CM Chandrababu: నిద్రలో కూడా తాను ప్రజల గురించే ఆలోచిస్తుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి పర్యటనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం మాట్లాడారు. అభివృద్ధి జరిగితేనే సంక్షేమ పథకాలను అమలు చేయగలమని స్పష్టం చేశారు.
‘నేను కూడా బటన్ నొక్కవచ్చు, పరదాలు కట్టుకుని ఉండవచ్చు, కానీ ప్రజలతోనే ఉండాలని, వారికి నేరుగా సేవలందించాలని భావించాను. అందుకే మీ ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నా’ అని ముఖ్యమంత్రి తెలిపారు. పింఛన్ల పంపిణీలో కచ్చితంగా పాల్గొంటానని, ఇందుకోసం సంవత్సరానికి రూ. 33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. ఇది దేశంలోనే మరే రాష్ట్రం పెట్టని ఖర్చు అని పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ. 57,764 కోట్లు పింఛన్లు ఇచ్చామని.. ఇది దేశంలోనే అతిపెద్ద డీబీటీ కార్యక్రమమని తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లాలో 2.64 లక్షల మందికి రూ. 116 కోట్లు, కదిరిలో 43 వేల మందికి రూ. 19 కోట్లు ఇస్తున్నామన్నారు.
ఐటీ యుగం రాబోతుందని 25 ఏళ్ల క్రితమే చెప్పానని.. అందుకే హైటెక్ సిటీ నిర్మించామని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ కృషి వల్లే ఈ రోజు ప్రపంచంలో తెలుగువారు లేని దేశం లేదన్నారు. విశాఖపట్నంలో గూగుల్ వారు రూ. 1.50 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. రాయలసీమలో కరవును పోగొట్టి, హంద్రీనీవా నీరు తెచ్చి కరవు జిల్లాలో కియా కార్లు తయారయ్యేలా చేశామన్నారు. రాయలసీమను రతనాల సీమ చేస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
ఇటీవల వచ్చిన ‘మొంథా’ తుఫాను నష్టాన్ని కేవలం 5 రోజుల్లోనే రైతాంగం కోలుకునేలా చేశామన్నారు. రూ. 5,250 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని, కేంద్రాన్ని సాయం చేయాలని కోరామన్నారు. రియల్ టైం మానిటరింగ్ ద్వారా సహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహించామని తెలిపారు. కొంతమంది తమ సొంత నియోజకవర్గమైన పులివెందులకు కూడా నీరు ఇవ్వలేదని, యూరేనియం ప్లాంట్ తీసుకొచ్చి అలజడులు సృష్టించారని పరోక్షంగా విమర్శించారు. వివేకానంద హత్యపై, కర్నూలు బస్సు ప్రమాదంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ‘ఫేక్ పార్టీ’ అని, రౌడీలు, ముఠాలను పూర్తిగా తరిమికొడతామని హెచ్చరించారు.
ఈ నెల 13 నుంచి 23 వరకు శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నామని, పుట్టపర్తిని స్పిర్చువల్ సెంటర్ గా మారుస్తామని తెలిపారు. కదిరిలో అడిషనల్ జిల్లా కోర్టు, మైనార్టీ పాఠశాలలు, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి అన్నారు.