జీవితంలో చిన్న చిన్న సమస్యలకే ఒత్తిడికి గురవుతున్నారా..? లైఫ్ లో ఎదురువుతున్న సమస్యలకు తలలు పట్టుకుంటున్నారా…? ఇలా ఇంట్లో, ఆఫీసులో ఎక్కడైనా కొద్ది పాటి ప్రాబ్లెమ్స్ కూడా పేస్ చేయలేకపోతున్నారా..? ఇలాంటి వాటి నుంచి ఎలా బయటపడాలి.. అని ఆలోచిస్తున్నారా.. నిన్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్ట్రెస్ గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు.. సోమవారం సాయంత్రం ఏయూ శతాబ్ది ఉత్సవాలకు హాజరైన సందర్భంగా ఆయన తన జీవితంలో జరిగిన ముఖ్యమైన విషయాల గురించి చక్కగా వివరించారు.
సచిన్ టెండూల్కర్ విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహం నింపారు. తన జీవిత అనుభవాలను పంచుకుంటూ ప్రస్తుత కాలంలో యువత ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సచిన్ వేదికపైకి రాగానే విద్యార్థుల కేరింతలు ‘సచిన్.. సచిన్..’ అంటూ నినాదాలతో ప్రాంగణం మార్మోగిపోయింది. అభిమానులు ఆయన చిత్రాలను ప్రదర్శిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించి తమ గురువులకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని అన్నారు.
ఎక్కువగా ఆలోచించవద్దు..
ప్రతి మనిషి జీవితంలో ఒత్తిడి ఉండడం కామన్ అని సచిన్ అభిప్రాయపడ్డారు. ఇది అంతర్గతంగా లేదా బహిర్గతంగా కారణాల వల్ల కలగవచ్చునని చెప్పారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఏ స్థాయిలో ఒత్తిడి ఉన్నా దానికి తగిన ప్రాధాన్యమిస్తూ అధిగమించే ప్రయత్నం చేయాలని సూచించారు. ఒత్తిడి గురించి వీలైనంత తక్కువగా ఆలోచించాలని వివరించారు. క్రికెట్ మైదానంలో పరుగులు రాబట్టే సమయంలో తాను పూర్తి ఏకాగ్రతతో ఉండేవాడినని.. అదే రికార్డుల నమోదుకు మార్గం సుగమం చేసిందని గుర్తు చేసుకున్నారు. ఆటలో విఫలమైనప్పుడు నిరాశ చెందకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
రాత్రికి రాత్రే విజయాలు రావు..
ఏ రంగంలోనైనా రాత్రికి రాత్రే విజయాలు లభించవని సచిన్ స్పష్టం చేశారు. గమ్యాన్ని చేరుకోవడానికి సమయం పడుతుందని.. సరైన మార్గంలో పయనిస్తూ ఓపికతో నిరీక్షించాలని చెప్పారు. విజయాల సాధన కోసం విద్యార్థులు ఎప్పుడూ షార్ట్‌కట్ మార్గాలను వెతకకూడదని సూచించారు. సుదూర లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయని వివరించారు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే విజయానికి అసలైన గుర్తింపు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
తన తండ్రి జీవిత ప్రయాణం తనకెంతో స్ఫూర్తినిచ్చిందని సచిన్ వెల్లడించారు. బాల్యంలో తాము రెండు గదుల ఇంట్లోనే నివసించామని.. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని తెలిపారు. తన తండ్రి చదువుపై ఏకాగ్రత చూపడం వల్లే ప్రొఫెసర్ అయ్యారని చెప్పారు. తాను క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆయన ఎప్పుడూ ఒత్తిడి తీసుకురాలేదని.. తనపై నమ్మకం ఉంచారని గుర్తు చేసుకున్నారు. తాను పాటలు వింటున్నా తండ్రి తన పుస్తక పఠనంలో నిమగ్నమయ్యేవారని.. సౌండ్ తగ్గించమని కూడా అడిగేవారు కాదని పేర్కొన్నారు. తండ్రిలోని ఆ ఏకాగ్రతే తనను లక్ష్యాల వైపు నడిపించిందని సచిన్ భావోద్వేగంగా వివరించారు.
ALSO READ: ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కు శంకుస్థాపన.. గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతామన్న సీఎం రేవంత్ రెడ్డి