Karimnagar: కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పట్టణంలోని స్వామి వివేకానంద హైస్కూల్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఉపాధ్యాయుడి వేధింపులు, తీవ్రమైన దాడి భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాఠశాలకు చెందిన విద్యార్థులు రామ్ చరణ్, చరణ్‌లపై ఉపాధ్యాయుడు చేయి చేసుకోవడం, తీవ్రంగా కొట్టడంతో మనస్తాపం చెంది, పాఠశాల బయట గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అప్రమత్తమైన స్థానికులు విద్యార్థులను చికిత్స నిమిత్తం జమ్మికుంటలోని సంజీవిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్కూల్ వద్దకు చేరుకుని నిరసన చేశారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోస్కుల అజయ్ మాట్లాడుతూ, విద్యార్థులపై ఉపాధ్యాయులు ఇంత దారుణంగా వ్యవహరించడం అమానుషమని, దీని కారణంగా విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించడం విచారకరమని అన్నారు.
విద్యార్థుల ఆత్మహత్యాయత్నానికి కారణమైన సంబంధిత ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలనీ, పాఠశాల పరిపాలనా లోపాలకు బాధ్యులైన వారిపై, ముఖ్యంగా మండల విద్యాధికారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు పాయిజన్ విక్రయించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేయాలన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు తమ పోరాటం ఆగదని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడంతో పాటు, పాఠశాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటన ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల వ్యవహరించాల్సిన తీరుపై మరోసారి చర్చకు దారితీసింది.