Tirumala accident: తిరుమలలో గురువారం ఉదయం భయానక రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్‌లోని 26వ మలుపు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రేక్ ఫెయిల్ అయిన కారు నియంత్రణ కోల్పోయి వేగంగా దూసుకువెళ్లి ముందు వెళ్తున్న బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని భక్తులు అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
సాక్షుల వివరాల ప్రకారం, కారులో ఉన్న ప్రయాణికులు తిరుమల నుంచి కిందకు దిగుతున్న సమయంలో వాహనం బ్రేక్ సడన్‌గా పనిచేయకపోవడంతో కారు అదుపుతప్పింది. క్షణాల్లోనే కారు వేగం పెరిగి, ఆ ముందు నడుస్తున్న బస్సు వెనుకభాగాన్ని ఢీకొట్టింది. హెయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో కారు లోపలున్నవారికి పెద్దగా ఎలాంటి ప్రమాదం జరగకపోయినా, కొందరు భక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి.
ప్రయాణికుల సమాచారం ప్రకారం, బస్సులోని భక్తులు విజయవాడకు చెందిన వారని, ఈ ప్రమాదంలో దాదాపు పది మందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని వెంటనే తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) దగ్గర ఉన్న ప్రాథమిక చికిత్సా కేంద్రానికి తరలించారు. కొందరిని మరింత వైద్య సహాయం కోసం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
ట్రాఫిక్‌కు అంతరాయం
ఈ ప్రమాదంతో కొంతసేపు ఘాట్ రోడ్‌లో ట్రాఫిక్ స్తంభించింది. కారు, బస్సు రెండూ రోడ్డుమధ్య ఆగిపోవడంతో పైకి, కిందకు వెళ్తున్న వాహనాలకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి, వాహనాలను పక్కకు జరిపి రాకపోకలు సవ్యంగా జరిగేలా చేశారు. స్థానిక డ్రైవర్ల మాటల్లో, తిరుమల ఘాట్ రోడ్‌లోని మలుపులు చాలా కఠినంగా ఉంటాయి. బ్రేక్ ఫెయిల్ వంటి సమస్యలు ఎదురైనప్పుడు ప్రమాదాలు తప్పవు. కాబట్టి డ్రైవర్లు వాహనాల పరిస్థితిని ముందుగానే చెక్ చేసుకోవాలని సూచించారు.
అదృష్టం తో భక్తులకు తప్పిన పెను ప్రమాదం
ప్రమాదంలో బస్సులో ఉన్న భక్తులు ప్రాణాలతో బయటపడటాన్ని దైవకృపగా భావిస్తున్నారు. మేము శ్రీవారిని దర్శించుకుని కిందకు వెళ్తున్నాం. ఒక్కసారిగా గట్టి శబ్దం వచ్చింది. అందరూ కాసేపు షాక్ అయ్యాం. అదృష్టవశాత్తూ పెద్దగా ఎవరికీ ఏమి కాలేదని గాయపడిన భక్తుల్లో ఒకరు తెలిపారు.
Also Read: AP Smart cities: 12 నగరాలకు కొత్త రూపం.. అక్కడ కోట్లల్లోనే ఖర్చు!
పోలీసుల చర్యలు
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, కారు బ్రేక్ ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని అనుకుంటున్నాం. వాహనాన్ని స్వాధీనం చేసుకొని మెకానికల్ పరీక్షలు జరుపుతాం. డ్రైవర్ నిర్లక్ష్యం ఉందేమో అన్నది కూడా పరిశీలిస్తామని తిరుమల ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
తిరుమలలో భద్రతా చర్యలు
తిరుమల ఘాట్ రోడ్‌లో భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో, తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటుంటాయి. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం (TTD), పోలీసు శాఖలు తరచూ డ్రైవర్లకు సూచనలు జారీ చేస్తుంటాయి. వాహనాల బ్రేక్ సిస్టమ్, టైర్ల స్థితి, స్టీరింగ్ వంటి విషయాలను చెక్ చేసుకోవడం తప్పనిసరి అని అధికారులు పునరుద్ఘాటిస్తున్నారు. అలాగే, వేగాన్ని కంట్రోల్‌లో ఉంచడం, మలుపుల దగ్గర హారన్ వాయించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి అని సూచిస్తున్నారు. ఘాట్ రోడ్లలో అధిక వేగం ప్రమాదాలకు దారితీస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రమాదం మరోసారి తిరుమల ఘాట్ రోడ్లలో జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం ఎంత అవసరమో గుర్తు చేసింది. భక్తుల భద్రత కోసం అధికారులు మరిన్ని సీసీ కెమెరాలు, సిగ్నేజీలు, స్పీడ్ కంట్రోల్ బోర్డులు ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు.