Veera Brahmendra Swamy: వైఎసార్ఆర్ కడప జిల్లాలోని 400 ఏళ్ల చరిత్ర కలిగిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివాసం కూలిపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతటి చారిత్రక ప్రాముఖ్యత కలిగిన బ్రహ్మంగారి నివాస గృహాన్ని కాపాడాల్సిన అధికారులు, ఆ విషయంలో అలసత్వం వహించారని భక్తులు మండిపడుతున్నారు. శిథిలావస్థలో ఉన్నప్పుడు మరమ్మతులు చేయించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు.
తాజాగా ఈ ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. వీరబ్రహ్మేంద్రస్వామి నివాసం కూలిన ఘటనపై వెంటనే చర్యలు చేపట్టాలని కడప కలెక్టర్‌ను అదేశించారు. ‘‘శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి గారి పూర్వీకుల ఇంటిని పునరుద్ధరించడానికి, మన సాంస్కృతిక వారసత్వంలోని ఈ విలువైన భాగాన్ని కాపాడటానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను అభ్యర్థిస్తున్నాను’’ అని ట్వీట్ లో లోకేష్ పేర్కొన్నారు.
Read Also: కూలిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 400 ఏళ్ల నాటి ఇల్లు, అరిష్టం తప్పదా?
ప్రపంచవాప్తంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పేరు తెలియని వారుండరు. 400 ఏళ్ల క్రితమే రాబోయే భవిష్యత్తులో తలెత్తే మార్పులు, విపత్తులు, వింతల గురించి తన కాలజ్ఞానం పుస్తక రచనలో వెల్లడించారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన అనేక సంఘటనలు అనంతర కాలంలో నిజమవుతూ రావడంతో ఆయన కాలజ్ఞానం ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతటి మహోన్నతమైన వ్యక్తి నివసించిన ఇల్లు, ఇప్పుడు మొంథా వర్షాల దాటికి కుప్పకూలటం భక్తులలో తీవ్ర ఆవేదనను రేపుతోంది.
మంత్రి లోకేష్ ట్వీట్‌తో జిల్లా కలెక్టర్ స్పందన ఎలా ఉండబోతుంది? ప్రభుత్వం ఈ వారసత్వ సంపదను కాపాడుకోవడానికి నిధులు కేటాయిస్తుందా?.. లేదా ట్వీట్‌కే పరిమితం అవుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీరబ్రహ్మంగారి మఠం అభివృద్ధి చేస్తున్నామని అధికారులు గొప్పలు చెప్పడం కాదని ఇకనైనా బ్రహ్మంగారి మఠంపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.