Central Cabinet: ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సంబరాల్లో మునిగితేలుతున్న టీడీపీకి మరో శుభవార్త ఎదురైంది. కేంద్ర కేబినెట్ లో ఇద్దరు టీడీపీ ఎంపీలకు చోటు దక్కింది. రేపు వీళ్లిద్దరూ కూడా మోదీతోపాటు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ లో ఆదివారం రాత్రి 7.15 గంటలకు భారత ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ తరువాత మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎన్డీఏ కూటమికి అధిక సీట్లు రావడంతో కేంద్రంలో అధికారాన్ని దక్కించుకుంది.
ఈ క్రమంలో ఎన్డీఏలో భాగమైనటువంటి టీడీపీకి కూడా కేంద్రమంత్రి పదవులు దక్కాయి. ప్రస్తుతం రెండు కేంద్రమంత్రి పదవులు దక్కాయి. ఈ రెండు పదవులకు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ల పేర్లు ఖరారయ్యాయి. రామ్మోహన్ నాయుడికి కేంద్ర కేబినెట్ హోదా, పెమ్మసాని చంద్రశేఖర్ కు కేంద్ర సహాయ మంత్రి పదవి ఖరారైనట్లు ఢిల్లీ వర్గాలు శనివారం వెల్లడించాయి.
అయితే వీరికి కేంద్రంలో ఏ శాఖ దక్కనుందనేది మాత్రం ఇంకా తెలిసిరాలేదు. ఈ విషయమై ఉత్కంఠ నెలకొన్నది. పట్టణాభివృద్ధి, జలవనరుల శాఖ, పరిశ్రమల శాఖలను టీడీపీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటు తెలంగాణకు చెందిన ఇద్దరు ఎంపీలకు కూడా కేంద్రమంత్రి పదవులు దక్కినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీ తాజా, మాజీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు మోదీ కేబినెట్ లో బెర్త్ లు ఖరారు అయినట్లు సమాచారం. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఇటు బండి సంజయ్ కరీంనగర్ నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. దీంతో ఈసారి మోదీ కేబినెట్ లో తెలుగు రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత దక్కినట్లు అయ్యింది. మరికొంతమందికి కూడా కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.
Also Read: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రేపు, ఎల్లుండి రామోజీరావుకు..
కాగా, కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇటు జేడీయూ కూడా కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నది. ఈ క్రమంలో జేడీయూకు కూడా మంత్రి పదవులు దక్కినట్లు తెలుస్తోంది.