అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని జగన్ ని, వైసీపీ ఇతర ఎమ్మెల్యేలను సభనుంచి సస్పెండ్ చేస్తారా? చేయగలరా? దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతున్న సమయంలో జగన్ తనదైన లాజిక్ తో ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి సమావేశాలకు హాజరవుతున్నాం కాబట్టి మనల్ని సభనుంచి సస్పెండ్ చేయలేరని ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు. వైసీపీ శాసన సభాపక్ష సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి సమావేశాలకు, అది కూడా గవర్నర్ హాజరయ్యే సమావేశాలకు మనం వెళ్తున్నాం కదా, ఇక సస్పెన్షన్ మాటెక్కడిదని ఆయన శాసన సభ్యులతో మాట్లాడినట్టు తెలుస్తోంది. తాము అసెంబ్లీకి హాజరయ్యామనడానికి గవర్నరే సాక్షి అని కూడా చెప్పినట్టు టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు వచ్చాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం
తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ సమావేశం pic.twitter.com/eVcAoyHZE3
— YSR Congress Party (@YSRCParty) September 18, 2025
మీకిదే అవకాశం..
జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలెవరూ అసెంబ్లీవైపు చూడకపోయినా, ఆ పార్టీ ఎమ్మెల్సీలు మాత్రం మండలిలో తమ వాణి వినిపిస్తున్నారు. కౌన్సిల్ లో మనకు మంచి బలం ఉంది కాబట్టి అధికార పార్టీని నిలదీయాలంటూ ఎమ్మెల్సీలకు ఉద్భోదించారు జగన్. ఇక రాజకీయంగా ఎదగడానికి ఎమ్మెల్సీలకు ఇది మంచి అవకాశం అని కూడా చెప్పారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శాసన మండలిలో ఏయే అంశాలపై మాట్లాడాలనే విషయాలను కూడా ఈ సమావేశంలో డిక్టేట్ చేశారు జగన్. ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేస్తున్నా తాను మాత్రం అసెంబ్లీకి రానని తేల్చి చెప్పారాయన. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇతర ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తారా..? అని కూడా జగన్ ఈ సమావేశంలో అడిగినట్టు తెలుస్తోంది. వారు సభకు వెళ్తే తనకు అభ్యంతరం ఏమీ లేదని అన్నారట జగన్. దానికి వైసీపీ ఎమ్మెల్యేలెవరూ అంగీకారం తెలపలేదని అంటున్నారు. జగన్ లేకపోతే తాము కూడా అసెంబ్లీకి వెళ్లేది లేదని తేల్చి చెప్పారట.
అదిగదిగో..
కూటమి అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాదిన్నర కూడా పూర్తి కాలేదు. ఆ మధ్య జమిలి ఎన్నికలంటూ వైసీపీ బ్యాచ్ హంగామా చేసింది. అదిగో ఎన్నికలు, గెలిచేది మనమేనంటూ వైసీపీ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు జమిలి జపం చేయడంలేదు కానీ ఎన్నికలు వచ్చేస్తున్నాయంటూ జగన్ చెప్పడం విశేషం. కళ్లు మూసి తెరిస్తే ఎన్నికలొచ్చేస్తాయని అన్నారు జగన్. చూస్తుండగానే ఏడాదిన్నర గడిచిపోయిందని, మిగిలింది మరో రెండున్నర ఏళ్లు మాత్రమేనని చెప్పుకొచ్చారు. మరో అసెంబ్లీ సెషన్ తర్వాత.. చూస్తుండగానే మరో ఏడాది గడుస్తుందని ఆ తర్వాత ఎన్నికలు, అధికార మార్పిడి ఖాయమని అన్నారు జగన్.
నాడు అలా చేసిఉంటే..
2019 ఎన్నికల తర్వాత వారం రోజుల వ్యవధిలోనే టీడీపీ నుంచి ఐదుగురు తమవైపు వచ్చారని గుర్తు చేశారు జగన్. అదే సమయంలో మరికొందర్ని ఇటువైపు లాక్కొని చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని పార్టీ నేతలు తనకు సలహా ఇచ్చారని కానీ తాను ఒప్పుకోలేదన్నారు. విపక్షం గొంతు వినాల్సిన అవసరం ఉందని చెప్పానన్నారు. అయితే ఆనాడు వైసీపీ వీలైనంతమందికి గేలం వేసింది, ఇంకెవరూ దొరక్కపోవడంతో సైలెంట్ గా ఉంది. అవకాశం ఉండి ఉంటే చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసి ఉండేవారేమో. ఇప్పుడు జనమే జగన్ కి ప్రతిపక్ష హోదా లేకుండా చేయడంతో ఆయనకు ఏం చేయాలో తోచడం లేదని విశ్లేషకులంటున్నారు. అటు కూటమి నేతలు కూడా ప్రతిపక్ష హోదాపై సెటైర్లు పేలుస్తున్నారు. ప్రతిపక్ష హోదా అనేది ప్రభుత్వం ఇచ్చేది కాదని, ప్రజలే జగన్ కి గుణపాఠం చెప్పారని అంటున్నారు.