మాజీ మంత్రి రోజా నగరి నుంచి మకాం ఎత్తేశారు, పనిలో పనిగా ఏపీ రాజకీయాలకు కూడా ఆమె దూరం జరిగారా? అంటే జగనన్న పార్టీకి ఆమె గుడ్ బై చెప్పేశారా? ఈ ప్రశ్నలన్నిటికీ అధికారికంగా రోజా స్పందించకపోయినా ఆమె రోజువారీ యాక్టివిటీ మాత్రం ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తోంది.
బ్యాక్ టు మూవీస్..
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రోజా సినిమాలు తగ్గించేశారు. టీవీ షో లతో బిజీ అయినా మంత్రి అయ్యాక జబర్దస్త్ కి కూడా దూరం జరిగారు. ఇప్పుడు మంత్రి పదవి లేదు, పార్టీ అధికారంలోనూ లేదు. ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిచినా కూడా జగన్ ఆదేశాల మేరకు అసెంబ్లీకి కూడా వెళ్లే అవకాశం లేదు. అంటే ఏపీలో, ఏపీ రాజకీయాల్లో దాదాపుగా రోజాకి పని లేదన్నమాట. అందుకే ఆమె బ్యాక్ టు పెవిలియన్ అన్నారు. సినిమాల్లో బిజీ అయ్యేందుకు రెడీ అయ్యారు. తెలుగు సినిమాని కాకుండా తమిళ సినిమాని తన కమ్ బ్యాక్ మూవీగా ఎంపిక చేసుకోవడం ఇక్కడ విశేషం. డీడీ బాలచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న లెనిన్ పాండ్యన్ అనే సినిమాలో సంతానం అనే క్యారెక్టర్లో నటిస్తున్నారు రోజా. తన వయసుకు తగ్గ పాత్రలో ఆమె కనపడబోతున్నారు. రోజా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సందర్భంగా చాలామంది ఆమెకు శుభాకాంక్షలు తెలపడం విశేషం.
మరి పొలిటికల్ కెరీర్..
సినిమాలకోసం ఎలా తమిళ్ ఇండస్ట్రీని ఎంపిక చేసుకున్నారో, రాజకీయాల కోసం కూడా తమిళ్ ప్లాట్ ఫామ్ ని సిద్ధం చేసుకున్నారనే ఊహాగానాలు వినపడుతున్నాయి. అప్పట్లో ఆమె హీరో విజయ్ కి చెందిన టీవీకే పార్టీలో చేరతారని అన్నారు. కానీ ఆమె ఆ వార్తలపై స్పందించలేదు. ప్రస్తుతం ఆమె చెన్నైలో బిజీగా ఉంటూ, తమిళనాడుకే చెందిన పార్టీలో చేరతారని అంటున్నారు. అయితే అది విజయ్ కి చెందిన టీవీకే పార్టీనా, ఇంకోటా అనేది తేలాల్సి ఉంది. దాదాపుగా రోజా, విజయ్ పార్టీలోకే వెళ్తారని చెన్నై మీడియాలో బలంగా ప్రచారం జరుగుతోంది.
రోజాతోపాటు ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లు చాలామంది ఇటీవల కాలంలో రాజకీయాలను ఆశ్రయించారు. అయితే అందులో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. రోజా ఏకంగా ఏపీలో మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయారు. సొంత పార్టీలోనే ఆమెకు వ్యతిరేకులున్నారు. జగన్ వద్ద ప్రాభవం ఉన్నా కూడా లోకల్ రాజకీయాలతో ఆమె విసిగిపోయారు. అందుకే వైసీపీకి ఆమె దూరం జరిగినట్టు వార్తలొస్తున్నాయి.
తమిళనాట కుదురుకుంటారా?
ఏపీ రాజకీయాలతో విసిగిపోతే మాత్రం రోజా కచ్చితంగా తమిళనాట సెటిలయ్యే అవకాశాలున్నాయి. అసలు రాజకీయాలే వద్దనుకుంటే ఆమె సినిమాలతో సరిపెట్టుకుంటారు. ఒకసారి అమాత్యయోగం వచ్చిన తర్వాత అంత త్వరగా ఎవరూ రాజకీయాలకు దూరం కాలేరు. అందుకే ఆమె ఏపీలో అయినా, తమిళనాడులో అయినా రాజకీయాలు ప్లస్ సినిమాలు రెండిటికీ దగ్గరగానే ఉంటారని తెలుస్తోంది.
డీగ్లామర్ రోల్స్ ఎందుకు?
తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులకు ఆమె గ్లామరస్ హీరోయిన్ గా తెలుసు. అయితే రీఎంట్రీలో డీగ్లామర్ పాత్రల్ని ఎంపిక చేసుకోవడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. నటనకు అవకాశమున్న పాత్రలతో తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకోవాలని రోజా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అలాంటి పాత్రలయితేనే ఇటు రాజకీయ ప్రయాణానికి కూడా ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో రోజా ఉన్నట్టు చెబుతున్నారు.
Also Read: సీపీ బ్రౌన్ జయంతికి జగన్ నివాళి.. కామెంట్లు మామూలుగా లేవు