Heart Attack: ఛాతిలో నొప్పి లేదా అసౌకర్యం కలిగినప్పుడు.. చాలా మంది అది కేవలం గ్యాస్ సమస్య వల్ల వచ్చిందని తేలికగా తీసుకుంటారు. మనం మామూలు ‘గ్యాస్’ అని కొట్టి పారేసే లక్షణాలు కొన్ని సార్లు నిశ్శబ్దంగా వచ్చే గుండెపోటు యొక్క ప్రారంభ సంకేతాలు కావచ్చు. ఈ పొరపాటు ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా.. ఛాతీ పైభాగంలో లేదా కడుపు పైభాగంలో కలిగే అసౌకర్యాన్ని ప్రజలు అజీర్ణం లేదా గ్యాస్ సమస్యగా భావించడం సర్వసాధారణం. అయితే.. ఈ హాని రహితంగా కనిపించే లక్షణాలు, కొన్ని సార్లు గుండెపోటు హెచ్చరిక సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. చాలా మంది వ్యక్తులు గుండె జబ్బులకు సాధారణంగా కనిపించే ఛాతీ నొప్పి లేకుండానే గ్యాస్ సమస్య లాంటి లక్షణాలను కలిగి ఉంటారు.
గుండెపోటు లక్షణాలు గ్యాస్‌ను ఎలా పోలి ఉంటాయి ?
గుండెపోటు అంటే.. కేవలం తీవ్రమైన ఛాతీ నొప్పి మాత్రమే కాదు. అనేక సందర్భాల్లో ముఖ్యంగా వృద్ధులు, మహిళల్లో.. గుండెపోటు లక్షణాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి.
ఛాతీలో భారంగా అనిపించడం: కొందరికి గ్యాస్ లేదా అజీర్ణం వల్ల ఛాతీలో భారంగా అనిపించవచ్చు. కానీ గుండె పోటు వచ్చినప్పుడు కూడా ఛాతీ మధ్యలో ఒత్తిడి, బిగుతుగా లేదా బరువుగా అనిపించవచ్చు.
కడుపు ఉబ్బరం లేదా తరచుగా తేన్పులు: గుండెపోటు వచ్చే ముందు లేదా వస్తున్నప్పుడు కూడా కడుపు పైభాగంలో నొప్పి, ఉబ్బరం లేదా అధిక తేన్పులు వంటి జీర్ణ సంబంధిత లక్షణాలు కనిపిస్తాయి. వీటిని చాలా మంది తేలికగా గ్యాస్ సమస్యగా భావించి సమయాన్ని వృథా చేసుకుంటారు.
గుండెల్లో మంట, గుండెపోటు: గుండెల్లో మంట (ఆసిడ్ రిఫ్లక్స్), గుండె పోటు మధ్య తేడాను గుర్తించడం సవాలు అనే చెప్పొచ్చు. ఈ రెండూ ఛాతీలో మంట లేదా బిగుతును కలిగిస్తాయి. యాంటాసిడ్స్ వేసుకుంటే.. నొప్పి తగ్గితే అది గుండెల్లో మంట అయ్యే అవకాశం ఉంటుంది. కానీ విపరీతంగా ఛాతీ నొప్పి వస్తుంటే దాన్ని అత్యవసర పరిస్థితిగా భావించాలి.
Also Read: కిడ్నీ స్టోన్స్ సమస్యా ? పొరపాటున కూడా ఇవి తినొద్దు !
ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి ?
నిశ్శబ్ద గుండె పోటు లక్షణాలు: తీవ్ర మైన నొప్పి లేకుండా.. ఛాతీలో తేలిక పాటి అసౌకర్యం, ఉబ్బరం లేదా అసాధారణమైన భారం పదే పదే వస్తుంటే.. ఇది నిశ్శబ్ద గుండెపోటుకు సంకేతం కావచ్చు.
అసాధారణ లక్షణాలు: వికారం, అజీర్ణం, కడుపు నొప్పి, అలసట, స్వల్పంగా ఊపిరి ఆడక పోవడం, చల్లని చెమటలు లేదా మెడ, దవడ, చేయి లేదా వీపు వరకు నొప్పి వ్యాపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి.
ఎవరు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ?
ముఖ్యంగా అధిక రక్తపోటు , మధుమేహం , ఊబకాయం లేదా కుటుంబంలో గుండె జబ్బులు ఉన్నవారు ఈ సూక్ష్మ సంకేతాలను మరింత శ్రద్ధగా గమనించాలి. వృద్ధులు, దీర్ఘకాలంగా రక్తపోటు ఉన్న మహిళలు నిశ్శబ్ద గుండెపోటు బారిన పడే అవకాశం ఎక్కువ.