Perni Nani: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, మత్తు వైద్యుడిపై వైకాపా నేత, మాజీ మంత్రి పేర్ని నాని రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశారు. శనివారం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైద్యపరీక్షల కోసం తీసుకొచ్చారు. ఆ సమయంలో పేర్ని నాని తమ అనుచరులతో కలిసి ఆసుపత్రి వద్ద వీరంగం సృష్టించారు. మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినాని కుటుంబం ఇరుక్కుని ఉంది. ఇప్పటికే తనను దమ్ముంటే అరెస్టు చేసుకోమని పేర్ని నాని సవాల్ విసిరారు. తన వెంట్రుక కూడా పీకలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా తిరిగి హాస్పటల్ వద్ద సుపరింటెండెంట్‌తో పాటు చంద్రబాబు, లోకేష్‌లను టార్గెట్ చేస్తూ నోరు పారేసుకున్నారు. నానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ వైద్యుల సంఘం సిద్దమవుతుండటంతో ఆయన మరో కేసులో ఇరుక్కోవడం ఖాయం అంటున్నారు.
ఫిబ్రవరిలో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ
గత ప్రభుత్వహయాంలో ఇష్టానుసారంగా ప్రవర్తించటమే కాకుండా.. నోటికి వచ్చినట్లు దుర్భాషలాడిన వారంతా.. ఇప్పుడు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో ఫిబ్రవరిలో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. బెయిల్ కోసం తీవ్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే ఒకదాని తర్వాత ఒకటి వరుసగా కేసులు నమోదవుతుండటంతో వంశీ విజయవాడ జిల్లా జైల్లోనే మగ్గుతున్నారు. మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన భార్యపై ఆరోపణలు ఉన్నాయి. మాజీమంత్రికి చెందిన గోదాం నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో ముగ్గురు నిందితులపై కేసు నమోదైంది. ఈ కేసులో ఏ-1గా గోదాం యజమాని, పేర్ని నాని భార్య జయసుధ ఉన్నారు. పేర్ని నాని సూచనలతోనే బియ్యం విక్రయించామని.. విచారించిన సమయంలో నిందితులు చెప్పటంతో ఆ కేసు.. మాజీమంత్రి మెడకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. దానికి తోడు గతంలోనూ.. ఆయన తెలుగుదేశం, జనసేన అధినేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేశారు.
వైసీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపణలు
ఫిబ్రవరిలో వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు విజయవాడ జైలుకెళ్లి ఆయన్ని పరామర్శించిన పేర్ని నాని అప్పుడు కూడా ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లను పోలీసులు ట్యాప్ చేస్తున్నారని మాజీ మంత్రి అప్పట్లో ఆరోపించారు. తాను ట్యాపింగ్‌లకు భయపడబోన్న మాజీమంత్రి… దమ్ముంటే అరెస్టు చేసుకో అంటూ సవాల్ విసిరారు. నా వెంట్రుక కూడా పీకలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అప్పట్లోనే ఆయన అరెస్టుపై ఊహాగానాలు చెలరేగాయి. అయితే ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోకపోవడంతో వచ్చిన ధీమానో? ఏమో మళ్లీ పేర్ని నాని తాజాగా విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చెలరేగిపోయారు.
ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు
అనారోగ్యానికి గురైన వల్లభనేని వంశీని చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు ఆయన్న పరామర్శించడానికి పేర్ని నాని, వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ తమ అనుచరులతో అక్కడకి వచ్చారు. అయితే కస్టోడియల్ విచారణలో ఉన్న వంశీని కలవడానికి అధికారులు అనుమతించలేదు. ఆస్పత్రి వైద్యులు కూడా వంశీ ఆరోగ్యం కుదుటపడిందని ఇన్‌పేషెంట్‌గా చేర్చుకోవాల్సిన అవసరం లేదని తిరిగి కస్టడీకి అప్పజెప్పారు. దాంతో పేర్ని నాని గవర్నమెంట్ హస్పటల్ సుపరిండెంట్‌పై ఒక రేంజ్లో చెలరేగిపోయారు. సూపరింటెండెంట్‌గా ఉన్న ఎనస్థీషియా డాక్టర్ ఎ.వి.రావుపై రెచ్చిపోయి విమర్శలు గుప్పించారు. ఈ మత్తోడు.. ఆసుపత్రిలో ఉద్యోగానికి వచ్చినప్పటి నుంచి బెజవాడలోనే ఉంటున్నాడంట. అంటే ఎంతమందికి చెంచాగిరీ చేస్తే.. ఇన్నాళ్లూ ఇక్కడున్నాడో. చంద్రబాబు, లోకేశ్‌కు అతడు చెంచాగిరీ చేస్తున్నాడు. ఈ మత్తోడు ఇంతకింతా అనుభవించే రోజు వచ్చి తీరుతుందని చెలరేగిపోయారు.
తాజాగా విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చెలరేగిపోయిన నాని
ఆ సమయంలో పేర్ని నాని, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ తదితరులు తమ అనుచరులతో కలిసి ఆసుపత్రి వద్ద వీరంగం సృష్టించారు. లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని ఆసుపత్రి భద్రతా సిబ్బంది అడ్డుకున్నా.. వారిని నెట్టుకుంటూ ముందుకెళ్లారు. దీంతో భద్రతా సిబ్బంది, పోలీసులు కలిసి అడ్డుకోగా.. వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బెదిరింపులకు దిగారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితుడిని కలవడానికి వీల్లేదని పోలీసులు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవాలని వెనక్కి పంపించేశారు. ఈ సమయంలోనే అక్కడ విధుల్లో ఉన్న వైద్యసిబ్బందితో వైసీపీ నేతలు మాట్లాడి.. వంశీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, ఆసుపత్రిలో చేర్చుకోవాలని పట్టుబట్టారు. వైద్య పరీక్షలన్నీ నిర్వహించగా వంశీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పడంతో వారిపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బయటకొచ్చిన పేర్ని నాని.. వల్లభనేని వంశీని ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్‌గా చేర్చడం లేదనే అక్కసుతో ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై తీవ్ర పదజాలంతో పై విధంగా దూషణలకు దిగారు.
చట్టపరంగా చర్యలకు సిద్ధమవుతున్న ప్రభుత్వ వైద్యుల సంఘం
విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్, వైద్యులపై మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఖండించారు. రోగులకు సేవలు అందించేవారి మనోభావాలు దెబ్బతినేలా పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని… వాటిని ఆయన ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకుంటే చట్టపరంగా స్పందిస్తామని ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు జయధీర్ హెచ్చరించారు. ఈ ఇష్యూపై ప్రభుత్వ వైద్యులంతా ఏకమవుతుండటంతో పేర్ని నానిపై మరో కేసు నమోదవ్వడం ఖాయంగా కనిపిస్తోందంటున్నారు.