Amaravati News: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎవరు.. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. మంత్రి పదవి రాలేదని కొన్నాళ్లుగా కాంగ్రెస్ అధిష్టానంపై కారాలు మిరియాలు నూరుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. తాజాగా ఆయన ఏపీ మాజీ సీఎం జగన్‌తో భేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ మాటరేంటి?
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మళ్లీ వార్తల్లోకి వచ్చారు. మంత్రి పదవి ఇవ్వనందుకు కాంగ్రెస్ హైకమాండ్‌పై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా పార్టీపై రుసరుసలాడుతున్నారు. ఈ మధ్యకాలంలో రెండు లేదా మూడు రోజుల కొకసారి ఆయన ఏదో విధంగా వార్తల్లోకి వస్తున్నారు.
అసలు విషయం ఏంటో తెలీదు. కాకపోతే ఏపీ రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతరాత్రి ఆయన తాడేపల్లిలో బస చేసినట్టు తెలుస్తోంది. ఏపీ మాజీ సీఎం జగన్‌తో భేటీ కావడానికి ఆయన వచ్చినట్టు తెలుస్తోంది.
కారణం ఏంటన్నది పక్కనబెడితే.. ఉదయం 11 గంటలకు బెంగళూరు వెళ్లనున్నారు జగన్. ఈలోపు ఆయనతో భేటీ కావాలని నిర్ణయించినట్టు సమాచారం. అంతకుముందు దుర్గమ్మ గుడిలో అమ్మవారిని దర్శనం చేసుకోనున్నారు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి. ఉన్నట్లుండి ఆయన తాడేపల్లిలో మకాం వేయడానికి కారణమేంటి? అన్నదే తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
ALSO READ: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
ఏపీలో పెద్దగా పట్టించుకోలేకపోయినా, తెలంగాణలో రాజగోపాల్‌రెడ్డి గురించి చర్చ జరుగుతోంది. కోమటిరెడ్డి బ్రదర్స్‌ని రాజకీయాల్లోకి తెచ్చింది వైఎస్ఆర్ అని వీలు చిక్కినప్పుడల్లా వాళ్లు చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే వైఎస్ పేరు కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రస్తావిస్తూనే ఉంటారు. ఆ అభిమానంతో జగన్‌తో భేటీ అయ్యేందుకు వచ్చారని అంటున్నారు.
మంత్రి పదవి రానుందకు ఆగ్రహంగా ఉన్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, ప్రస్తుతానికి పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఏపీలో జరిగే ఓ ప్రైవేటు కార్యక్రమానికి రాజగోపాల్ విజయవాడ వచ్చినట్టు చెబుతున్నారు. జగన్‌ని కలవడం కాదని అన్నారాయన. మొత్తానికి రానున్న రోజుల్లో జగన్-రాజగోపాల్ గురించి ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.