Lipstick Side effects: అందంగా కనిపించాలని ప్రతి అమ్మాయి రోజూ వివిధ రకాల కాస్మెటిక్స్ ఉత్పత్తులను వాడుతుంటారు. కాలేజీ, ఆఫీసు, పంక్షన్, ఔటింగ్.. ఇలా సందర్భం ఏదైనా సరే, అమ్మాయిల పెదాలపై లిప్‌స్టిక్ ఉండి తీరాల్సిందే. అయితే, అవసరాన్ని బట్టి.. ఫంక్షన్లకు ఎప్పుడో ఒకసారి లిప్‌స్టిక్ వాడితే ఇబ్బంది లేదు. అలా కాకుండా ప్రతిరోజూ అదేపనిగా లిప్‌స్టిక్ అప్లై చేసుకుంటే.. ఈ సౌందర్య సాధనంలో దాగి ఉన్న రసాయనాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రంగుల్లో లిప్‌స్టిక్స్ దొరుకుతున్నాయి. వాటిని చూసిన అమ్మాయిలు ఆకర్షణతో ఏదిపడితే అది కొనేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న తప్పుల వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి.. లిప్‌స్టిక్‌ను కొనేటప్పుడు హానికరమైన కెమికల్స్ లేనివి చూసి ఎంపిక చేసుకోవడం ఉత్తమం. అందం కోసం ఆరోగ్యంతో రాజీ పడకుండా ఉండాలంటే, మహిళలు లిప్‌స్టిక్ ఎంపికలో అత్యంత జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.
లిప్‌స్టిక్‌లోని హానికర పదార్థాల గురించి తెలసుకోవడం, వాటిని దీర్ఘకాలం పాటు వాడటం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండటం ప్రతి అమ్మాయికి ఎంతో ముఖ్యం. మార్కెట్లో దొరికే చాలా రకాల లిప్‌స్టిక్‌ల తయారీలో కాడ్మియం, సీసం, క్రోమియం, అల్యూమినియం వంటి భారలోభాలు వాడతారని తాజా పరిశోధనల్లో తేలింది. ఈ రసాయనాలు పెదవుల ద్వారా శరీరంలోకి ప్రవేశించి కాలక్రమేణా ఒంట్లో పేరుకుపోతాయి.
ముఖ్యంగా సీసం నాడీ వ్యవస్థపై, క్రోమియం జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయి. కాడ్మియం, క్రోమియం వంటి రాసాయనాలను దీర్ఘకాలం ఉపోయోగించడం వల్ల శ్వాసకోశ, జీర్ణ సమస్యలు దెబ్బతినే ప్రమాదంతో పాటు ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా లిప్‌స్టిక్‌పై ‘లెడ్-ఫ్రీ’ లేదా ‘నాన్-టాక్సిక్’ అని స్పష్టంగా రాసి ఉన్న లేబుల్ ఉత్పత్తులను మాత్రమే ఎంచుకోవాలి. నాణ్యతలేని, చౌకైన ఉత్పత్తులకు దూరంగా ఉండటం ఉత్తమం. తినడానికి లేదా తాగడానికి ముందు పెదవులను శుభ్రం చేసుకోవడం ద్వారా శరీరంలోకి రసాయనాలు చేరే ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించవచ్చు.
ప్రస్తుత ఆధునిక యుగంలో సురక్షితమైన ప్రత్యామ్నాయాలు చాలానే అందుబాటులో ఉన్నాయి. పూర్తిగా సహజ సిద్ధమైన రంగులు, పదార్థాలతో తయారు చేసిన లిప్‌కేర్ ఉత్పత్తులను వాడటం మంచిది.
ఇంట్లోనే బీట్‌రూట్, కోకో బటర్ వంటి సహజ పదార్థాలతో లిప్ కలర్స్‌ను తయారు చేసుకోవచ్చు. అందాన్ని పెంచే క్రమంలో ఆరోగ్యాన్ని పణంగా పెట్టకుండా, వినియోగదారులు మేకప్ ఉత్పత్తుల్లోని పదార్థాలపై దృష్టి పెట్టడం, సురక్షితమైన, ప్రమాద రహిత ఉత్పత్తులను ఎంపిక చేసుకోవడం ద్వారానే దీర్ఘకాలికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు.