ఏపీలో తుఫాన్ రాజకీయం మొదలైంది. ఓవైపు సీఎం చంద్రబాబు రెండ్రోజుల నుంచి ఇంటికి వెళ్లకుండా సచివాలయంలోనే మకాం వేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు తుఫాన్ సహాయక చర్యలు నిల్, ప్రభుత్వం ఫెయిల్ అంటోంది వైసీపీ. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఫేక్ ఫెలోస్ అంటూ ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. దీనికి కూడా వైసీపీ కౌంటర్ రెడీ చేసుకుంది.
రంగంలోకి టీడీపీ నేతలు..
మొంథా తుఫాన్ విషయంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న విషయం తెలిసిందే. తుఫాన్ కి రెండు రోజుల ముందు నుంచీ ప్రజల్ని అప్రమత్తం చేసింది. ఎక్కడికక్కడ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి, ఆర్టీజీ సెంటర్ నుంచి సీఎం చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహించారు. అటు స్థానిక నేతలు, కార్యకర్తల్ని నేరుగా రంగంలోకి దింపారు. అధికారులతోపాటు ఈసారి టీడీపీ నేతలు కూడా ప్రజల్లోకి వెళ్లి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించారు.
ముంథా తుఫాన్ ప్రభావ నేపథ్యంలో నరసాపురం సముద్రతీర ప్రాంతాలైన బియ్యపు తిప్ప, పెద్ద మైనవానిలంక, చిన్న మైనవానిలంక వంటి గ్రామాలన్నింటిని అర్ధరాత్రి స్థానిక శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ రామరాజు గారితో కలిసి పునరావాస కేంద్రాలను సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించి, ప్రజల యోగక్షేమాలను అడిగి… pic.twitter.com/pDistgEKsT
— Telugu Desam Party (@JaiTDP) October 29, 2025
చంద్రబాబు ఆగ్రహం..
ఏపీ ప్రజల అదృష్టం బాగుండి తుఫాన్ వల్ల పెద్ద నష్టం జరగలేదు. అయితే ఈసారి ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని పూర్తిగా తగ్గించలిగామని చెప్పుకుంటోంది ప్రభుత్వం. కానీ పంట నష్టం మాత్రం తప్పలేదు. తుఫాన్ తీరం దాటిన తర్వాత సీఎం చంద్రబాబు జనంలోకి వచ్చారు. రైతుల్ని పరామర్శించారు, వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పునరావాస కేంద్రాలకు వెళ్లారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లవరం మండలం, ఓడలరేవులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ బాధితులను పరామర్శించారు. పునరావాస కేంద్రాల్లోని నిర్వాసిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, 25 కేజీల బియ్యం, ఒక్కో కుటుంబానికి రూ.3000 చొప్పున సాయం అందించారు. అనంతరం అరగట్లపాలెం,… pic.twitter.com/lKeI4JZOKJ
— Telugu Desam Party (@JaiTDP) October 29, 2025
ఈ క్రమంలో వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన వద్ద ప్రస్తావించగా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. “పీపుల్ ఆర్ హ్యాపీ, దీస్ ఫేక్ ఫెలోస్ ఆర్ నాట్ హ్యాపీ” అని మండిపడ్డారు.
రోడ్డునపడ్డాం ఆదుకోండి అంటే.. తుఫాన్ బాధితుల్ని ఫేక్ ఫెలోస్ అంటావా @ncbn ?
మోంథా తుఫాన్ సహాయ చర్యల్లో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలం
పునరావాస కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించని ప్రభుత్వం. దాంతో అర్ధాకలితోనే తుఫాన్ బాధితులు నిరీక్షణ
లక్షలాది… pic.twitter.com/WjoBv62sAM
— YSR Congress Party (@YSRCParty) October 29, 2025
వైసీపీ విమర్శలు..
మొంథా తుఫాన్ విషయంలో వైసీపీ ఆచితూచి విమర్శలు మొదలు పెట్టింది. సీఎం, డిప్యూటీ సీఎం అడ్రస్ లేరని మొదట్లో సాక్షిలో వార్తలొచ్చాయి. ఆ తర్వాత నేతలంతా సమీక్షలకే పరిమితం అయ్యారని, క్షేత్ర స్థాయిలో ఎవరూ లేరని విమర్శలు చేశారు. తీరా ఇప్పుడు అధికారులు బాగా పనిచేశారని, నాయకులు మాత్రం ప్రమోషన్లు, ఎలివేషన్లు అంటూ కెమెరాల ముందుకొచ్చారని అంటున్నారు. తుఫాన్ వల్ల ప్రాణ నష్టం జరక్కుండా చూశామని ప్రభుత్వం చెబుతుంటే, ప్రతిపక్ష వైసీపీ విమర్శలకు కారణాలు పోగు చేసుకుంటోందని టీడీపీ నేతలంటున్నారు.
మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే పర్యటన
మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అబ్బాభట్లపల్లి అరుంధతి వాడా,ముళ్ళపూడి ఎస్టి కాలనీ,పోలి ఎస్టి కాలనీలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పర్యటించి… pic.twitter.com/o56hGptZlk
— YSR Congress Party (@YSRCParty) October 29, 2025
తుఫాన్ రాజకీయం..
తుఫాన్ తీరం దాటిన తర్వాత ఏపీలో రాజకీయ తుఫాన్ అలజడి రేపుతోంది. తుఫాన్ విషయంలో ఇటూ కూటమి, అటు వైసీపీ నేతలు సోషల్ మీడియాలో విమర్శలతో విరుచుకుపడుతున్నారు. బాధితులు కూడా పార్టీల పరంగా విడిపోయారనే విషయం అర్థమవుతోంది. ప్రభుత్వ సేవలు అద్భుతం అని కొనియాడేవారి వీడియోలు సోషల్ మీడియాలో కనపడుతున్నాయి.
తుఫాను ప్రభావం నుంచి తమని రక్షించి, పునరావాస కేంద్రాల్లో సకల సౌకర్యాలతో మంచిగా చూసుకున్న ప్రభుత్వానికి, ప్రజల ఆశీస్సులు.. #APpreparesForMontha #CycloneMontha #AndhraPradesh pic.twitter.com/La7rc3lavz
— Telugu Desam Party (@JaiTDP) October 29, 2025
అదే సమయంలో తమను నాయకులు పట్టించుకోలేదనే వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. మొత్తమ్మీద ఈసారి తుఫాన్ కాస్త ప్రశాంతంగానే తీరం దాటిందని తెలుస్తోంది. ప్రాణ నష్టాన్ని ప్రభుత్వం పూర్తిగా నివారించినట్టు తెలుస్తోంది. పంట నష్టం మినహా, మిగతా ఆస్తి నష్టాన్ని కూడా కనిష్టానికి పరిమితం చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది.
Also Read: కూలిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఇల్లు, అరిష్టం తప్పదా?