
Chandrababu: మంత్రి ఆదిమూలపు సురేష్. ఎప్పుడూ కామ్‌గా ఉంటారు. నీట్‌గా మాట్లాడుతారు. అలాంటి ఆయన.. నడిరోడ్డు మీద చొక్కా విప్పారు. ఏం చేస్తారో చేసుకోమంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసరడం తీవ్ర కలకలం రేపింది. ఇంతకీ ఏం జరిగిందంటే…
చంద్రబాబు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ‘ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించాల్సి ఉంది. అయితే, సీబీఎన్ రాకను వ్యతిరేకిస్తూ.. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. చంద్రబాబు వచ్చే మార్గంలో ప్లకార్డులు, నల్లజెండాలు, నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. మంత్రి సురేష్ స్వయంగా రోడ్డు మీదకు వచ్చి.. వైసీపీ వర్గీయుల ఆందోళనలకు నాయకత్వం వహించారు.
గతంలో నారా లోకేశ్ దళితులను కించపరిచేలా మాట్లాడారని.. ఇప్పుడు ఎస్సీలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలనేది వైసీపీ డిమాండ్. క్షమాపణలు చెప్పకపోతే ఎర్రగొండపాలెంలో అడుగుపెట్టనీయబోమని హెచ్చరించారు.
వైసీపీ నిరసనలకు టీడీపీ శ్రేణులు సైతం అదేస్థాయిలో ప్రతిస్పందించారు. వైసీపీ వర్గీయుల మీదకు తెలుగు తమ్ముళ్లు దూసుకొచ్చారు. ఈ క్రమంలో ఎర్రగొండపాలెంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వారిని సవాల్ చేస్తూ.. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ.. మంత్రి ఆదిమూలపు సురేష్ టీ షర్ట్ విప్పి ఆగ్రహంతో ఊగిపోతూ సవాల్ చేశారు.
పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు భారీగా మోహరించారు. ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. వైసీపీ నిరసనలతో NSG సైతం అప్రమత్తమైంది. చంద్రబాబు భద్రత కోసం అదనపు సిబ్బందిని రప్పించారు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్.
కట్ చేస్తే.. రాత్రి 7 గంటలకల్లా చంద్రబాబు ఎర్రగొండపాలెం చేరుకున్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ క్యాంప్ ఆఫీస్ దగ్గర తన కాన్వాయ్‌ను ఆపించారు. కారెక్కి.. వేటు చూపిస్తూ.. సురేష్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. నిరసనకారులను ఎందుకు అడ్డుకోలేదంటూ పోలీసులపైనా విరుచుకుపడ్డారు.
అదే సమయంలో ఇటు వైసీపీ, అటు టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. చంద్రబాబుపైనా రాళ్లు విసిరే ప్రయత్నం చేయడంతో.. NSG అప్రమత్తమైంది. చంద్రబాబుకు రక్షణగా బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ అడ్డుపెట్టింది.
వైసీపీ దాడిని తిప్పికొడుతూ.. మంత్రి సురేష్ క్యాంప్ కార్యాలయం లోనికి దూసుకెళ్లారు తెలుగు తమ్ముళ్లు. రాళ్ల దాడి చేశారు. పలువురు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఇరు వర్గాల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు వారిని అదుపుచేసే ప్రయత్నం చేశారు. హైటెన్షన్ మధ్యనే చంద్రబాబు రోడ్ షో కొనసాగించారు. గాలి, వాన మధ్యే రోడ్ షో నిర్వహించారు. కరెంట్ కట్ చేసినా చంద్రబాబు యాత్ర కంటిన్యూ చేశారు.