Srikakulam News: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దురదృష్టకరమైన తొక్కిసలాట ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ‘కాశీబుగ్గ ఆలయం పూర్తి గా ప్రైవేట్ వ్యక్తులు అధీనం లో ఉన్న దేవాలయం’ అని స్పష్టం చేశారు. ఈ ఆలయానికి దేవాదాయ శాఖకు లేదా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
25వేల మంది భక్తులు రావడంతో..
దాదాపు రెండు వేల నుంచి మూడు వేల మందిని మాత్రమే పట్టే ఈ దేవస్థానానికి ఒక్కసారిగా 25 వేల మంది భక్తులు రావడంతో ఈ దురదృష్టకర ఘటన చోటు చేసుకుందని మంత్రి వివరించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా, ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్న ఆలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. ఆలయాన్ని నడుపుతున్న ప్రైవేట్ వ్యక్తులు ఎటువంటి సమాచారాన్ని ప్రభుత్వానికి లేదా దేవాదాయ శాఖకు అందించలేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
ALSO READ: Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం.. బీఆర్ఎస్ గుండెల్లో గుబులు..!
ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్
స్థానిక జిల్లాకే చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కూడా ఈ ఘటనపై స్పందించారు. కాశీ బుగ్గ – పలాస శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఘటనలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ALSO READ: BSF Jobs: బీఎస్ఎఫ్ నుంచి కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, భారీ శాలరీ
ప్రైవేట్ ఆధీనంలో ఉన్న ఆలయాల్లో భద్రతా ప్రమాణాలపై తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఈ విషాద ఘటన మరోసారి గుర్తు చేసింది. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ఇంత పెద్ద సంఖ్యలో భక్తులను అనుమతించడంపై ప్రైవేట్ ఆలయ నిర్వాహకులపై చర్యలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి.