Rajanagaram Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఊహించని రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకు నియోజకవర్గ ఓటర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. సీతానగరం జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార కూటమి బలంతో బరిలోకి దిగిన ఎమ్మెల్యే సతీమణి బత్తుల వెంకటలక్ష్మి ఘోర పరాజయం పాలయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరుటూరి శ్రీహరి బాబు చేతిలో ఏకంగా 2,607 ఓట్ల భారీ తేడాతో ఆమె పరాజయం పాలయ్యారు.
అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా కూటమి సర్కార్.. సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే స్వంత నియోజకవర్గంలో ఆయన భార్యనే ఓడించి, జిల్లాలోనే ఏకైక జడ్పీటీసీ పీఠాన్ని పార్టీ ఖాతాలో వేయడం తీవ్ర చర్చనీయాంశంగీ మారింది. అయితే దీని వెనుక మాజీ ఎమ్మెల్యే అయిన జక్కంపూడి రాజా క్షేత్రస్థాయి రాజకీయ చాణక్యం స్పష్టంగా కనిపిస్తోందనే సమాచారం వినిసిస్తుంది. ఈ ఫలితాల లెక్కింపులో మొదటి రౌండ్ నుంచే ప్రజా తీర్పు ఎంత ఏకపక్షంగా ఉందో మనకు అర్థమవుతుంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ వైఎస్సార్సీపీ అభ్యర్థి కరుటూరి శ్రీహరి బాబు పూర్తి లీడ్ ని ప్రదర్శించారు. ఒకానొక దశలో ఆయన లీడ్ ఏకంగా 4,500 ఓట్లకు పైగా దూసుకెళ్లింది. దీంతో ఆఖరి రౌండ్ పూర్తయ్యేసరికి అధికార పార్టీ నాయకులకు ఏమాత్రం చాన్స్ ఇవ్వకుండా ఈ ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో విజయం సాదించారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బలరామకృష్ణ తన అధికారాన్ని, కూటమి యంత్రాంగం పూర్తిస్థాయిలో ప్రయోగించినప్పటికీ.. స్వయంగా తన భార్యను గెలిపించుకోలేకపోవడం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచీ నియోజకవర్గంలో సాగిన విచ్చలవిడి మట్టి, ఇసుక అక్రమ తవ్వకాల ఆరోపణలు, పాలనలో భార్య షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారంటూ ఓ పక్క వచ్చిన విమర్శలపై ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తే ఈ ఘోర పరాజయానికి ప్రధాన కారణంగా అరి సమాచారం. అన్నింటికంటే ఎమ్మెల్యే బత్తులకు కోలుకోలేని దెబ్బ తగిలింది ఆయన స్వగ్రామమైన గాదరాడలోనే! ఒక ప్రజాప్రతినిధికి స్వంత ఊరే రాజకీయ పునాది. కానీ ఆ పునాదే కదిలిపోయింది.
Also Read: మేడ్చల్‌లో పౌరసరఫరాల శాఖ దాడులు.. 10 మందిపై క్రిమినల్ కేసులు నమోదు!
గాదరాడ గ్రామంలోని రెండు ఎంపీటీసీ స్థానాల్లో జనసేన పార్టీ కనీసం తన గుర్తుపై పోటీ చేసే ధైర్యం కూడా చేయలేకపోయింది. గ్రామంలో పార్టీ పరిస్థితిపై అనుమానంతో ఆ రెండు సీట్లను టీడీపీకి వదిలేయాల్సి వచ్చింది. అయినప్పటికీ ఫలితం మారలేదు. ఎమ్మెల్యే స్వగ్రామంలోని ఒక ఎంపీటీసీ స్థానాన్ని వైసీపీ పార్టీ కైవసం చేసుకోగా, మరో స్థానంలో కూటమి అభ్యర్థి స్వల్ప మెజార్టీతో గెలిచారు. స్వగ్రామంలోనూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సరిగ్గా ఇక్కడే మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నాయకత్వ పటిమ నిరూపితమైంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినా.. కుంగిపోకుండా కేడర్‌ను వెన్నంటి నడిపించారు. నామినేషన్ల ఘట్టం నుంచి కౌంటింగ్ వరకు ప్రతి అడుగులోనూ అండగా నిలిచి, అధికార కూటమి దౌర్జన్యాలను, ప్రలోభాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.
సీతానగరంలో ఎమ్మెల్యే భార్యపైనే అభ్యర్థిని నిలబెట్టి, వ్యూహాత్మకంగా ప్రచారం నడిపించి జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవడం రాజా సాధించిన అతిపెద్ద రాజకీయ విజయం ఇది. ఎమ్మెల్యే స్వంత ఊళ్లోనే పార్టీని గెలిపించి, సీతానగరం ఎంపీపీ, జడ్పీటీసీలను వైఎస్సార్సీపీ వశం చేయడంలో రాజా చూపిన దూకుడు కేడర్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. మొత్తంగా చూస్తే.. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో గ్రామాల్లో సాగించిన దోపిడీకి, స్థానిక ప్రజాప్రతినిధుల తీరుకు రాజానగరం ఓటర్లు తమ ఓటుతోనే గట్టి సమాధానం చెప్పారని మనం అనుకోవచ్చు. ఎమ్మెల్యే స్వగ్రామంలోనే ప్రజలు ఎదురుతిరగడం, సతీమణి ఘోరంగా ఓడిపోవడం బత్తుల బలరామకృష్ణ రాజకీయ భవిష్యత్తుకు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
Also Read: కాళ్ళకి చెప్పులు లేవు… కానీ కళ్ళలో వరల్డ్ కప్ కల… ఏడుగురు కుర్రాళ్ల అన్‌స్టాపబుల్ గూస్బంప్స్ స్టోరీ