Visakha: సింహాచలం చందనోత్సవం ఘటన గురించి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ ఘటనలో ఓ ఫ్యామిలీకి చెందినవారు నలుగురు మృత్యువాత పడ్డారు. అందులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఇద్దరు ఉన్నారు. టికెట్ల కోసం వచ్చి మృత్యువాత పడ్డారు. తమవారు ఎవరైనా ఉన్నారా తెలుసుకునే పనిలో మరికొందరు ఉన్నారు.
సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిసరాల్లో జరిగిన ఘటన కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. చందనోత్సవం లో స్వామి నిజరూపం చూడాలని చాలామంది భక్తులు భావించారు. కొందరు స్వామి నిజరూపం చూడకముందే ఈ లోకాన్ని విడిచిపెట్టారు. అలాంటి వారిలో విశాఖకు చెందిన ఇద్దరు సాప్ట్‌వేర్ ఇంజనీర్లు ఉన్నారు.
ఇద్దరు టెక్కీలు మృతి
మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు, ఆయన భార్య శైలజ ఉన్నారు. ఈ దంపతులకు వివాహం జరిగి మూడేళ్లు అయ్యింది. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. తొలుత హైదరాబాద్‌లో పని చేశారు. వర్క్ ఫ్రం హోమ్ నిమిత్తం ఇంటి నుంచే విధులు నిర్వహించేవారు.
ఉదయం ఆరు గంటలకు దర్శనం పూర్తి చేసుకుని విధులకు హాజరుకావాలని భావించారు. ఎలాగూ ఇంట్లో ఉన్నామని, స్వామి నిజరూప దర్శనం చేసుకుంటే జీవితం బాగుంటుందని భావించారు. అనుకున్నట్లుగానే 300 రూపాయల టికెట్ల కోసం రాత్రి లైన్ కట్టారు ఈ దంపతులు. సాపీగా సాగిపోతున్న వారి జీవితాలపై విధి కన్నేసింది.
ALSO READ: విశాఖలో పాక్ ఫ్యామిలీకి రిలీఫ్
ఘటన విషయం తెలియగానే మహేశ్వరరావు ఇంట్లో కుటుంబసభ్యులు కంగారుపడ్డారు. ఈలోగా టీవీ ఛానెళ్లలో పేర్లు చూసి షాకయ్యారు. అటు యువతి పేరెంట్స్‌కు నోటిమాట రాలేదు. దర్శనం కోసం వెళ్తే స్వామి దంపతులను తీసుకుపోయావా అంటూ కన్నీరు మున్నీరు అయ్యారు. వెంటనే మహేష్ పేరెంట్స్ శైలజ తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. ఇరుకుటుంబాలు కేజీహెచ్‌కి వచ్చాయి.
మృతులు ఎక్కువగా స్థానికులే
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వారి మృతదేహాలను అంబులెన్స్‌లో మధురవాడకు తరలించారు. వీరిని చూసి చుట్టుపక్కలవాళ్లు షాకయ్యారు. రాత్రి వరకు తమ కళ్లు ముందు దంపతులు సరదాగా ఉండేవారు. అంతలో విధి కాటేసిందని అంటున్నారు. ఈ దంపతులతోపాటు వారి బంధువుల్లో మరో ఇద్దరు మృతి చెందారు.
సింహాచలం చందనోత్సవం ఘటనలో చనిపోయింది ఎక్కువగా స్థానికులే. మృతి చెందిన ఏడుగురులో నలుగురు మహేష్ కుటుంబానికి చెందినవారు ఉన్నారు. మరో ముగ్గురు స్థానికులున్నారు. అందులో ఒకరు స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి ఉన్నారు. స్వామి సన్నిధిలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి అని అంటున్నారు.