Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతోందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం (నవంబర్ 4, 2025), జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహ్మత్ నగర్ డివిజన్, పీజేఆర్ టెంపుల్ వద్ద కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల మేలు కోరే కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేసి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఈ ప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి, బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “రెండేళ్లలో కేసీఆర్ వస్తారన్న కేటీఆర్ మాటలు అర్థరహితం,” అని ఆయన కొట్టిపారేశారు. “ముందు ఫాం హౌస్ నుండే ఆయన బయటకు వస్తలేడు… అలాంటిది తిరిగి అధికారంలోకి ఎలా వస్తాడు?” అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి ఐదేళ్లు పాలిస్తుందని, ఆ తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు, బుద్ధిజీవులు, మేధావులు ఆలోచన చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుందని అన్నారు.
Fee Reimbursement: ఫీజు రియింబర్స్‌మెంట్ విధానంపై రేవంత్ సర్కాట్ కమిటీ ఏర్పాటు
గత బీఆర్ఎస్ పాలనపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. “బీఆర్ఎస్ వాళ్లు కేవలం తమ కమీషన్ల కోసం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు,” అని ఆయన ఆరోపించారు. “కేవలం కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారు, చివరికి అది కూలిపోయే పరిస్థితికి తెచ్చారు. వారి అవినీతి వల్లే కాళేశ్వరం కూలిపోయింది,” అని మండిపడ్డారు. కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధలో కొంచెమైనా ఎస్‌ఎల్‌బిసి (SLBC) వంటి ఇతర ప్రాజెక్టులపై పెట్టలేదని, వాటిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. పేదల సంక్షేమం కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీనే ప్రజలు ఆదరిస్తారని ఆయన అన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం గురించి మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ, “ఈ నియోజకవర్గం పేరుకే జూబ్లీహిల్స్ కానీ, ఇక్కడ ఎక్కువగా పేద ప్రజలే నివసిస్తున్నారు. వారందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది.” అని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో మంత్రి వెంట ఎమ్మెల్యేలు బాలు నాయక్, వేముల వీరేశం, పలువురు స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.