Roja gave clarity to continue in ysrcp : ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ నుంచి కొందరు కీలక నేతలు వెళ్లిపోతున్నారంటూ వార్తలొస్తున్నాయి. వీళ్లలో ప్రధమంగా చెప్పుకోవాల్సింది మాజీ మంత్రి రోజా గురించి. కొంతకాలం తెలుగుదేశంలో ఉండి చంద్రబాబుతో తన రాజకీయ ప్రయాణం కొనసాగించారు రోజా. అయితే టీడీపీతో విభేదించి అదే సమయంలో వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని డిసైడ్ చేసుకున్నారు. అందులో భాగంగానే వైఎస్ఆర్ సీపీ లో చేరిపోయారు. మొదటి నుంచి డ్యాషింగ్ బిహేవియర్ తో ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నారు రోజా. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ ఒక్కో సందర్భంలో హద్దులు కూడా దాటి వారిపై విరుచుకుపడ్డారు.
వివాదాస్పద వ్యాఖ్యలు
ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేసి వారిపై రోజా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఒక్కో సందర్భంలో ఏక వచన ప్రయోగానికి సైతం వెనకాడలేదు. చంద్రబాబు ముసలి వారయ్యారని, లోకేష్ కు రాజకీయ పరిణితి లేదని, పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మంటూ రోజా చేసిన వ్యాఖ్యలకు తెలుగు తమ్ముళ్లు కూడా ధీటైన జవాబులు ఇచ్చారు అప్పట్లో. ఇక చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు చంద్రబాబు భార్య లోకేశ్వరిపై రోజా చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు కూడా మండిపడ్డాయి. మొత్తానికి మొన్నటి ఎన్నికలపై ఈ ప్రభావమంతా కలిపి రోజా ఓటమికి కారణమయ్యాయి. అయితే ఎన్నికల ముందు తాము తప్పక గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు రోజా. వైఎస్ జగన్ ఇచ్చిన వై నాట్ వన్ సెవంటీ ఫైవ్ నినాదానికి మద్దతుగా ప్రచారం చేశారు. మళ్లీ రాబోయేది తమ ప్రభుత్వమే అంటూ చంద్రబాబుకురాజకీయ భవిష్యత్తు లేదని..ఇక ఆ పార్టీ కోలుకోవడం చాలా కష్టమని వ్యాఖ్యానాలు చేశారు. అయితే అనూహ్యంగా వైఎస్ఆర్ సీపీ కేవలం 11 స్థానాలతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది.
అజ్ణాతంలో రోజా
ఆ పార్టీలో మంత్రులంతా దాదాపు స్వీప్ అవుట్ అయ్యారు. ఎన్నికల తర్వాత రోజా చాలా రోజుల దాకా మీడియా ముందుకు సైతం రాలేదు. అజ్ణాతంలో ఉండిపోయారు. తమిళనాడులో ఉండిపోయారు.
అయితే రోజా అజ్ణాతంలో ఉండేసరికి ఇక రోజా రాజకీయాలకు దూరం అవుతూందని..మళ్లీ జబర్దస్త్ షోకి గెస్ట్ గా వెళుతున్నారని ప్రచారం జరిగింది. అదేకాదు తమిళనాడులో ఉన్న రోజాకి హీరో విజయ్ తన పార్టీలో చేరవలసిందని ఆఫర్ ఇచ్చారని..ఇక తెలుగు రాజకీయాలకు రోజా దూరం అవుతుందని ప్రచారం జరిగింది. పైగా రోజాపై అధికార పక్షం కేసులు కూడా మోపింది. గత ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్రా అంటూ నిర్వహించిన కార్యక్రమానికి కోట్లలో నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలతో రోజా తదితరులపై కేసులు బుక్ అయ్యాయి. అయితే రీసెంట్ గా రోజా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు.
మంగళగిరిలో క్లారిటీ
మంగళగిరిలో జగన్ జరిపిన పార్టీ కీలక సమావేశంలో రోజా కూడా పాల్గొన్నారు. జగన్ కు తన సంపూర్ణ మద్దతు తెలిపారు. తిరుపతి నియోజకవర్గం నేతలలో కూడా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ తో కలిసి ఫొటోలు కూడా దిగారు. ట్విట్టర్ వేదికగా తన ఫొటోలను కూడా షేర్ చేశారు. దీనితో రోజా వైఎస్ఆర్ సీపీకి దూరం అవ్వలేదని అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. జగన్ కూడా ఇకపై పార్టీ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని, ప్రజలతో మమేకం అయ్యేలా కార్యకర్తలను, కీలక నేతలను ఆదేశించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది తమ పార్టీయే అని భరోసా ఇచ్చారు. దీనితో కార్యకర్తల్లో ఉత్సాహం కూడా పెరిగినట్లయింది. మొత్తానికి రోజా పార్టీని వీడుతారన్న ఊహాగానాలకు తెరపడినట్లయింది.