AP Politics : ఏదో వచ్చామా.. పరామర్శించామా.. వెళ్లిపోయామా.. అన్నట్టు ఉండాలి కాని.. నరుకుతాం.. అంతు చూస్తాం.. తొక్కి పడేస్తాం.. ఏం మాటలు ఇవి? ఏం చేష్టలు ఇవి? ఇలాంటి నినాదాలతో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు వైసీపీ నాయకులు?
జగన్ పల్నాడు పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమం అడుగడుగునా హైటెన్షన్ క్రియేట్ చేసింది. 3 వాహనాలు.. 100 మందికి పోలీసులు పర్మిషన్ ఇస్తే.. వైసీపీ శ్రేణులు మాత్రం భారీగా వచ్చి బలప్రదర్శనకు దిగారు. పోలీస్ ఆదేశాలను బేఖాతరు చేశారు. వైసీపీ లీడర్ల ఓవరాక్షన్ ఇద్దరు అమాయకులను బలి తీసుకుంది. ఇక, జగన్ టూర్‌లో వైసీపీ ప్రదర్శించిన పోస్టర్లు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.
రప్పారప్పా నరుకుత్తం.. తొక్కి పడేస్తాం..
వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు.. రప్పారప్పా నరుకుతాం.. అంటూ వైసీపీ కార్యకర్తలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. జగన్ వస్తాడు అంతు చూస్తాడంటూ మరో బ్యానర్‌లో రాశారు. అన్న వస్తాడు.. అంతు చూస్తాడు.. ఎవడైనా రానీ.. తొక్కి పడేస్తాం.. ఇలా రెచ్చగొట్టే స్లోగన్స్‌లో ఫ్లెక్సీలు పట్టుకుని రచ్చ రచ్చ చేశారు వైసీపీ నాయకులు.
సైకోల ఫ్యాక్టరీ వైసీపీ
వైసీపీ ప్రదర్శించిన బ్యానర్లపై మంత్రి నారా లోకేశ్ ఫుల్ ఫైర్ అయ్యారు. వైసీపీ సైకోలను తయారు చేసే ఫ్యాక్టరీగా మరిందని మండిపడ్డారు. యథా అధినేత.. తథా నాయకులు, కార్యకర్తలు అంటూ తప్పుబట్టారు. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా వైసీపీ పద్దతి మారలేదని.. ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేయడం దారుణమని..ప్రజాపాలనలో ఇటువంటి చర్యలను ఉపేక్షించమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ట్వీట్ చేశారు నారా లోకేశ్.
యథా అధినేత.. తథా నాయకులు, కార్యకర్తలు. వైసిపి సైకోలను తయారు చేసే ఫ్యాక్టరీగా మారింది. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా వైసిపి పద్ధతి మారలేదు. ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరించడం దారుణం. ప్రజా పాలనలో ఇటువంటి చర్యలను ఉపేక్షించం.#PsychoFekuJagan pic.twitter.com/e3WQjsiw2a
— Lokesh Nara (@naralokesh) June 18, 2025
అంబటి బ్రదర్స్ రచ్చ రచ్చ..
అంతకుముందు.. సత్తెనపల్లిలో అంబటి బ్రదర్స్ రెచ్చిపోయారు. నడిరోడ్డుపై నానా రచ్చ చేశారు. జిల్లా సరిహద్దులో పోలీసులు పెట్టిన బారికేడ్లను అంబటి రాంబాబు తోసేశారు. ఆంక్షలకు విరుద్ధంగా.. పెద్ద సంఖ్యలో వస్తున్న వైసీపీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. బలవంతంగా వైసీపీ కార్యకర్తల వాహనాలను ముందుకు పంపించారు అంబటి రాంబాబు.
అందులో జగన్ దిట్ట..
మరోవైపు, వైసీపీ నేతల తీరుపై హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. జగన్ పర్యటనలో రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు పెట్టారని.. జగన్ సైకో అనడానికి ఈ పనులే నిదర్శనమన్నారు. నేరస్తుడు రాజకీయ ముసుగులో ఉంటే ఎలా ఉంటుందో చూస్తున్నామన్నారు. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని.. గతేడాడి ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావును ఇప్పుడు పరామర్శించడం ఏంటని ప్రశ్నించారు. శవ రాజకీయాలు చేయడంలో జగన్ దిట్ట అని మండిపడ్డారు అనిత. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని.. జగన్ లాంటి వ్యక్తులు సమాజంలో ఉండటానికి వీలు లేదన్నారు హోంమంత్రి.