Hydra Demolitions: మేడ్చల్-తూంకుంట పరిధిలో.. భారీ స్థాయిలో అక్రమ నిర్మాణాలపై అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. హైడ్రా బృందం మంగళవారం ఉదయం ఆక్రమణలను కూల్చివేసింది. ఇటీవల కొంతమంది వ్యక్తులు దేవరయాంజల్ సరస్సు పరిసరాల్లో నాలాపై ప్రహరీ గోడలు, సిమెంట్ కట్టడాలు నిర్మిస్తున్నారనే ఫిర్యాదులు హైడ్రా అధికారులకు అందాయి. స్థానికుల పిర్యాదు మేరకు తక్షణమే ప్రత్యేక బృందం ప్రాంతానికి చేరుకుని సర్వే నిర్వహించింది.
సర్వేలో ఆ స్థలాలు ప్రభుత్వ భూముల పరిధిలోకి వస్తున్నట్లు నిర్ధారణ కావడంతో.. అధికారులు యంత్రాలతో కూల్చివేతలను చేపట్టారు. ఉదయం నుంచే JCB యంత్రాలను రంగంలోకి దింపి, నిర్మాణాల తొలగింపు చర్యలు చేపట్టారు. ప్రహరీ గోడలు, గేట్లు, కాంక్రీట్ నిర్మాణాలు, సైన్ బోర్డులు అన్నీ పూర్తిగా కూల్చివేశారు.
హైడ్రా అధికారుల మాట్లాడుతూ.. ఈ కూల్చివేత చర్యలు ఒక్కరోజు వ్యవహారం కాదని, మరికొన్ని సర్వేలు పూర్తయిన తర్వాత సమీప గ్రామాల్లో కూడా ఇలాంటి చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. దేవరయాంజల్ సరస్సు పరిధి మొత్తం పర్యావరణ రక్షిత మండలంగా గుర్తించబడిందని, ఇక్కడ ఏ రకమైన శాశ్వత నిర్మాణాలు చేయడం చట్ట విరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు.
కొంతమంది వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి, ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములుగా చూపించి అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 20 ఎకరాలకు పైగా భూమిపై ఇలాంటి అక్రమ చర్యలు గుర్తించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో పాల్గొన్న వారిపై ఫిర్యాదులు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నట్లు హైడ్రా వర్గాలు వెల్లడించాయి.
Also Read: హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్
ప్రస్తుతం కూల్చివేతలతో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ భూములు, సరస్సుల పరిధిలో ఎటువంటి కొనుగోలు గానీ, నిర్మాణ కార్యకలాపాలు చేపట్టరాదని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.