Fat Rich Fruits: సాధారణంగా పండ్లలో కొవ్వు తక్కువగా, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని మనందరికీ తెలుసు. అయితే.. కొన్ని ప్రత్యేకమైన పండ్లు ఈ నియమానికి మినహాయింపుగా ఉంటాయి. వీటిలో కొవ్వు పదార్థాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ కొవ్వులు ఆరోగ్యకరమైన కొవ్వులు కావడం విశేషం. ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అధిక కొవ్వు పదార్థాలు కలిగిన 7 పండ్లు, వాటి ఆరోగ్య ప్రయోజనాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. అవకాడో :
అవకాడో కొవ్వు, పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. వ మధ్యస్థాయి అవకాడోలో దాదాపు 75% కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఇందులో ఉండే కొవ్వులు ఎక్కువగా మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ , ముఖ్యంగా ఒలిక్ యాసిడ్ రూపంలో ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అంతే కాకుండా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. అలాగే పొటాషియం, ఫైబర్ కూడా ఇందులో అధిక మోతాదులో ఉంటాయి.
2. కొబ్బరి:
జీవశాస్త్ర పరంగా కొబ్బరి ఒక పండు (డ్రూప్). కొబ్బరిలో కొవ్వు శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కొబ్బరిలో దాదాపు 65% కొవ్వు ఉంటుంది. కొబ్బరిలోని కొవ్వులు ఎక్కువగా శాచురేటెడ్ ఫ్యాట్స్ అయినప్పటికీ.. వీటిలో అధిక భాగం మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ రూపంలో ఉంటాయి. ఈ MCTలు ఇతర కొవ్వుల కంటే వేగంగా శక్తిగా మారతాయి. అంతే కాకుండా ఇవి మెదడు ఆరోగ్యానికి మంచివని చెబుతారు.
3. ఆలివ్‌లు:
వంటకాలలో ముఖ్యమైన భాగంగా ఉండే ఆలివ్‌లు కూడా పండ్ల కోవకే చెందుతాయి. 10 ఆకుపచ్చ ఆలివ్‌లలో సుమారు 6 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఆలివ్‌లలో కూడా అవకాడో మాదిరిగానే గుండెకు మేలు చేసే మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి విటమిన్ E , యాంటీ ఆక్సిడెంట్లకు కూడా మంచి మూలం. ఆలివ్ ఆయిల్ కూడా ఈ పండు నుంచి లభిస్తుంది.
4. దురియన్ :
“కింగ్ ఆఫ్ ఫ్రూట్స్”గా పిలిచే.. దురియన్.. ముఖ్యంగా ఆగ్నేయాసియాలో ప్రసిద్ధి చెందింది. దీని రుచి, వాసన చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఒక కప్పు దురియన్‌లో సుమారు 13 గ్రాముల సహజ కొవ్వులు ఉంటాయి. ఇది చక్కెరతో పాటు అధిక కొవ్వును కలిగి ఉన్నప్పటికీ.. ఇందులో ఫైబర్, విటమిన్ C, B విటమిన్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి.
5. అకాయ్ బెర్రీ :
స్మూతీ బౌల్స్‌లో ప్రసిద్ధి చెందిన ఈ బెర్రీలు సహజంగా కొవ్వును కలిగి ఉంటాయి. అరకప్పు తీయని అకాయ్ ప్యూరీలో దాదాపు 5 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఈ కొవ్వులో హృదయానికి మేలు చేసే ఒమేగా రకం కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అకాయ్ బెర్రీలు వాటి అధిక యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలకు ప్రసిద్ధి చెందాయి. ఇవి కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి.
6. సపోటా / సపోడిల్లా :
సపోటా పండులో కూడా స్వల్పంగా కొవ్వు పదార్థాలు ఉంటాయి. అయినప్పటికీ ఇది కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే పండు. ఒక కప్పు సపోటాలో సుమారు 2.7 గ్రాముల కొవ్వు ఉంటుంది. సపోటా జీర్ణవ్యవస్థకు మేలు చేసే ఫైబర్‌కు మంచి మూలం. ఇది ఐరన్, కాల్షియం, ఇతర ఖనిజాలను కూడా అందిస్తుంది.
Also Read: చలికాలంలో చర్మాన్ని.. కాపాడుకోండిలా !
7. కారిస్సా :
బ్రైట్ రెడ్ కలర్‌లో ఉండే ఈ పుల్లని పండులో కూడా కొద్ది మొత్తంలో కొవ్వు ఉంటుంది. ఒక కప్పు కారిస్సాలో సుమారు 2 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఈ పండులో విటమిన్ C ,ఇతర ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. దీనిని సాధారణంగా జామ్స్ లేదా జెల్లీలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
ఈ పండ్లలో కొవ్వు పదార్థాలు అధికంగా ఉన్నప్పటికీ, ఇవి ఎక్కువగా అన్‌శాచురేటెడ్, ఇతర ఆరోగ్యకరమైన కొవ్వులు. కాబట్టి.. ఈ పండ్లు బరువు పెరగడానికి బదులుగా, పోషకాలను అందించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి సహాయపడతాయి. అయితే. బరువును నియంత్రించుకోవాలనుకునేవారు వీటిని మితంగా తీసుకోవడం ఉత్తమం.