంది. లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు హాజరుకావడం, చంద్రబాబుతో తరచూ సమావేశం అవుతుండడం, ఇప్పుడు ఉమ్మడిగా పాంప్లెట్ విడుదల చేయడం… అన్నీ చకచకా జరిగిపోతున్నా బీజేపీ హైకమాండ్‌ మాత్రం ఇంకా పవన్ తమతో పొత్తులో ఉన్నామనే చెప్పుకుంటూ సరిపెట్టుకొంటోంది. ఇదే లోకల్ లీడర్లలో టెన్షన్ పెంచేస్తోంది.

అటు చూస్తే ఎన్నికలకు వంద రోజులే ఉంది. ఇటు చూస్తే పార్టీ భవిష్యత్తు గందరగోళంగా కనిపిస్తోంది. పవన్ ఇమేజ్‌తో ఎన్నికలకు వెళ్తే కొన్ని సీట్లైనా వస్తాయన్నది గతంలో బీజేపీ వేసుకున్న లెక్క. కానీ ఇప్పుడు పవన్ మాత్రం బీజేపీతో సంబంధం లేకుండా టీడీపీతో పొత్తును అనౌన్స్ చేయడం, బీజేపీ కూడా తమతో కలిసి రావాలంటూ చెప్పేయడంతో ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. ఒకవేళ పవన్‌తో పొత్తు కంటిన్యూ చేయాలంటే, అది టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లే. ఇప్పటికే జనసేన టీడీపీ మధ్య సీట్ల లెక్కలు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. మరి బీజేపీ ఈ పొత్తులో చేరితే ఎవరి వాటా నుంచి సీట్లను ఇస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. అసలు ఆ పొత్తుకు బీజేపీ హైకమాండ్ ఒప్పుకుంటుందా లేదా అన్నది కూడా డౌటే. జనసేన తమ మిత్రపక్షమేనని, రాబోయే ఎన్నికల్లో తమ రెండుపార్టీలు కలిసే ఎన్నికలకు వెళతాయని పదేపదే చెబుతున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి.


గత ఎన్నికల ఫలితాలు బీజేపీ నేతలకు ఇప్పటికీ పీడకలగానే ఉన్నాయి. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పడు బీజేపీ 13 చోట్ల పోటీ చేసి 4 చోట్ల విజయం సాధించింది. మిగిలిన 9 చోట్ల కూడా భారీగా ఓట్లు సాధించింది.. కానీ 2019లో ఒంటరిగా వెళ్లి ఒక్క సీటునూ సాధించలేకపోయింది. అంతకన్నా ఘోరమైన విషయం ఏంటంటే 165 నియోజకవర్గాల్లో నోటా కన్నా బీజేపీ అభ్యర్థులకు తక్కువ ఓట్లు పడడం. ఏపీలో బీజేపీకి లీడర్లు తప్ప క్యాడర్ పెద్దగా లేదన్న సంగతిని ఆ ఫలితాలే చాటిచెప్పాయి.

ఇప్పుడు కూడా ఒంటరిగా వెళ్తే ఉన్న పరువు కూడా పోతుందేమోనన్న భయం బీజేపీని వెంటాడుతోంది. అందుకే.. ఒంటరిగా వెళ్లడం కన్నా టీడీపీ-జనసేనతో కలిసి వెళ్తే కనీసం మూడు నాలుగు సీట్లన్నా రావొచ్చన్న ఆశ బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వాళ్లలో ఎక్కువమంది పొత్తు వైపే మొగ్గుచూపుతున్నారు. మొదట్నుంచీ పార్టీలో ఉన్న వాళ్లు మాత్రం పొత్తుకు సిద్ధంగా లేనట్లుగానే కనిపిస్తోంది.

ఏపీలో మారుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ఢిల్లీ పెద్దలు.. తక్షణ ప్రయోజనాలకన్నా పార్టీ భవిష్యత్తే ముఖ్యమంటూ చెబుతున్నారన్న ప్రచారం కమలం పార్టీలో అంతర్గతంగా సాగుతోంది. టీడీపీ-జనసేనతో కలిసి వెళ్లే పరిస్థితి లేకపోతే మాత్రం ఆ పార్టీల్లో ఏదో ఒకదానిలో చేరి టికెట్ దక్కించుకోవాలన్న ప్రయత్నాల్లో కొంతమంది నేతలు ఉన్నట్లూ తెలుస్తోంది. ఏమైనా ఏపీ ఎన్నికలు మాత్రం బీజేపీకి విషమ పరీక్షగానే కనిపిస్తున్నాయి.

Related News

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

Big Stories

×