Axis Bank Scam: నెల్లూరు యాక్సిస్ బ్యాంకు టీం స్కాం అరాచకాలకు బలైన బాధితులు.. ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. 2020 నుంచి ఈ బ్యాచ్ ఈ వ్యవహారం నడుపుతున్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లాలోనే కాకుండా చెన్నై, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం, బెంగుళూరు ప్రాంతాలలో స్కామ్ లింకున్నట్టు సమాచారం. దీంతో పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు. ఫేక్ కంపెనీలు పెట్టి మోసం చేసిన వ్యక్తులు కోసం గాలిస్తున్నారు. బ్యాంక్ అధికారుల నుంచి మరింత డేటా తీసుకుంటున్నారు. కూలీలు, పశువులు కాపర్ల, సెక్యూరిటీ గార్డులు, వాచ్‌మెన్లు, పనిచేసుకునే మహిళలను కూడా మాయగాళ్లు వదల్లేదు. ఊరిలో బతకలేక పొట్ట చేత పట్టుకుని నెల్లూరు వచ్చిన ఓ నిరుపేద కుటుంబాన్ని నిలువునా ముంచారు. ఇళ్లలో పని చేసుకుని జీవించే తనుజా అనే మహిళను సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా సృష్టించారు. ఆమె పేరుతో నాలుగు చోట్ల సుమారుగా కోటిన్నర రూపాయల రుణం తీసుకున్నారు.
మోసానికి బలైన తనుజా మహిళ
అప్పులు చేసి వడ్డీలు కడుతున్నానని తనూజ అనే మహిళ వాపోయింది. భర్త వదిలేసి ఇద్దరు బిడ్డలతో పాచి పని చేసుకుని జీవిస్తున్నానని కన్నీళ్లు పెట్టుకుంది.
స్కామ్ ఎలా సాగింది?
విషయంలోకి వెళితే, ఈ గ్యాంగ్ తమ మోసాన్ని అమలు చేసేందుకు.. ఫేక్ కంపెనీలు స్థాపించారు. వాస్తవానికి పనిచేసే వారే కాదు, వారితో ఎటువంటి సంబంధం లేని వారి పేర్లను కూడా వాడుతూ.. రుణాల కోసం ఫేక్ డాక్యుమెంట్లు రూపొందించారు. ఆధార్, పాన్, ఆదాయ ధ్రువపత్రాలు మొదలైనవి.. ఫోర్జరీ చేసి బ్యాంకుల్లో రుణాలు పొందారు.
చెన్నై – విజయవాడ – బెంగళూరు వరకు వ్యాపించిన స్కాం
ఈ స్కాం నెల్లూరుతో పాటు చెన్నై, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం, బెంగళూరు నగరాల వరకు విస్తరించిందని పోలీసుల అనుమానం. ఈ గ్యాంగ్ వివిధ నగరాల్లో మోసం చేసిన వ్యక్తుల సంఖ్య.. ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆ గ్యాంగ్ సభ్యుల కోసం గాలిస్తున్నారు. బ్యాంకుల నుంచి మరిన్ని డేటా తీసుకుంటున్నారు.
బాధితుల సంఖ్య పెరుగుతున్న వేళ
ఈ స్కాం బయటపడిన తరువాత ఒక్కొక్కరుగా.. బాధితులు ముందుకు వస్తున్నారు. చాలా మంది పేదలు, చదువు తక్కువగా ఉన్నవారు మోసానికి గురయ్యారు.
Also Read: వామ్మో.. పాము అక్కడికెలా ఎక్కిందో..? వైరల్ వీడియో
ఈ స్కాం మరోసారి నిరూపించిన విషయం.. పేదవారి అమాయకత్వాన్ని వాడుకుంటూ దోచుకుంటున్న మాయగాళ్లపై కఠిన చర్యలు అవసరం. రక్షణగా వ్యవహరించాల్సిన బ్యాంకింగ్ వ్యవస్థే.. ఇలాంటి మోసాలకు సహకరిస్తే, పేదవాడి జీవితం నరకంగా మారడం తప్పదు. బాధితులపై ఒత్తిడి కాకుండా, అసలైన నిందితులను గుర్తించి శిక్షించాల్సిన బాధ్యత అధికారులదే.