Venkatesh: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్న వెంకటేష్ (Venkatesh ) ఫ్యామిలీ హీరోగా మంచి పేరు దక్కించుకున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ గా సినిమాలు చేస్తూ కామెడీతో , మాస్, యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొడుతూ.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు విక్టరీ వెంకటేష్. అసలు సినిమా ఇండస్ట్రీలోకి రావడం ఇష్టం లేని ఈయన, తన తండ్రి దివంగత లెజెండ్రీ నిర్మాత రామానాయుడు (Ramanaidu) కోరిక మేరకు ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన ‘కలియుగ పాండవులు’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే నటుడిగా ప్రూవ్ చేసుకున్న ఈయన.. ఈ వయసులో కూడా ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో భారీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.
ఆయన సలహా వల్లే ఈ స్టేజ్ లో ఉన్నా – వెంకటేష్
ఇదిలా ఉండగా తాజాగా ఒక మీడియా సమావేశంలో పాల్గొన్న వెంకటేష్ ఒకానొక సమయంలో తాను చనిపోవాల్సిందని, కానీ దేవుడి దయతో బయటపడ్డానని చెప్పుకొచ్చారు. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఒక తమిళ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన వెంకటేష్.. రజనీకాంత్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. తన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి చర్చించారు. వెంకటేష్ మాట్లాడుతూ..” రజినీకాంత్ కు , నాకు ఇద్దరికీ ఆధ్యాత్మిక భావాలు ఎక్కువే. నేను ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మా నాన్నతో కలిసి ఆయన పని కూడా చేశారు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు. మన సినిమా రిలీజ్ అవుతోందంటే.. ఆ సమయంలో బ్యానర్లు కట్టారా? పోస్టర్లు వేశారా? ఆ పోస్టర్లలో మన ముఖం బాగా కనిపిస్తోందా? మ్యాగజైన్ ఫ్రంట్ పేజీలో మన ఫోటో ఉందా..? ఇలాంటి వాటి గురించి ఆలోచించకూడదు. మన పని మనం చేసుకుంటూ వెళ్లాలి అని సూచించారు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు నేను అదే ఫాలో అవుతున్నాను. పబ్లిసిటీ గురించి అసలే పట్టించుకోను. దేని గురించి కూడా ఆలోచించను”అని తెలిపారు.
ఆ క్షణం చనిపోయాను అనిపించింది – వెంకటేష్
అదే సమయంలో తనకు జరిగిన ప్రమాదం గురించి కూడా చెప్పుకొచ్చారు. ఇదే ఇంటర్వ్యూలో వెంకటేష్ మాట్లాడుతూ.. “నాకు అరుణాచలం అంటే ఎంతో ఇష్టం. రమణ మహర్షిని నేను ఆరాధిస్తాను. చిన్నప్పటినుంచి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువే. దేవుడంటే భక్తి మాత్రమే కాదు, భయం కూడా ఉంది. అందుకే భగవంతుడికి సంబంధించిన పుస్తకాలు కూడా నేనెప్పుడూ చదువుతూనే ఉంటాను. ‘ఘర్షణ’ సినిమా సమయంలో నేను ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది. ఇక ఆ క్షణం చనిపోయాను అనుకున్నాను. కానీ ఆ దేవుడి దయతోనే ఎలాంటి ప్రమాదం జరగకుండా బయటపడ్డాను” అంటూ వెంకటేష్ తెలిపారు. మొత్తానికైతే దేవుడిని నమ్ముకుంటే మనకు ఎటువంటి నష్టం, కష్టం వచ్చినా ఆయనే ఆదుకుంటారని చెప్పుకొచ్చారు వెంకటేష్. వెంకటేష్ చివరిగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో ఈ సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రాంతీయంగా రూ .300 కోట్ల క్లబ్లో చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ విషయాలు తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.