CM Revanth Reddy: తమ ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బనకచర్లపై సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలతో సీఎం సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ చేపట్టబోయే పోలవరం- బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
‘మన రైతులకు కృష్ణా, గోదావరి జలాలే ముఖ్యం. రాజకీయాలకు అతీతంగా పార్టీలు దీనిపై పోరాడాలి. ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి ప్రాజెక్టును వ్యతిరేకిస్తాం. గతంలో కేసీఆర్, జగన్ కలిసి గోదావరి జలాలను రాయలసీమకు తరలిస్తామని చెప్పారు. అప్పుడే బనకచర్లకు అంకురార్పణ జరిగింది. రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలు ఎజెండాగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మనందరం కలిసి పనిచేయాలి. రాజకీయ లబ్ది కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశాం’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
READ ALSO: AP News : అది కనిపిస్తే కేసు!.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
తెలంగాణ ఏర్పడిన తరువాత కేంద్రప్రభుత్వం 2016 సెప్టెంబర్ నెలలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో మొట్టమొదట గోదావరిపై 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని ఆనాటి సీఎం కెసీఆర్ ప్రతిపాదన ఇచ్చారు. ఆ సమావేశంలో హరీష్ రావు కూడా పాల్గొన్నారు. మళ్లీ 2019 ఆగస్ట్ 13న రాయలసీమను రతనాల సీమ చేస్తామని ఆనాటి కేసీఆర్ ప్రకటించారు. గోదావరి జలాలలను రాయలసీమకు తరలించాలని కేసీఆర్, జగన్ ప్రగతి భవన్ లో నాలుగుసార్లు సమావేశమై నిర్ణయం తీసుకున్నారు’ అని సీఎం వ్యాఖ్యానించారు.
READ ALSO: Kavitha : బావతోనూ గొడవ? కవిత టైంపాస్ కహానీ..
ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ వివరాలను ఆనాటి మంత్రులు ఈటెల రాజేందర్ , బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు. ఈ మీటింగ్ మినిట్స్ ను రిఫరెన్స్ గా చూపి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు బనకచర్లను గుదిబండగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నాం. బనకచర్ల అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానితో సహా అందరి అపాయింట్మెంట్ తీసుకుని కలిసి తెలంగాణ సమస్యలను వివరిస్తాం. పొలిటికల్ ఫైట్ లో న్యాయం జరగకపోతే లీగల్ ఫైట్ చేద్దాం. ఈ విషయంలో మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
అయితే.. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు మాట్లాడుతున్నారని… ఇది ఏమాత్రం సరికాదని ఆరోపిస్తూ.. బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఈ మీడియా సమావేశం నుంచి వాకౌట్ చేశారు. పార్టీల మధ్య ఎన్ని విభేదాలున్నా అందరం కలిసి పోరాడలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.