Shakti Cyclone: బంగాళాఖాతంలో వాతావరణం మరోసారి తీవ్ర స్థాయిలో మారుతోంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఇప్పుడు శక్తివంతమైన తుఫాన్ గా మారే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ ప్రభావం స్పష్టంగా తెలుగు రాష్ట్రాలపై పడనుందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలు, తెలంగాణలోని ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.
ఈ తుఫాన్ దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానుంది. గాలి మధ్యపొరల్లో సుమారు 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించింది. ఈ అల్పపీడనం మరింత బలపడుతూ, తమిళనాడు తీరాన్ని దాటి ఉత్తర దిశగా కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది రానున్న రెండు రోజుల్లో తుఫాన్ గా మారే అవకాశం ఉంది.
వారం రోజులు..
ఈ తుపాను ప్రభావం వల్ల నేటి నుంచే వర్షాలు మొదలవుతాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు నమోదవుతాయని అధికారులు ప్రకటించారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రభావం ఏడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 30 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మేఘావృత వాతావరణం కారణంగా ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని కూడా ప్రకటన వెలువడింది.
ఏయే జిల్లాలకు ప్రభావం..
ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలలో శక్తి తుఫాన్ అధిక ప్రభావం చూపనుంది. తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు ఒక్కసారిగా తీవ్రమవుతాయి. రహదారులపై నీరు చేరి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.
జాగ్రత్తలు..
అవసరం లేని ప్రయాణాలు చేయడం మానుకోవాలి. విద్యుత్ తీగలు, చెట్ల కింద ఆశ్రయం తీసుకోకుండా ఉండాలి. పాత భవనాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు, వృద్ధులు ఇంట్లోనే ఉండేలా చూసుకోండి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని అధికారులు ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఆన్‌లైన్ వాతావరణ అప్డేట్లు రెగ్యులర్‌గా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖలు ఇప్పటికే అప్రమత్తతలోకి వచ్చాయి.
Also Read: Vande Bharat Trains: వందే భారత్ ట్రైన్.. తయారీ ఖర్చు ఎంత? ఎన్ని గంటల్లో రెడీ అవుతుందంటే?
తీరప్రాంతాల ప్రజలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. శక్తి తుఫాన్ ఎంతటి ప్రమాదకర రూపం దాలుస్తుందో చెప్పలేం.
కానీ మనం ముందుగానే సరిగా జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణ నష్టం నివారించవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. శక్తి తుపాను ప్రభావం పెద్దగా ఉండకపోయినా, తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనలను పాటించాలని తెలుగు రాష్ట్రాలు, ప్రజలకు సూచించాయి.