Srikakulam: వయసై పోతున్న రాజకీయ దిగ్గజాలు తమ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడానికి కుమారులుపై ఆశలు పెట్టుకుంటున్నారు. తమ స్థానాల్లో కొడుకులను నిలబెట్టడానికి పావులు కదుపుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి చెందినమాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ఆయన తమ్ముడు ధర్మాన కృష్ణదాస్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారం అదే పనిలో పడ్డారంట. గత ఎన్నికల్లోనే వారు తమ స్థానాల్లో వారసుల్ని ప్రమోట్ చేసుకోవాలని భావించినప్పటికీ పార్టీ అధ్యక్షుడు జగన్ అంగీకరించలేదంట. మరి వచ్చే ఎన్నికల నాటికైనా వారి స్కెచ్‌లు ఫలిస్తాయా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చైతన్యం గత జిల్లాల్లో మొదటి వరుసలో ఉండేది శ్రీకాకుళం. అందుకే.. అధికారంలో ఎవరున్నా పదవుల విషయంలో శ్రీకాకుళానికి పెద్దపీట వేస్తారు. అలాంటి సిక్కోలు వైసీపీలో ఇప్పుడు సీనియర్లు వారి వారసుల భవిష్యత్తు కోసం కలవర పడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడే నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంటుందని పెద్దలు చెప్పే మాట. ధర్మాన సోదరులు, తమ్మినేని సీతారం ఇప్పుడు అదే మాటను ఫాలో అవుతూ వారసులను నాయకులుగా తయారు చేసే పనిలో పడ్డారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ధర్మాన ప్రసాదరావు రాజకీయానికి ప్రత్యేక శైలి ఉండేది. అప్పట్లో కాంగ్రెస్ లో, గత ఐదేళ్లు వైసీపీలో ఆయన తనదైన మార్క్ చూపించారు. ధర్మాన ప్రసాదరావుకి పదవి ఉన్నపుడు, ఆయన మాట్లాడినపుడే కాదు.. సార్ సైలంట్ గా ఉన్నపుడు కూడా తన చుట్టూ ఓ చర్చ నడిచేలా చేసుకునే చాణక్య నీతి ఆయన ప్రత్యేకం.. కానీ తన కుమారుడు రామ్ మనోహర్‌నాయుడి భవిష్యత్వుత విషయంలో ధర్మాన ప్రసాదరావు కాస్త కలవరపడుతున్నట్టు తెలుస్తోంది. ఆయనకు ఏడు పదుల వయసు దాటినా.. కుమారుడు మాత్రం సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకోలేకపోయాడు. ఇంకా తండ్రి చాటు బిడ్డగానే ఉన్నాడు. 2029 నాటికి కొడుకుని ప్రజా నాయకుడిగా తయారు చేయాలని భావిస్తున్నారు ధర్మాన. అందుకే.. ఆయన చేయాల్సిన కార్యక్రమాలు కూడా రామమనోహరనాయుడితోనే చేయిస్తున్నారు.
ధర్మాన ప్రసాదరావు దారిలోనే ఆయన తమ్ముడు ధర్మాన కృష్ణదాస్ కూడా నడుస్తున్నారు. గత ఎన్నికల్లోనే తన కొడుకుని నరసన్న పేట నుంచి పోటీ చేయించాలనున్నారాయన. కానీ వైసీపీ అధ్యక్షుడు ఒత్తిడితో ఆయనే పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ క్రమంలో ఆయన వచ్చే ఎన్నికల నాటికి కుమారుడు కృష్ణచైతన్యను రెడీ చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు ఉన్నా.. లేకున్నా.. కృష్ణచైతన్య ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు. ఈ విధంగా అధినేత జగన్ దృష్టిలో పడాలని భావిస్తున్నారు.
నిజానికి గత ఎన్నికల్లోనే కృష్ణ చైతన్య పొలిటికల్ ఎంట్రీ గ్రాండ్ గా ఉంటుందని ధర్మాన అభిమానులు భావించారు. కృష్ణదాస్ కూడా ఇదే ప్రపోజల్ జగన్ ముందు పెట్టారు. అయితే.. నరసన్నపేటలో కొత్త ఫేస్‌తో ఎన్నికలకు వెళ్లడానికి వైసీపీ అధ్యక్షుడు జగన్ సాహసం చేయలేదు. ఈ సారి మీరే పోటీ చేయండి.. 2029లో చైతన్య గురించి ఆలోచిద్దామని జగన్ చెప్పడంతో కృష్ణదాస్ ఒప్పుకోవాల్సి వచ్చిందని టాక్. ఎలాగు అధినేత దృష్టిలో ఉన్నాం కనుక దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలని ఇప్పుడు అనుకుంటున్నారు కృష్ణదాస్.
జగన్ కూడా తన టీంతో నరసన్నపేట నియోజకవర్గంపై ఓ సర్వే చేయనున్నారని తెలుస్తోంది. కృష్ణచైతన్యకు నియోజవర్గంలో ఫాలోయింగ్ ఉందా? ఎన్నికల్లో పోటీ చేసి నిలబడగలరా? క్యాడర్ ను కలుపుకొని వెళ్లగలరా అనే అంశాలపై కార్యకర్తలు, ప్రజల నుంచి రాబోయే రియాక్షన్ బట్టి టికెట్ జూనియర్ ధర్మానకు ఇవ్వాలా వద్దా అని వైసీపీ అధ్యక్షుడు నిర్ణయిస్తారట. ఒకవేళ కొడుకుకు నెగటివ్ గా ప్రజాభిప్రాయం ఉంటే మరోసారి తండ్రికే టికెట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా నరసన్నపేట టికెట్ మాత్రం ధర్మాన ఫ్యామిలీలోనే ఉంటుందంటున్నారు. కానీ, తాను బలంగా ఉన్నపుడే కొడుకు భవిష్యత్ ఫిక్స్ చేయాలని కృష్ణదాస్ ఆరాట పడుతున్నారంట.
జగన్ టీం సర్వే చేసే నాటికి కొడుకు పేరు నియోజకవర్గంలో అలవాటు అయిపోవాలని ప్లాన్ వేశారు సీనియర్ ధర్మాన. అందుకే కార్యకర్తలతో కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్న చైతన్య ఈ 40 రోజులు ఫ్యామిలీకి దూరంగా కార్యకర్తలకు దగ్గరగా ఉండాలని నిర్ణయించారట. మరి ఇంతగా ఆరాటపడుతున్న కృష్ణదాస్ శ్రమ ఫలిస్తుందో? లేదో? కృష్ణచైతన్య పాలిటికల్‌గా ఏ మాత్రం సక్సెస్ అవుతారో చూడాలి?
జిల్లాలోని మరో సీనియర్ నేత తమ్మినేని సీతారాం కూడా కొడుకుని తయారు చేయడానికి చేయని ప్రయత్నం లేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన కూడా ఆసక్తి చూపించడం లేదు. తమ్మినేనికి ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరించడం లేదు. దీంతో ఆయన లెగసీని వారసుడు కంటిన్యూ చేస్తాడా లేదా అని తమ్మినేని కలవరపడుతున్నారని సొంత కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. అధిష్టానం పిలుపు మేరకు చేపడుతున్న అన్ని కార్యక్రమాలను ఆముదాలవలస నియోజవర్గంలో కొడుకుతోనే నడిపిస్తున్నారు సీనియర్ తమ్మినేని. మరి సీనియర్ల ఆశలను వారసులు నిలబెడతారా లేదా చూడాలి.
Story by Vamshi, Big TV