Vande Bharat Trains: ఇండియన్స్ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. అవునండీ మన దేశంలో ఉన్న టాలెంట్ ను వెలికితీస్తే అన్నీ అద్భుతాలే. ఆ అద్భుతానికి నిదర్శనమే వందే భారత్ ట్రైన్. ఇండియన్ రైల్వే లో ఇప్పుడు వందే భారత్ ట్రైన్ ఒక చరిత్ర. స్వదేశీ హై స్పీడ్ ట్రైన్ గా వందే భారత్ ప్రత్యేక స్థానం పొందింది. జపాన్ లాంటి దేశాలు కూడా, మన ట్రైన్స్ ను చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి. అయితే వందేభారత్ ట్రైన్స్ తయారీ వెనుక ఉన్న అసలు విషయం తెలుసుకుంటే ఔరా అనేస్తారు.
మన దేశంలో 2025 మే నాటికి మొత్తం 136 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) ట్రైన్లు సేవలు అందిస్తున్నాయి. ఈ రైల్ సేవలు ప్రయాణికులకు ఒక వరం. ఏకంగా 180 కిలో మీటర్ల స్పీడ్ తో గమ్యాలకు చేర్చే ఈ రైళ్లను భారతదేశ వ్యాప్తంగా విస్తరించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. అయితే అసలు ఈ ట్రైన్స్ తయారీ ఎక్కడ? ఎంత ఖర్చవుతుంది? ఎన్ని గంటల సమయం పడుతుందో తెలుసుకుందాం.
వందే భారత్ ఎక్స్ ప్రెస్..
వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. పేరు వినగానే మనకు గుర్తొచ్చేది వేగవంతమైన రైలు, ఆధునిక సదుపాయాలు, దేశీయంగా తయారైన గొప్ప రైల్. కానీ ఈ రైలు వెనక అసలు కథేంటో తెలుసుకోవాల్సిందే. వందే భారత్ రైలును తమిళనాడులోని చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) లో తయారు చేస్తున్నారు. ఇది భారతీయ రైల్వేకు చెందిన అత్యాధునిక తయారీ యూనిట్. ఈ ఫ్యాక్టరీ 1955లో ఏర్పడినప్పటి నుంచి కోచుల తయారీలో అగ్రగామిగా కొనసాగుతోంది. వందే భారత్ రైలు తయారీతో ఇది ప్రపంచ ప్రాముఖ్యత పొందింది. అందుకే జపాన్ లాంటి దేశాలు కూడా మన రైళ్లను చూసి నివ్వెరపోతున్న పరిస్థితి.
ఎన్ని రోజుల్లో తయారవుతుంది?
ఒక వందే భారత్ ట్రైన్ సెటు అంటే 16 కోచులతో కూడిన ఒక పూర్తి రైలు తయారవ్వడానికి సగటున 4 నుండి 6 నెలలు సమయం పడుతుంది. దీని తయారీకి ఉపయోగించే పనిదినాలు సుమారుగా 3 వేల గంటల నుండి 4 వేల గంటలు పడుతుందట. ముందు మాత్రం 8 నెలల సమయం పట్టే పరిస్థితి ఉండగా, ఇప్పుడు ఏడాదికి కనీసం 6 వందే భారత్ ట్రైన్ సెట్లను తయారుచేసే సామర్థ్యం మన సొంతమైంది.
ఎంత ఖర్చవుతుంది?
ఒక వందే భారత్ రైలు తయారు చేసేందుకు సుమారుగా 110 నుండి 120 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. AC చైర్‌కార్ వేరియంట్ 16 కోచులకు సుమారుగా రూ. 100 కోట్లు,
స్లీపర్ వేరియంట్ కై రూ. 130 కోట్ల వరకూ ఖర్చవవచ్చు. ఇది ఇతర దేశాల హైస్పీడ్ రైళ్లతో పోలిస్తే 40% తక్కువ ఖర్చుతో తయారవుతుండడం విశేషంగా చెప్పవచ్చు.
వందే భారత్ రైలు ఇంజిన్ లెస్ ట్రైన్ గా రూపొందించబడింది. ప్రతి బోగీకి డైనమిక్ మోటార్లు ఉండటం వల్ల అదనపు ఇంజిన్ అవసరం ఉండదు. 160 కి.మీ వేగంతో పరుగులు, ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు, GPS ఆధారిత లొకేషన్స్ దీని ప్రత్యేకత.
Also Read: Vande Bharat Trains: వందే భారత్ కొత్త మార్గాలు.. మీ ప్రాంతం ఈ జాబితాలో ఉందా?
మొత్తం మీద ఇండియన్స్ సత్తాను ప్రపంచానికి పరిచయం చేయడంలో వందే భారత్ ట్రైన్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. కేంద్రం కూడా దేశ వ్యాప్తంగా హై స్పీడ్ ట్రైన్స్ ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో వందే భారత్ ట్రైన్ లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అయితే ఇంత ఖర్చు చేసి మరీ తయారు చేసిన వందే భారత్ ట్రైన్స్ ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందిస్తూ దూసుకెళుతున్నాయని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.