CM Revanth: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బోరబండలో జరిగిన కార్నర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచిత బస్సు రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌వాళ్లు మాట్లాడుతున్నారని.. ఇది వాళ్ల ‘గలీజ్ బుద్ధి’ అని విమర్శించారు. మహిళలకు మంత్రి పదవులు ఇవ్వని బీఆర్‌ఎస్‌కు భిన్నంగా.. తమ ప్రభుత్వంలో సీతక్క, కొండా సురేఖలకు మంత్రి పదవులు ఇచ్చామని చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అజారుద్దీన్‌ను మంత్రిని చేసి, జూబ్లీహిల్స్ ప్రజల ముందుకు తీసుకువచ్చానని ప్రకటించారు. ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.
గత ఎన్నికల్లో అజారుద్దీన్‌ను గెలిపిస్తే మంత్రిని చేస్తామని మాట ఇచ్చామని.. ఆ మాట నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ‘జూబ్లీహిల్స్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అజారుద్దీన్‌ను మంత్రి పదవి ఇచ్చి మీ ముందుకు తీసుకొచ్చా’ అని పేర్కొన్నారు. కారు షెడ్డుకు పోయిందని, ఇప్పుడు బిల్లా రంగాలు ఆటోలలో తిరిగి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఈ ప్రాంత సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని, ఇప్పుడు వచ్చి పరిష్కరిస్తామని కల్లబొల్లి మాటలు చెప్తే ఇక్కడి జనం నమ్మరని అన్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలిని ఇంటి నుంచి పంపిన వ్యక్తి సునీతమ్మను మంచిగా చూసుకుంటారా అని ప్రశ్నించారు. ఇది వాళ్ల చెల్లెలే బయటకు వచ్చి చెబుతుందని అన్నారు.
బీజేపీ నాయకులపై కూడా రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రిగా ఉండి కూడా కిషన్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి ఎందుకు నిధులు తీసుకురాలేకపోయారని నిలదీశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ది ‘ఫెవికాల్ బంధం’ అని ఆరోపించారు. 2007లో పీజేఆర్ ఆకస్మికంగా చనిపోతే.. ఏకగ్రీవంగా చేయాలనే మాట ఉన్నా అభ్యర్థిని పెట్టి ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్ అని ధ్వజమెత్తారు. పేదలను ఆదుకున్న చరిత్ర పీజేఆర్ ది అని, ఈ ప్రాంత బస్తీల్లో ఎవరి తలుపు తట్టినా పీజేఆర్ సాయం పొందినవారే ఉంటారని గుర్తుచేశారు.
ALSO READ: Weather News: మళ్లీ రాష్ట్రంలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు.. ఉరుములు, మెరుపులతో..!
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. అందరికీ రేషన్ కార్డులు.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ సన్నబియ్యం.. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. ఉచిత బస్సు రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌వాళ్లు మాట్లాడుతున్నారని.. ఇది వాళ్ల “గలీజ్ బుద్ధి” అని విమర్శించారు. మహిళలకు మంత్రి పదవులు ఇవ్వని బీఆర్‌ఎస్‌కు భిన్నంగా, తమ ప్రభుత్వంలో సీతక్క, కొండా సురేఖలకు మంత్రి పదవులు ఇచ్చామని చెప్పారు.
స్థానిక అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరుతూ.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. బోరబండ చౌరస్తాకు పీజేఆర్ పేరు పెడుతామని.. విజయయాత్రకు మళ్లీ వచ్చి ఆ చౌరస్తాకు పీజేఆర్ చౌరస్తాగా పేరు పెట్టుకుందామని ప్రకటించారు. నవీన్‌ను 30 వేల ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే.. వందల కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత నవీన్ తీసుకుంటాడని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.