ZPTC Counting: పార్వతీపురం మన్యం జిల్లాలోని జెడ్పీటీసీ (ZPTC) ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బలిజిపేట జెడ్పీటీసీ స్థానానికి సంబంధించిన కౌంటింగ్ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) నాయకులకు, ఎన్నికల అధికారులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది.
బలిజిపేట జెడ్పీటీసీ స్థానంలో పోలైన ఓట్ల సంఖ్యపై లెక్కింపు సమయంలో తీవ్ర వ్యత్యాసం వచ్చిందని YCP నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల పోలింగ్ రోజున మొత్తం 3,4053 ఓట్లు పోలైనట్లు అధికారికంగా నమోదు కాగా, కౌంటింగ్ సమయంలో ఏకంగా 1,000 ఓట్లు అదనంగా చూపిస్తున్నారని వారు మండిపడ్డారు. లెక్కల్లో ఈ వ్యత్యాసం ఎలా వచ్చిందో అధికారులు స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు.
అధికారులు ఈ వ్యత్యాసానికి సరైన కారణాలు చెప్పకుండా నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని YCP నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ, స్పష్టమైన సమాధానం వచ్చే వరకు కౌంటింగ్ కేంద్రం వద్దే ధర్నా చేపడతామని హెచ్చరించారు. దీంతో కౌంటింగ్ సెంటర్ వద్ద వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read: ఇళ్లు మంజూరైనా పనులు ప్రారంభించకపోతే రద్దే: మంత్రి పొన్నం ప్రభాకర్!